Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాప్రతినిధిగా అధికారులను కలవడం నా ప్రాథమిక హక్కు 

ప్రజాప్రతినిధిగా అధికారులను కలవడం నా ప్రాథమిక హక్కు 

- Advertisement -

అధికారులను కలవొద్దని అనడం మొట్టమొదటి సారి వింటున్నా..
అనవసరపు వివాదాలతో సమయం వృథా చేయొద్దని హితవు
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి 
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్

నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధి కోసం మాత్రమే దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆయా చైర్మన్ లతో కలిసి వినతిపత్రం అందజేశానని, నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం అధికారులను కలవడం రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించారు. ఏ అధికారి వద్దనైనా పని జరగని పరిస్థితుల్లో మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు కలిసి వినతిపత్రాలు అందించడం ప్రజా ప్రతినిధుల బాధ్యతేనని అన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎలాంటి పరిధులు ఉండవని తెలిపారు. ప్రోటోకాల్‌కు లోబడి నియోజకవర్గంలోని చిలుపూర్, జీడికల్, నవాబుపేట, మల్లికుదుర్ల గట్టుమల్లన్న, స్థానిక తిరుమలనాథస్వామి దేవాలయాల చైర్మన్లను వెంటబెట్టుకుని దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసి వారి చేత వినతిపత్రాలు అందజేశామని చెప్పారు.

దీనిపై స్పందించిన అధికారులు శాఖలో తగిన నిధులు లేవని చెప్పడంతో, ఆలయాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రణాళిక ఇస్తే ముఖ్యమంత్రి వద్ద నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పినట్లు వివరించారు. తాను నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడానని, రాష్ట్రం లేదా ఉమ్మడి జిల్లా ఆలయాల అంశాలను ప్రస్తావించలేదన్నారు. అధికారులు తన కార్యాలయానికి వస్తే అది సమీక్ష అవుతుందని, వారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇవ్వడం సమీక్ష ఎలా అవుతుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇది అవగాహన లోపం వల్ల వచ్చిన అపోహ మాత్రమేనని అన్నారు. రాజ్యాంగం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్షలు మంత్రులు, కేబినెట్ హోదా కలిగినవారు నిర్వహిస్తారని, నియోజకవర్గ ఆలయాలపై దేవాదాయ శాఖ సమీక్ష చేసే అధికారం తనకు లేదని, తన చర్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో బిజినెస్ రూల్స్ గురించి పూర్తి అవగాహన ఉందని, ప్రోటోకాల్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా తన నియోజకవర్గ ఆలయాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే కమిషనర్‌ను కలిశానని తెలిపారు. ఎవరి అధికారాల్లోనూ జోక్యం చేసుకోలేదని, ఎవరి అధికారాలను హరించలేదని, ఈ విషయంపై అనవసరంగా వివాదం సృష్టించడం బాధాకరమన్నారు. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటూ అభివృద్ధిని పక్కనపెట్టి ప్రజల్లో ఉండేందుకు వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అధికారులు వద్దకు వెళ్లకూడదనే మాట ఇప్పటివరకు ఎప్పుడూ వినలేదన్నారు.

అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరాపై ఆలోచించాలని, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అలాగే ఎంజీఎం ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం కాకపోవడం, వరంగల్ అండర్ డ్రైనేజీ పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మేలు చేసే పనులపై దృష్టి పెట్టాలని, అనవసర వివాదాలతో సమయం వృథా చేయవద్దని హితవు పలికారు. ప్రజలకు ఉపయోగపడేలా తమకున్న అవకాశం, పలుకుబడిని వినియోగించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -