– టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్..
నవతెలంగాణ – రాయపోల్
పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు దాటినా ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని, వెంటనే పీఆర్సీని అమలు చేయాలని టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం రాయపోల్ మండలంలో టీపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను, ఉపాధ్యాయుల వివిధ రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత మూడు నెలలుగా నూతన ఆరోగ్య పథకం కోసం ఉపాధ్యాయుల వేతనాల నుంచి 1.5 శాతం చొప్పున జమ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయకపోవడం సరికాదన్నారు. వెంటనే ఆరోగ్య పథకం మార్గదర్శకాలను విడుదల చేసి, జాప్యం లేకుండా ఉపాధ్యాయులకు వైద్య సేవలు అందించాలని కోరారు.ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టే జీవో 25 ను సవరించి, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు వేతనాలను చెల్లించి, వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకయ్య, నాయకులు రాములు గౌడ్, నర్సింలు గౌడ్, కరుణాకర్, మెట్టురామ్, వరప్రసాద్, హరీష్, నాగస్వామి తదితరులు పాల్గొన్నారు.



