ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా
నవతెలంగాణ – పరకాల
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని నిరసిస్తూ సోమవారం పరకాల బస్టాండ్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం సుమారు అర్ధగంటపాటు కొనసాగడంతో బస్టాండ్ సెంటర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఎస్‌ఐ పవన్ బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి బీఆర్‌ఎస్ పరకాల పట్టణ ఉపాధ్యక్షుడు దుంపేటి నాగరాజు, మాట్లాడుతూ పేద ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని, ముస్లిం మైనారిటీ కుటుంబాల కోసం షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
ఈ పథకాల ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందన్నారు.పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న ఈ పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే పథకాలను నిలిపివేసే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకాల విషయంలో న్యాయపరమైన సమస్యలు ఉంటే ప్రభుత్వం వెంటనే కోర్టులో తన వాదనలు వినిపించి, పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని నాయకులు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు నగదు సహాయం, బోనస్, పెన్షన్ల పెంపు, కొత్త రేషన్ కార్డుల వంటి అంశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.అంతే కాకుండా పరకాలలో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభపైనా బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల వంటి అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. పరకాల అభివృద్ధికి కొత్తగా ఎలాంటి నిధులు, ప్రాజెక్టులు కేటాయించారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సభ పరకాల అభివృద్ధిపై కాకుండా బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబంపై విమర్శలకే పరిమితమైందని ఆరోపించారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శనిగరపు నవీన్, బొచ్చు బాబురావు, మడికొండ ఆనంద్, బండి శ్రావణి, ఒంటేరు దినేష్‌చంద్ర, ఎకు నవీన్, బొచ్చు చిన్నికృష్ణ, తెలంగాణ కుమార్, సిలువేరు సునిత, మంద సదానందం, చెరుకు సుధాకర్, పాపక్క తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



