నవతెలంగాణ-ఆలేరుటౌను
నిజాయితీ, నిబద్ధతతో చేనేతన్నలకు సేవలందించగలిగినప్పుడే సమాజ వికాసం జరుగుతుందని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ ఖుర్షిద్ పాషా అన్నారు. ఆలేరు చేనేత సహకార పరపతి సంఘం చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన, దాసి శంకర్ ను బుధవారం స్థానిక రహదారి బంగ్లాలో ప్రెస్ క్లబ్ ఆలేరు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత సహకార సంఘం ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలుపొందడం ఆయన చేస్తున్న సేవలకు నిదర్శనం అన్నారు.
వ్యవసాయం తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా నమ్ముకునేది చేనేత వృత్తి అని, వారి కుటుంబాల సంక్షేమానికి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. విద్యార్థి నాయకునిగా, మార్క్సిస్ట్ పార్టీ నేతగా, అధ్యాపకులుగా పాత్రికేయులుగా ఎంతగానో ఈ సమాజానికి సేవలు అందించిన ఘనత శంకర్ కే దక్కుతుందన్నారు. పదవులు శాశ్వతం కాదని ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు. అనంతరం శాలువాతో జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



