వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు
నవతెలంగాణ-ఆలేరు టౌన్
తొలకరి జల్లులు కురవడంతో రైతులు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటారు. ఎకరానికి దున్నకంకి, విత్తనాల కొనుగోలుకు, కూలీలు మసాలా ఖర్చులకు దాదాపు రూ.20వేల నుండి 25 వేల వరకు ఖర్చు చేశారు. నాలుగు ఎకరాలు పత్తి విత్తనాలు విత్తిన రైతు దాదాపు రూ.1 లక్ష వరకు ఖర్చు చేశారు. అయితే సకాలంలో వర్షాలు పడక ట్రాక్టర్లతో నీటిని మొక్కలకు పోయాల్సిన పరిస్థితి నెలకొంది.
వర్షాల కోసం ఆలేరు పట్టణ రైతులు కళ్లలో వత్తులు వేసుకొని మరి ఎదురుచూస్తున్నారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో వర్షాలు పెద్ద ఎత్తున పడాల్సి ఉండగా.. అడపాదడపా చిరుజల్లులు మాత్రం పడ్డాయి. ఈ ఏడు మే నెలలో చెడగొట్టు వానలు కూడా పడక దుక్కులు దున్నడానికి సమయం పట్టింది రైతులకు. జూన్ మొదటి వారంలో కొంతమంది రైతులు కొద్ది మేర పడిన వర్షాలకు, వ్యయ ప్రయాసలకోర్చి ట్రాక్టర్లతో దుక్కులు దున్నుకొని విత్తనాలు విత్తారు. విత్తనాలు విత్తారే గాని, వర్షాలు మాత్రం పడలేదు. వర్షాల కొరకు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఒకవైపు ఎండలో తీవ్రత మరోవైపు ఉక్కపోతతో కూడిన ఎండలు కొడుతుండడంతో రైతులు భూమిలో విత్తిన ,విత్తనాలు, కొద్దిపాటి వర్షం కురిసిన కారణంగా భూమిలోనే కొద్దిపాటిగా పైకి వచ్చి గింజ మొక్కగా మారే క్రమంలో పరిపక్వత చెందకపోవడంతో, పైపైకి రాగానే ఎండిపోతున్నాయి.
దీంతో తిరిగి రైతులు రెండవ దశ, ఎండిన చోట విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి దాపురించింది. వర్షాలంలో సకాలంలో పడకపోవడంతో చేసేది ఏమీ లేక ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.



