Saturday, July 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇదా బోధన!

ఇదా బోధన!

- Advertisement -

​‘‘చాహే ఆప్ అధ్యాపక్ బనో, ఛాహే ఆప్ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ బనో, కోయిబీ బనో మగర్‌ ఏక్ ఎక్స్‌పర్ట్ మా బనో పెహలేతుమ్‌’’
మీరు అధ్యాపకులు కావచ్చు, మీరు ఐ.ఏ.ఎస్. ఆఫీసరూ అవ్వొచ్చు. కానీ ముందుగా మీరు మంచి అమ్మలు కండి. డిగ్రీ పట్టాలు పొందుతున్న చదువులో మంచి పథకాలు పొందిన విద్యార్థినులను ఉద్దేశించి బోధిస్తున్న మాటలివి. మీరు ఎంత గొప్పగా తెలివితేటలు పెంచుకున్నా కానీ, అధికారులుగా సేవ చేయొచ్చు గానీ, ముందుగా ఒక మంచి అమ్మగా తర్ఫీదు పొందకపోతే, మంచి అమ్మకాకపోతే జీవితం వృధా అయినట్లేనన్నది ఆ వాక్యాల సారం. ఇవి ఎవరో అనామకులు చెప్పలేదు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్‌ పటేల్ గారి బహిరంగ ఉ‌పన్యాస ప్రకటన. జూలై 9న లక్నోలోని ఛత్రపతి సాహు జీ మహరాజ్ యూనివర్సిటీలో విద్యా ర్థులకు పట్టాల పంపిణీ, పథకాల పంపిణీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఛాన్సలర్ హోదాలో పాల్గొన్న ఆనంది బెన్ పటేల్ పితృస్వామిక భావజాలంతో నిండిన అనేక విషయాలను విద్యార్థినులు నేర్చుకోవాల్సినవిగా ఉద్భోధించారు. ఆనందిబెన్ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా అనేక రాష్ట్రాలలో గవర్నర్‌గా పనిచేశారు. ఈవిడ బీజేపీలో ప్రముఖ నాయకురాలిగా కూడా ఉన్నారు. లక్షమంది విద్యార్థులు, తల్లిదండ్రులూ హాజరైన సభలో ఆమె మాట్లాడారు.

ఇంకా ఆమె బోధన ఎలా సాగిందంటే, ‘‘అమ్మాయిలూ మీరు మంచిగా వంటలు వండటం కూడా నేర్చుకోవాలి. అత్తారింటికి వెళ్లాక, అత్తమామలు ఏదైనా వండి పెట్టమంటే, మీరు చేయలేకపోతే వాళ్లేమంటారు.. మీ అమ్మానాన్నలు ఇలానే పెంచారా? అని నిందిస్తారు. కనుక వంట నేర్చుకోవాలి, ఇంటినీ పిల్లల్ని చూసుకోవడం నేర్చుకోవాలి. అంతేకాదు కుటుంబ సంబంధాల ను సరిగా నిర్వహించాలి’’ అని ఆడపిల్లల కెరీర్ ఇదే అన్నట్టుగా సెలవిచ్చారు. ఇంకా…! మీరు చదువుకోవటానికి వచ్చి అబ్బాయిలతో వెళతారు. మీకు గర్భం వస్తుంది. బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డను ఎవరూ తీసుకోరు. ఆ బిడ్డకు తల్లి తండ్రి ప్రభుత్వం కావలసి వస్తుంది. అంటే ప్రభుత్వం భరించాల్సి వస్తుందని ఆమె భావన. తల్లిదండ్రులూ! పిల్లలు చసువుకోవటానికి విద్యాసంస్థల్లోకి వచ్చినప్పుడు, వాళ్లను గమనిస్తూ ఉండండి అంటూ తల్లిదండ్రులకూ బోధన చేశారు.

విద్యాధికులయిన విద్యార్థినులు ఉన్నత ఉద్యోగాలకు తయారవుతున్నవేళ, వాళ్లకు లింగపరమైన విధులుగా పై విషయాలను చెప్పటం పలువురినీ ఆశ్చర్యపరచింది. వంట చేయటం, పిల్లల్ని కనిపెంచటమే అమ్మాయిల ప్రథమ కర్తవ్యంగా బోధించడం అత్యంత దారుణమైన విషయం. ఇది ఆనందిబెన్ పటేల్ ఆలోచన, ఆచరణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఆమె ఎదిగిన పార్టీ భావజాలం ఆ విధమైనది. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెంది, అన్ని రంగాలలో మహిళలు, పురుషులకు సమానంగా ముందుకుపోతుంటే, మన రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులు సమానమని, వివక్షత ఉండరాదని చెబుతుంటే, తిరిగి మనుధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీలు నడచుకోవాలని బోధించడం ఎంత అనాగరికం! స్త్రీలు పిల్లల్ని కంటారు సరే, పురుషుడి బాధ్యతలేదా? అతను తండ్రిగా సమాన బాధ్యత వహించాలి కదా! వంటచేయటం ఆడవాళ్ల పనేనా? ఇంటినీ, అత్తమామల్ని చూసుకోవడం ఆడపిల్లలకు మాత్రామే ఉన్న బాధ్యతనా! ఇవేమి ఆలోచనలు. ఇది పూర్తిగా మహిళలను వంట ఇంటి బానిసలుగా చూసే సనాతన ఆచార వ్యవహారం మాత్రమే. బీజేపీ, ఆరెస్సెస్, సంఘ పరివారమంతా ఈ ఆలోచనలతోనే ఉంటుంది. మహిళలను బలహీనులుగా, చిన్నచూపు చూడడం, వాళ్ల విధులను, కట్టు బొట్టును, నడవడికను, మాటల్ని అన్నిటినీ నియంత్రించడం ఈ మనుధర్మ బోధకులకు అలవాటైన విషయం. ఒకవైపు స్త్రీలను శక్తి స్వరూపిణులుగా, దేవతలుగా పొగుడుతారు. మరోవైపు పురుషునికి బానిసగా ఉండాలని బోధిస్తారు.

రాజా రామ్మోహనరాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, గురజాడ లాంటి ఎంతో మంది సంఘ సంస్కర్తలు స్త్రీలు సమాజంలో సమానహక్కును పొందాలని, విద్యను పొందాలని, వివక్ష తగదని ఉద్యమాన్ని చేపట్టారు. ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుందని గురజాడ వందేళ్ల క్రితమే పేర్కొన్నాడు. అట్లాంటి మహనీయులు ఆశించిన స్త్రీ సాధికారత, స్వేచ్ఛలను స్త్రీలకు దూరం చేసే పితృస్వామిక ఛాందస భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ బీజేపీ పరివారము. ఇది కేవలం వ్యక్తుల అభిప్రాయం మాత్రం కాదు, రేపు దేశంలో సగం మందిగా ఉన్న స్త్రీలు ఎదుర్కొనే పెద్ద సవాలు. ఎందుకంటే ఈ భావజాలమే నేడు దేశంలో ఆధిపత్యంలో ఉంది. అధికారంలో ఉంది. ‘‘బేటీ పడావో, బేటీ బచావో’’ అనే నినాదాలు కేవలం ఆకర్షకమైనవిగా మిగులుతున్నాయి. నేటితరం ఇలాంటి ఆలోచనలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -