నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామ శివారుకు ప్రభుత్వ రికార్డుల్లో భూ నక్షా (టిప్పన్) లేకపోవడంతో ప్రత్యేక భూభారతి రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు కామారెడ్డి జిల్లా ఏడి శ్రీనివాస్ తెలిపారు. ఈ సర్వేను మూడు నెలల గడువులో పూర్తి చేయనున్నందున గ్రామస్తులందరూ సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. సోమూర్ గ్రామ సర్పంచ్ శంకరం పటేల్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన సదస్సులో ఏడి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రస్తుతం సోమూర్ గ్రామ శివారుకు ప్రభుత్వ రికార్డుల్లో భూ నక్షా లేకపోవడం వల్ల భూ సర్వేలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఎంపిక చేసి రీ సర్వే చేపట్టాలని నిర్ణయించిందన్నారు.
గ్రామ శివారులో మొత్తం 756.17 గుంటల భూమిని సర్వే చేయనున్నట్లు తెలిపారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో ఉన్న సరిహద్దు గ్రామాలకు ముందస్తు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలో సర్వే ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. సర్వే పూర్తయిన అనంతరం సోమూర్ గ్రామ శివారుకు ప్రభుత్వ రికార్డుల్లో అధికారిక భూ నక్షా సిద్ధమవుతుందని వివరించారు. గ్రామస్తుల సహకారంతో సమయానికి సర్వే పూర్తి చేసి, గ్రామ ప్రజల ఆమోదంతో ప్రత్యేక భూ నక్షా రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ ఎండి ముజీబ్, డివిజనల్ సర్వేయర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ వెంకట్రావు, భూభారతి రీ సర్వే ఇన్చార్జి మధుకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోహర్, మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్, ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ సర్వేయర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భూభారతి రీ సర్వే నిర్వహణ, దాని ప్రయోజనాలపై అధికారుల బృందం గ్రామస్తులకు అవగాహన కల్పించగా, గ్రామస్తులు సర్వేకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.



