Saturday, July 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఛోటానామ్ బడాకామ్

ఛోటానామ్ బడాకామ్

- Advertisement -

‘‘పప్పా కెహతేహై బడా నామ్ కరేగా’’ అని ఆమీర్‌ఖాన్ పాట ఒకటుంది. మామూలుగానే ఇంట్లో పెద్దవాళ్లు ఈ పాప పెద్దయ్యాక మంచి పేరు తెచ్చుకుంటుంది అని, వీడు గొప్పోడవుతాడు పెద్దగయ్యాక అనీ అంటుంటారు. ఆమెకు అక్షరాలు సరిగా రాకపోయినా కలెక్టరవుతుందని, వీడికి నోరు సరిగా తిరక్కపోయినా మంచి గాయకుడవుతాడని అలా అలా పొగుడుతూ ఉంటే నిజంగానే అది పనిచేసి వాళ్లలో మార్పు తీసుకొస్తుంది. ఇది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారించారు. తినగ తినగ వేము అన్నట్టు పొగడగ పొగడగ జనాలు రాటుదేలతారు విషయముందా లేదా అన్నది తరువాత. విషయం నిజంగానే ఉన్నట్టు ఊరకే ఊదరగొడుతూ ఉండాలి. అది ఓ టెక్నిక్కు.
బడా నామ్ కరేగా అని పెద్దోళ్ల పేర్లు పెట్టిన తరాలు ఉన్నాయి. ముఖ్యంగా స్వతంత్రం వచ్చాక గాంధీలు, నెహ్రూలు, తిలక్కులు, బోసుల పేర్లు పెట్టినవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే పెద్ద సినిమా యాక్టర్ల పేర్లు కూడా. పేరులో ఏముంది అని కొందరంటే పేరులోనే ఉంది పెన్నిధి అనేవాళ్లూ ఉన్నారు. కాబట్టి పేరు విషయం అంత తేలికగా తీసేయలేము. ఊరకే పేరు పెట్టేసి వాళ్లను సమాజంలో వదిలేస్తే సరిపోదు. నీకు ఫలానా ఆమె పేరు పెట్టాము, ఫలానా గొప్పాయన పేరు పెట్టాము కాబట్టి నీవూ అంత పేరు తెచ్చుకోవాలి అని అప్పుడప్పుడూ గుర్తుచేస్తే ఫలితం ఉంటుంది తప్ప ఊరకే పేరు పెడితే అంతా ఐపోయినట్టుకాదు.

పేర్లు మనుషులకే కాదు రాజకీయ పార్టీలకు, సంస్థలకు, బడులకు, కళాశాలలకు ఇలా చాలా చాలా వాటికి ఉంటాయి. ‘పూవు పుట్టగానే పరిమళించినట్టు’ ఉండదు పరిస్థితి. దానికోసం కష్టపడాలి, చెమట చిందించాలి. ఒక్కోసారి పేరు మహా గొప్పగా ఉందని ఈ స్కూల్లో చేరిస్తే ఉన్నమతి కాస్తా పోయింది మా పిల్లలకి అనుకునే పరిస్థితులూ ఎదురవుతాయి. అందుకే పేరులో ఉన్న పెన్నిధిని కాపాడే ప్రయత్నం చేయాలి.
ఈ పేర్ల దగ్గర గొడవలొచ్చి న్యాయస్థానాలను ఆశ్రయించినవాళ్లు ఇప్పుడే కాదు పదుల సంవత్సరాలు పోరాటాలు చేసినోళ్లు ఇంతకు ముందూ ఉన్నారు. పొడుగు పేరు పొట్టి పేరు విషయం పక్కనపెడితే ఇప్పుడు పొడుగు మాటలు, డైలాగులు ఎక్కువయ్యాయి. ఎన్నికలప్పుడు నీ అంతుచూస్తా, నీ కథంతా బయటపెడతా, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా, కంటిచూపుతో చంపేస్తానన్నంతగా మాటలు వినేవాళ్లం. ఇప్పుడు రోజూ అదే తంతు, రేపే ఏమన్నా ఎన్నికలొస్తాయేమోనని అనుమానం వచ్చేలాగ ఉంటాయి వీళ్ల మాటల తూటాలు. అవి ఉత్తుత్తి తూటాలే అందులో మందు అస్సలుండదు. దీపావళి తుస్సు బాంబులవి.
ఆటం బాంబులా చిన్న పేరుతో పెద్ద విస్ఫోటనం సృష్టించి పైకొచ్చేద్దామన్న తలంపులు కొందరివి. అక్కడ తమిళనాడులో విజయ్‌ని చూడండి ఎలా పైకొచ్చాడో హీరో అంటే అలా ఉండాలి అని మనం పొరబాటున అన్నామనుకొండి. ఏం, నేను రాలేదనా అని మనమీదికొచ్చేవాళ్లూ ఉన్నారు. రహదార్లకు, బంగళాలకు పేర్లు పెట్టేటప్పుడే పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోకూడదు. మహాత్మా గాంధి రోడ్ అంటే అది ఎం.జి.రోడ్ ఐపోతుంది. సరోజినిదేవి రోడ్ అంటే ఎస్.డి. రోడ్ , జవహర్‌‌లాల్ నెహ్రూ పేరుమీదున్న విశ్వవిద్యాలయం జె.ఎన్.టి.యు ఇలా పొడి అక్షరాల్లోకి వచ్చేస్తాయి. అలా ఎబ్రివేషన్‌లోకి మారిపోతాయి. మనుషుల పేర్లు కూడా అంతే. వీర వెంకట సత్య సయి వర ఇలా అన్నీ కలిపి వి.వి.ఎస్.ఎస్.వి ఐపోతుంది. పార్టీల పేర్లకు కూడా ఇదే గతే. ఐ.ఎన్.సి, బి.జె.పి, సి.పి.ఐ, ఎం, ఏఇ.ఎం.కె, టి.డి.పి, టి.ఆర్.ఎస్ ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాదు, నిజామాబాదు, ఖైరతాబాదు అన్న వీరభద్రరావు డైలాగులా మారిపోతుంది. ఇప్పుడు ఆ పొట్టిపేర్ల మీద పొడుగూ తగాదా వచ్చిపడింది. అది సంగతి.

సైన్సులో ఇతర రంగాల్లో కూడా పొట్టిపేర్లతోనే అన్నీ నడుస్తుంటాయి. డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ, యు.ఎఫ్.ఓ అని, అంతర్జాతీయ సంస్థలకు యు.ఎన్.ఓ, యునెస్కో ఇలా పొట్టి పేర్లు సమయాన్ని, స్థలాన్ని కాపాడతాయి. అర్బన్ నాచురల్ ఆర్గనైజేషన్ అని పెద్ద పేరు పెట్టుకొని దానికి సరిపోయేలా యు.ఎన్.ఓ అని పెట్టుకుంటానంటె నీకు మొట్టికాయలు పడతాయి. అందుకే సదరు పేర్లు ముందే సంబంధిత అధికార సంస్థల దగ్గర నమోదు చేసుకోవాలి. సినిమాల పేర్లు, పుస్తకాలు, పత్రికలు ఇలా కొన్నింటికి ముందే మంచి మంచి పేర్లు పంపి వాటిని నమోదుకు దరఖాస్తు పెట్టుకుంటారు. వాటిని పరిశీలించి అంతకుముందు అవి లేవని ఖరారు చేసుకొని మరీ వీళ్లకు కేటాయిస్తారు. ఈ మాత్రం పద్ధతులు తెలియకుండా సంస్థ కాని, పార్టీ కాని, పత్రిక కాని ఎలా నడుపుతారు వీళ్లు అని ప్రజలకు అనుమామనమొచ్చే విధంగా ఉంటే ఎలా చెప్పండి. అదెక్కడో ఉందని, లేదా ఇప్పుడది లేదని వాదించినా ఫలితముండదు.
పెద్దపేరు ఎంత ముఖ్యమో చిన్నపేరూ అంతే. రెండింటిలో ఏదీ పోలి ఉండకూడదంతే. కాబట్టి ఛోటా నాం బడా కాం కరేగా అనుకుంటే దాల్ చా లో కాలేసినట్టే……​
జంధ్యాల రఘుబాబు 9849753298

- Advertisement -
Previous article
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -