నవతెలంగాణ – గోవిందరావుపేట
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలోని ఇందిరమ్మ విగ్రహం వద్ద దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన గొప్ప నాయకుడని అన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, ఇందిరమ్మ గృహాలు, జలయజ్ఞం, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ సంక్షేమ పాలనకు కొత్త దిశానిర్దేశం చేసిన మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయులని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.



