400 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎన్నాళ్లు?
విద్యా వ్యాపారంపై చర్యలు తీసుకోవాలి
సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
కలెక్టరేట్ ముందు సీపీఐ(ఎం) ఆద్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జయరాజ్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టి విద్యను వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 రోజులుగా అనేక పాఠశాలల్లో సర్వే చేసి సమస్యలను పరిశీలించామని తెలిపారు. సర్వే ద్వారా అనేక సమస్యలు తమ ప్రతినిధి బృందం దృష్టికి వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచి నెలరోజులవుతున్నా విద్యార్థులందరికీ, పూర్తి స్థాయిలో బుక్స్ అందజేయకపోవడం సరికాదన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక చోట్లా ప్రభుత్వ పాఠశాలలు లేక చాలామంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. అనేక సమస్యలకు నిలయాలుగా ప్రభుత్వ పాఠశాలున్నాయని, విద్యారంగం పట్ల పాలకులు నిక్ష్యంగా ఉంటున్నారనీ విమర్శించారు. పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. చాలా చోట్ల ప్రహరీ గోడలు, భోజన షెడ్స్, సరిపడ టాయిలెట్స్ లేక విద్యార్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు లేవని, ప్రభుత్వం విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వలస ప్రజలు ఉన్నచోట హిందీ సబ్జెకును ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రాజయ్య, అతిమేల మానిక్, జి.సాయిలు, ఎం.నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.యాదగిరి, పి.కృష్ణ, నాయకులు అశోక్, కె.రాజయ్య, నరసింహారెడ్డి, శ్రీధర్, శంకర్, దత్తు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.


