Friday, July 10, 2026
E-PAPER
Homeఖమ్మంపల్లె ఒడి నుంచి ప్రపంచ వేదిక వరకు

పల్లె ఒడి నుంచి ప్రపంచ వేదిక వరకు

- Advertisement -

ప్రభుత్వ బడి విద్యార్థి గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యావేత్తగా రాణింపు
సీఎస్ఐ అవుట్‌స్టాండింగ్ ఫ్యాకల్టీ వాలంటీర్ అవార్డు–2026కు ఎంపిక
అశ్వారావుపేట వాసి డాక్టర్.రామకృష్ణ కొలికిపోగు
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఒక సాధారణ విద్యార్థి… నేడు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన, సాంకేతిక విజ్ఞానం, సామాజిక సేవ రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.హైదరాబాద్‌ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్. రామకృష్ణ కొలికిపోగు తాజాగా కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ప్రకటించిన ‘అవుట్‌స్టాండింగ్ సీఎస్‌ఐ ఫ్యాకల్టీ వాలంటీర్ (మేల్) అవార్డు–2026’ కు ఎంపిక కావడం విద్యా రంగంలో విశేష గుర్తింపుగా నిలిచింది.

ఈ అవార్డు ఒక్కరోజులో లభించిన గౌరవం కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా విద్య, పరిశోధన, విద్యార్థి అభివృద్ధి, పరిశ్రమ–విద్యాసంస్థల అనుసంధానం, సామాజిక సేవ రంగాల్లో ఆయన చేసిన నిరంతర కృషికి దక్కిన గుర్తింపిది. ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదివిన రామకృష్ణ, గ్రామీణ నేపథ్యం, పరిమిత వనరులను అడ్డంకులుగా కాకుండా అవకాశాలుగా మలుచుకొని ఉన్నత విద్యను అభ్యసించి ప్రొఫెసర్‌గా ఎదిగారు. “ప్రతిభ ఒక్కటే విజయాన్ని ఇవ్వదు… 

క్రమశిక్షణతో కూడిన నిరంతర అభ్యాసమే శాశ్వత విజయానికి పునాది” అనే ఆయన సందేశం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది. ప్రస్తుతం సీబీఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన,విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.ఆయన మార్గదర్శకత్వంలో అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, పరిశోధన, పరిశ్రమల్లో రాణిస్తున్నారు.

కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సహజ భాషా ప్రక్రియ, డేటా సైన్స్, కంప్యూటర్ విజన్ వంటి రంగాల్లో 70 కు పైగా పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌ లో ప్రచురించారు. సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే పరిశోధనలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు.

2013 లో ఐఈఈఈ  ఉత్తమ పరిశోధనా పత్ర పురస్కారం, 2020లో రోటరీ సేవా పురస్కారం, 2021లో సావిత్రిబాయి ఫూలే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2022లో టిటా సోషల్ ఇన్నోవేషన్ ఎక్సలెన్సీ అవార్డు, 2023 లో ఉపాధ్యాయ రత్న, 2024 లో ఐకానిక్ బెస్ట్ టీచర్ అవార్డు, 2026 లో ఐఈఈఈ,ఎస్ఎస్ఐటీ,ఎండీఈఐ  గ్లోబల్ అవార్డు, తాజాగా సీఎస్‌ఐ అవుట్‌స్టాండింగ్ ఫ్యాకల్టీ వాలంటీర్ అవార్డు వంటి అనేక గౌరవాలు ఆయనకు లభించాయి.

విద్యా సేవలతో పాటు విజ్డమ్ సొసైటీ, నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ యువత,మహిళలు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం కృషి చేస్తున్నారు. సీబీఐటీ లో ఏర్పాటు చేసిన వి – మేధా క్లబ్ ద్వారా “టెక్నాలజీ ఫర్ సోషల్ గుడ్” భావనతో విద్యార్థులను సామాజిక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు రూపొందించేలా ప్రోత్సహిస్తున్నారు.

ప్రస్తుతం ఐఈఈఈ ఎస్ఎస్ఐటీ  హైదరాబాద్ సెక్షన్ ఉపాధ్యక్షుడిగా, ఐఈఈఈ ఎస్ఎస్ఐటీ ఎడూకామ్ – 

ఆర్ఏఐఎస్ఈ  గ్లోబల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు,ఎస్టీఈఎం విద్య, సైబర్ భద్రతపై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ విద్యపై ఆయనకు ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వ్యక్తిగా, ప్రభుత్వ విద్య నాణ్యతలో ప్రైవేట్ విద్యతో పోటీ పడాలని, గ్రామీణ పిల్లలకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. “అవకాశాలు పుట్టుకను బట్టి కాదు… ప్రతిభను బట్టి రావాలి” అనే ఆయన సందేశం విద్యలో సమాన అవకాశాల అవసరాన్ని గుర్తు చేస్తుంది.

ప్రేరణగా నిలిచిన ప్రయాణం…

అశ్వారావుపేట ప్రభుత్వ బడి నుంచి ప్రారంభమైన రామకృష్ణ కొలికిపోగు ప్రస్థానం నేడు ప్రపంచ వేదికల వరకు చేరింది. తాజాగా లభించిన సీఎస్‌ఐ అవుట్‌స్టాండింగ్ ఫ్యాకల్టీ వాలంటీర్ అవార్డు ఆయన వ్యక్తిగత విజయానికి మాత్రమే కాదు… 

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతి విద్యార్థికి, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచిన ప్రతి ఉపాధ్యాయుడికి, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరికీ ఒక ప్రేరణగా నిలుస్తోంది. ఆయన ప్రయాణం గ్రామీణ భారత భవిష్యత్తును విద్యా శక్తితో తీర్చిదిద్దే నిరంతర ఉద్యమంగా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -