Friday, July 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్లు

బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్లు

- Advertisement -

ఈ అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు పంచాలి
సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లేది లేదు
‘సింగరేణి బావి బాట’లో భాగంగా కొత్తగూడెంలో కల్వకుంట్ల కవిత పర్యటన

నవతెలంగాణ-కొత్తగూడెం
బీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు పంచాలని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత అన్నారు., తన కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ ఆధ్వర్యంలో ‌జరుగుతున్న ‘సింగరేణి బావి బాట’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కవిత పర్యటించారు. ఉదయం కొత్తగూడెం ఏరియాలోని ఫైవ్ షాఫ్ట్ గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూర్యాప్యాలస్‌ హోటల్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణి కోసం తాను ఉద్యమంలో, ప్రభుత్వంలో పనిచేశాననీ, ఇప్పుడూ చేస్తున్నానని తెలిపారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైన్ అనే హెల్త్ మిక్స్ ఉండాలని, అప్పుడే సంస్థ బాగుంటుందన్నారు. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికులంతా వన్ విజన్, వన్ ఫ్యామిలీలా ఉంటారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆఫీసర్లకు ఒక రూల్, కార్మికులకు ఒక రూల్ నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు.

పెండింగ్‌‌లో ఉన్న రూ.54 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి సంస్థ పనిముట్లు కొనుక్కోలేని పరిస్థితికి దిగజారిందని తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించి సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిర్లక్ష్యం కారణంగా సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డిదారిన ప్రయివేట్ కు ఇచ్చిన తాడిచర్ల-1 మైనింగ్‌‌ను మళ్లీ సింగరేణికే అప్పగించాలనీ, అప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టి పెండింగ్‌‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని ఆరోపించారు. ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగ‌ర్‌‌లోనే 90 మంది రైతులపై అక్రమ కేసులు, 9 మంది రైతులపై రౌడీ షీట్లు పెట్టారని చెప్పారు. వెంటనే ఆ కేసులను, రౌడీ షీట్లను ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేశారు.

టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరు రాకుండా కుట్ర
‘టీఆర్ఎస్ ’ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని చూస్తే ఆ పేరు రాకుండా ఉండాలని కొందరు కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. తాను పార్టీ పెట్టుకొని తన పని తాను చేసుకుంటూ పోతున్నానని, ఇప్పటి వరకు బీఆర్ఎస్ విషయంలో ఎక్కడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేటీఆర్‌ రూ.188 కోట్లు పెట్టి ఇటీవలే పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్‌‌ను కొనుగోలు చేశారని అన్నారు. క్విడ్ ప్రొకోలో భాగంగా అతని మిత్రుడు ప్రదీప్ కన్‌స్ట్రక్ష‌న్‌‌కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ పార్థసారధి మహబూబ్ నగర్‌‌లో పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారన్నారు. డబ్బుతో సోషల్ మీడియా, మీడియాను కొనుగోలు చేసి తమ వార్తలు రాకుండా చేయాలని కుట్రలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‌తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించిన భూములన్నింటిపై రివ్యూ చేస్తామని తెలిపారు. మొత్తం అవినీతిని కక్కిస్తామని, ఎవరినీ వదలిపెట్టబోమని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -