Thursday, July 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘సుప్రీం’’వాతలు

‘‘సుప్రీం’’వాతలు

- Advertisement -

ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య. ఆ విద్యకు పునాది పాఠ్యపుస్తకాలు. అలాంటి పాఠ్యపుస్తకాలను రాజకీయ ప్రయోజనాల కోసం మార్చడమంటే ఒక తరం ఆలోచనలనే మార్చే ప్రయత్నం చేసినట్టే. గత దశాబ్దకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ‌రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌‌సిఈఆర్‌‌టి) పాఠ్యాంశాల్లో జరిగిన మార్పులు ఈ ఆందోళనకు బలం చేకూర్చాయి. చరిత్రను కుదించడం, శాస్త్రీయ దృక్పథాన్ని బలహీన పరచడం, పురాణాలను శాస్త్రంగా మలిచేందుకు ప్రయత్నించడం, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన భావజాలాన్ని చొప్పించడం వంటి చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి చెంపపెట్టుగా నిలిచాయి. ఇటీవల ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో ‘డి-రోల్ అఫ్ ది జ్యుడీషియరీ ఇన్‌ ‌సొసైటీ’ అధ్యాయంలో న్యాయవ్యవస్థ లోపాలు, కేసుల పెండింగ్‌, మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల ఖాళీల అంశాలు ఉండటంతో తీవ్ర వివాదా స్పదమైంది. వాస్తవానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాల్సింది కేంద్రమే. కానీ, తమ వైఫల్యాల్ని న్యాయవ్యవస్థకు అంటగట్టడం బాధ్యతను విస్మరించడమే. దీన్ని భారత అత్యున్నత న్యాయస్థానం గతంలోనే తప్పు పట్టింది.

తాజాగా విద్యను రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చడం, న్యాయవ్యవస్థకు మకిలి తీసుకు రావడం పట్ల పరోక్షంగా కేంద్రాన్ని హెచ్చరించింది. దీంతో ఎన్‌‌సిఈఆర్‌‌టి వెంటనే ‘దిద్దుబాటు’కు పూనుకుంది. న్యాయ వ్యవస్థపై వివాదాస్పద అంశాల్ని తొలగించి కొత్త అధ్యాయాన్ని విడుదల చేసింది. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌‌సిఈఆర్‌‌టి పుస్తకాలపై వరుసగా వివాదాలు చెలరేగాయి. మొదట ‘హేతుబద్ధీకరణ’ పేరుతో పాఠ్యాంశాలను తగ్గిస్తామని చెప్పినా, తొలగించిన అంశాలను పరిశీలిస్తే రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపించాయి. పదో తరగతి సిలబస్ నుంచి ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్య మాలకు సంబంధించిన పాఠాలు తగ్గించబడ్డాయి. ‘గుజరాత్ అల్లర్లు–2002’ ప్రస్తావన, ‘మహాత్మాగాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్‌‌పై నిషేధం’ అనే అంశాల్ని తొలగించింది. మొఘల్ చరిత్రను గణనీ యంగా కుదించింది. ఈ మార్పులన్నీ చరిత్రను ఏకపక్షంగా చూపించే ప్రయ త్నాలని విద్యావంతులు, మేధావుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయిన ప్పటికీ కేంద్రం ఒంటెద్దు పోకడలు వీడలేదు. శాస్త్రీయ విద్యలో కూడా అశాస్త్రీయ భావాలకు చోటు కల్పించింది. ప్రాచీన భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ, స్టెమ్ సెల్ టెక్నాలజీ, విమాన సాంకేతికత వంటి ఆధునిక విజ్ఞానాలన్నీ ఉన్నాయని రాజకీయ వేదికలపై చేసిన వ్యాఖ్యలు విద్యారంగంలో కూడా అలాంటి భావజాలాన్ని ప్రోత్సహించేలా కనిపించాయి.

నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలు నేపథ్యంలో పాఠ్యపుస్తకాల పునర్వ్యవస్థీకరణ పేరుతో ‘భారతీయ జ్ఞాన సంపద’కు ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం ప్రకటించింది. భారతీయ జ్ఞానాన్ని పరిచయం చేయడంలో అభ్యంతరం లేదు. కానీ దాన్ని శాస్త్రీయ ప్రమాణాలపై కాకుండా మతపరమైన, పురాణ ఆధారిత భావాలతో మేళవించడం విద్యకు హానికరం. శాస్త్రీయత, విశ్వాసం రెండింటి మధ్య తేడాను పిల్లలకు స్పష్టంగా బోధించడం అనివార్యం. ఆ గీత చెరిపేస్తే విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన బలహీనపడుతుంది. దేశంలోని ప్రముఖ చరిత్రకారులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఈ మార్పులపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రను రాజకీయ అవసరాలకు అనుగుణంగా తిరగరాయడం, కొన్ని వర్గాల పాత్రను అతిశయోక్తిగా చూపడం, మరికొన్ని వర్గాల కృషిని పక్కనపెట్టడం విద్యాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్‌‌సిఈఆర్‌‌టి వంటి జాతీయ సంస్థ స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు. కానీ, కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తున్న ఈ సంస్థ తన స్వతంత్రతను ఎప్పుడో కోల్పోయింది.

రాజ్యాంగంలోని 51ఎ(హెచ్‌) ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, మానవతా భావం, పరిశోధనా స్వభావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు. అదే బాధ్యత ప్రభుత్వానిది కూడా. కానీ శాస్త్రీయ అంశాలను తొలగించి, అశాస్త్రీయ భావాలకు ప్రాధాన్యమిస్తే అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కేవలం ఒక పాఠ్యాంశంపై తీర్పు మాత్రమే కాదు. విద్యావ్యవస్థపై రాజకీయ రంగు పులమాలనే ప్రయత్నాలకు రాజ్యాంగం తరఫున ఇచ్చిన గట్టి హెచ్చరికగా భావించాలి. ఎన్‌‌సిఈఆర్‌‌టి పుస్తకాలు ఏ పార్టీకి చెందినవిగా కాకుండా భారత రాజ్యాంగ విలువలకు అద్దం పట్టేవిగా ఉండాలి. విద్యార్థులకు నిజమైన చరిత్ర, ప్రజాస్వామ్య భావజాలం అందించడమే ప్రభుత్వ బాధ్యత. దాన్ని విస్మరిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సహజమే. విద్యను కాషాయీకరించే ప్రయత్నాలపై సుప్రీంకోర్టు చెప్పిన మాటలు దేశ ప్రజాస్వామ్యానికి, శాస్త్రీయ చైతన్యానికి ఒక ముఖ్యమైన భరోసా అని చెప్పకతప్పదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -