Thursday, July 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపెన్షనర్ల సొమ్ముషేర్‌ ‌మార్కెట్లో పెట్టడం ఏంటి?

పెన్షనర్ల సొమ్ముషేర్‌ ‌మార్కెట్లో పెట్టడం ఏంటి?

- Advertisement -

ఆ కంపెనీలన్నీ అదానీ, అంబానీలవే…
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై పోరుబాట తప్పదు
టాప్రా పెన్షనర్ల సదస్సులో ఏఐఎస్‌‌జీపీఎఫ్‌ అధ్యక్ష‍ులు సురేంద్ర చౌదరి

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సొమ్మును షేర్‌ ‌మార్కెట్లలో పెట్టి ‘జూదం’ ఆడటం ఏంటని ఆలిండియా స్టేట్‌ ‌గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ‌ఫెడరేషన్‌ (ఏఐఎస్‌‌జీఈఎఫ్‌) అధ్యక్ష‍ులు సురేంద్ర చౌదరి అన్నారు. ఈ కంపెనీలన్నీ అదానీ, అంబానీలకు చెందినవేననీ, మోడీ ప్రభుత్వం అలాంటి కార్పొరేట్ల సేవలోనే తరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ఆల్‌ ‌పెన్షనర్స్‌ అండ్‌ ‌రిటైర్డ్‌ ‌పర్సన్స్‌ అసోసియేషన్‌ (‌టీఏపీఆర్‌‌పీఏ) ఆధ్వర్యంలో మంగళవా రంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పెన్షనర్ల సదస్సు’ నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. పెన్షన్‌ ఇవ్వడం ప్రభుత్వాల దయ కాదనీ, అది ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని చెప్పారు. అనేక కోర్టు తీర్పులు దీన్ని ధృవీకరించాయని వివరించారు. కేంద్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉందనీ, సామాన్య ప్రజల బాగోగులను పట్టించుకోకుండా, అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు లాభాలు దోచిపెట్టేలా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలిపారు. పంచభూతాలను ఆక్రమించిన అదానీ, అంబానీల కన్ను ఇప్పుడు పెన్షనర్ల సొమ్ముపై పడిందన్నారు. ఇప్పటికే ఓల్డ్‌ ‌పెన్షన్‌ ‌స్కీం(ఓపీఎస్‌) ‌స్థానంలో కొత్త పెన్షన్‌ ‌స్కీం (ఎన్‌‌పీఎస్‌) ‌తెచ్చారనీ, దాని ఉద్దేశ్యం ఉద్యోగుల జీతాల్లోంచి పెన్షన్‌ ‌కోసం కోత విధించే 10 శాతం సొమ్మును కార్పొరేట్లకు కట్టబెట్టడమేనని చెప్పారు. షేర్‌ ‌మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం అంటే పెన్షనర్ల భవిష్యత్‌‌తో చెలగాటం ఆడుతూ, కార్పొరేట్లను ప్రోత్సహించడం కాక ఇంకేంటని ప్రశ్నించారు. పెన్షన్‌‌కు కూడా వయోపరిమితి విధించేలా కేంద్రం ఆలోచనలు చేస్తున్నదనీ, ఇంతకంటే దుర్మార్గం ఏముందని అడిగారు.

నిత్యం బీజేపీ వాట్సప్‌ ‌యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశ భవిష్యత్తే మారిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నగదు రహిత వైద్యం పేరుతో పెన్షనర్లకు వచ్చే పెన్షన్‌‌లో కోతలు విధిస్తున్నారనీ, అలాంటప్పుడు అది నగదు రహిత వైద్యం ఎలా అవుతుందన్నారు. తాజాగా దానిపైనా ఆంక్ష‍లు విధిస్తున్నారనీ, వైద్యం అందించే వయో పరిమితిని కుదించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పెన్షనర్లకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై భవిష్యత్‌ ‌పోరాటాల్లో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్‌‌జీఈఎఫ్‌ ‌ప్రధాన కార్యదర్శి ఏ శ్రీకుమార్‌ ‌మాట్లాడుతూ కేంద్రం ప్రతిపాదించిన కంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీం (సీపీఎస్‌)‌ను దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ రాష్ట్రాలు మాత్రమే అమలు చేయట్లేదనీ, మిగిలిన రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. పెన్షన్ల సవరణ జరగట్లేదనీ, దేశవ్యాప్తంగా 8వ పెన్షన్‌ సవరణ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అయితే సమీప భవిష్యత్‌‌లో ఇలాంటి సవరణలు జరిగినా, దానిలో పెద్దగా ఆశలు కల్పించే అంశాలేవీ ఉండబోవని అభ్రిపాయపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా భవిష్యత్‌ ఆందోళనలకు కలిసి రావాలని కోరారు.

ఏఐఎస్‌‌జీపీఎఫ్‌ ‌ప్రధాన కార్యదర్శి వజీర్‌ ‌సింగ్‌ ‌మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లతో శ్రామికులకు ఎలాంటి రిటైర్‌‌మెంట్‌ ‌బెనిఫిట్స్‌ ఉండబోవని చెప్పారు. కనీస వేతనాల ప్రస్తావన కూడా లేదనీ, పని ప్రదేశాల్లో శ్రామికులు అత్యంత దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో దేశ ప్రజల జీవన పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్ష‍త వహించిన టీఏపీఆర్‌‌పీఏ ప్రధాన కార్యదర్శి పీ కృష్ణమూర్తి మాట్లాడుతూ తాము నిర్వహించిన ఆందోళనలు, ప్రభుత్వ స్పందనలు తెలియజేశారు. అంతకుముందు పెన్షనర్లు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌‌జీపీఎఫ్‌ ‌ఫైనాన్స్‌ ‌కార్యదర్శి ఆరుణ ఘోష్‌, టాప్రా చైర్మెన్‌ ఎమ్‌ఎన్‌ ‌రెడ్డి, అధ్యక్ష‍ులు పీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -