Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ గో హోం

మోడీ గో హోం

- Advertisement -

ఆస్ట్రేలియా పర్యటనలో మోడీకి నిరసన సెగ
భారత ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు
మానవ హక్కుల సంఘాలు, ముస్లింలు
సిక్కులు, ఖలిస్తాన్‌ ‌మద్దతుదారుల ఆందోళనలు

న్యూఢిల్లీ : భారత ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మెల్‌‌బోర్న్‌లో నిరసనలు చెలరేగాయి. ఆయన బస చేసిన హోటల్‌ ‌వద్ద, మోడీ సభ జరిగే మార్వెల్‌ ‌స్టేడియం బయట ప్రధానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు హోరెత్తించారు. మోడీ పాలనలో మానవ హక్కులపై దాడులను నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో మానవ హక్కులు, ముస్లిం సంఘాలు, ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులతో పాటు ఆస్ట్రేలియాలోని మితవాద గ్రూపునకు చెందిన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. సిక్కు సమాజం, ముస్లింలపై వివక్ష‍ కొనసాగుతోందని ఆరోపిస్తూ ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులు, ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టాయి. మోడీతో సమావేశమయ్యే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌, విక్టోరియా ప్రీమియర్‌ ‌జసింతా అలన్‌.. ఈ అంశాలను ప్రస్తావించాలని నిరసనకారులు కోరారు. మెల్‌బోర్న్‌లోని టార్నైట్ గురుద్వారా సాహిబ్ సిక్కు ఆలయ కార్యదర్శి ప్రీతమ్ సింగ్ మాట్లాడుతూ… ‘‘మోడీ పర్యటనల సమయంలో హిందూ జాతీయవాదుల దాడులు, రెచ్చగొట్టే చర్యలు పెరుగుతాయనే భయం మాలో ఉంటుంది. మెల్‌బోర్న్‌లోని సిక్కు సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ పర్యటనకు ముందే నగర ఉత్తర ప్రాంతంలోని ఓ ప్రార్థనా మందిరం వద్ద బెదిరింపు ఘటన జరిగింది’’ అని తెలిపారు.

విక్టోరియా ప్రీమియర్ జసింతా అలన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మోడీని కలిసినప్పుడు కెనడాలో జరిగినట్టుగా ఆస్ట్రేలియాలోని సిక్కులను ఎప్పటికీ లక్ష్యంగా చేసుకోబోమని హామీ తీసుకోవాలని ప్రీతమ్ సింగ్ కోరారు. ‘‘బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే భారత్‌లోనే కాదు, అమెరికాలోనే కాదు, మెల్‌బోర్న్‌లో కూడా లక్ష్యంగా మారతామేమో అన్న భయం నిజంగానే ఉంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు తాము వ్యతిరేకం కాదనీ, అయితే మానవ హక్కుల విషయంలో జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని, తమకు భద్రత కావాలన్నదే ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. ఇక ఖలిస్తాన్‌‌కు మద్దతు ఇచ్చే కొందరు నిరసనకారులు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే నిరసనల్లో పాల్గొన్న ‘అలయన్స్ అగైనెస్ట్ ఇస్లామోఫోబియా’ సంస్థ చైర్మెన్‌ వసీమ్ రజ్వీ మాట్లాడుతూ.. భారత్‌లో ముస్లింలపై జరుగుతోన్న వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ నిరసన చేపట్టామని చెప్పారు. తాను హైదరాబాద్‌కు చెందినవాడిననీ, ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడటానికే ఇక్కడికి వచ్చానని తెలిపారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నది తమ ఆందోళనగా చెప్పారు. అలాగే అక్కడి ద్వేష రాజకీయాలు ఇప్పుడు ఆస్ట్రేలియా నేలకు కూడా తాకుతున్నాయని అన్నారు.

మరోవైపు ఆస్ట్రేలియాలోని మితవాద గ్రూపులు మోడీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించాయి. భారత్‌ ‌నుంచి ఆస్ట్రేలియాకు వలసలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘గో హోం మోడీ’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. తీవ్ర మితవాద (ఫార్-రైట్) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హ్యూగో లెనన్ మోడీ బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి ‘మోడీ బయటకు వెళ్లిపో.. ఇక భారతీయ వలసలు వద్దు’’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లెనన్ పిలుపు మేరకు మోడీ సభ జరుగుతున్న మార్వెల్ స్టేడియం వరకు మరో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. భారతీయుల వలసలను వ్యతిరేకిస్తూ, భారత్‌తో ఆస్ట్రేలియా ప్రభుత్వ సంబంధాలను నిరసిస్తూ ఈ ర్యాలీ చేపడుతున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
మెల్‌బోర్న్‌లోని సదర్న్ క్రాస్ స్టేషన్ వెలుపల కూడా నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. జాతీయవాదిగా చెప్పుకునే మ్యాట్ ట్రైహే నేతృత్వంలోని నేషనల్ వర్కర్స్ అలయన్స్ సభ్యులు ఆస్ట్రేలియాలో వలసలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. మోడీ సభ జరిగిన మార్వెల్ స్టేడియం సమీపంలో కూడా నిరసనకారులు గుమికూడారు. మోడీ బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి నిరసన తెలిపిన హ్యూగో లెనన్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నాడు. ఆయనతో పాటు పలువురు ఆస్ట్రేలియా జాతీయ జెండాలు, భారతీయ వలసలకు వ్యతిరేకంగా నినాదాలు ఉన్న బ్యానర్లతో స్టేడియం ప్రవేశ ద్వారానికి ఎదురుగా నిరసన తెలిపారు. ఈ నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ఆస్ట్రేలియా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -