Tuesday, July 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌‌ను పునరుద్ధరించండి

‌సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌‌ను పునరుద్ధరించండి

- Advertisement -

2023 నుంచి డీఏ బకాయిలను విడుదల చేయాలి : ఈహెచ్‌ఎస్‌ జీవోను సవరించాలి
సీఎస్‌ సంజయ్‌‌జాజుకు టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీం (సీపీఎస్‌)‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ ‌విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ‌సంజయ్‌‌జాజును సోమవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన సీపీఎస్ విధానం ఉద్యోగుల ఉద్యోగ విరమణ అనంతర సామాజిక భద్రతను పూర్తిగా దెబ్బతీసిందని తెలిపారు. ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన రెండు వేల మంది సీపీఎస్ ఉద్యోగులు అత్యల్ప పెన్షన్‌తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీపీఎస్‌ను రద్దు చేసి వెంటనే ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను సీపీఎస్ ఉద్యోగులందరికీ ఒకే విడతలో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ బకాయిలు ఉద్యోగులకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఈహెచ్‌ఎస్ జీవో నెంబర్‌ 79లో ఉద్యోగ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగుల నుంచి చివరి బేసిక్ పే ఆధారంగా 1.5 శాతం చందా వసూలు చేయాలనే నిబంధన తీవ్ర అన్యాయమని తెలిపారు. ప్రస్తుతం వారికి వస్తున్న స్వల్ప పెన్షన్‌తో పోలిస్తే ఈ చందా భారమని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ చందా మొత్తం నెలవారీ పెన్షన్‌కన్నా ఎక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఉద్యోగ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ చందాను చివరి బేసిక్ పే ఆధారంగా కాకుండా, ఉచిత వైద్య సౌకర్యం కల్పించేలా ఆ జీవోను తక్షణమే సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -