Saturday, July 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్వేష వివాదాలు-నిరంకుశ చట్టాలు

విద్వేష వివాదాలు-నిరంకుశ చట్టాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఆ మాటకొస్తే అసలు దక్షిణ భారతంలోనే బీజేపీ ప్రధాన శక్తి కాదు గనక దానిగురించి వామపక్షాలు ఎందుకు ఎక్కువగా కేంద్రీకరిస్తాయని కొందరు తేలిగ్గా మాట్లాడుతుంటారు. ఇక్కడ అంతగా లేని మతతత్వ పార్టీ గురించి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను, వాటి ప్రభావాన్ని ఉపేక్షిస్తాయని ఆరోపిస్తుంటారు. వారికంటే వీరు మెరుగు, వీరి కంటే వారు మెరుగు గనక అటో ఇటో చేరిపోవడం మంచిదని ఉచిత సలహాలు గుప్పిస్తుంటారు. ఇవన్నీ ఎంత అవాస్తవికమైనవో, ఆధార రహితమైనవో ఈ వారంలో పరిణామాలు నిరూపించాయి. కులమతాలు, ప్రాంతాల వారీ వివాదాల చర్చలు ఒక్కసారిగా తెలుగునాట వేడెక్కిపోతున్నాయి. అంతర్వేది, రామతీర్థం ఘటనల నాటికంటే.. ఇంకా చెప్పాలంటే తిరుపతి లడ్డూ వివాదం నాటి కంటే ఇప్పుడు మత చర్చల తాకిడి తీవ్రంగా వుంటున్నది. ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్యన అటూ ఇటుగా అప్రకటిత స్నేహ సంబంధాలు అందరికీ తెలిసిపోతున్నాయి. మీడియా సోషల్ మీడియాలు ఉమ్మడిగానే వుంటున్నాయి గనక ఈ అరెస్టులు హైదరాబాదులో జరిగినా ఏపీలోనూ సెగ పుట్టిస్తున్నాయి. కొన్ని సమావేశాలు చర్చలు, మౌలిక రాజకీయాంశాల్లోకి పోకుండా ఇరు రాష్ట్రాల భాషా శైలిలో తేడాలు లేదా నదీజలాల పంపిణీలో విభేదాల వంటివాటిపై వివాదాలు పెంచే దిశలో సాగుతున్నాయి. ఏపీలో నేరుగా కూటమి ప్రభుత్వం గనక మత రాజకీయాలకు బాహాటంగా వత్తాసు లభిస్తుంటే తెలంగాణలో కూడా సాఫ్ట్ హిందూత్వ వంటిదానికి ప్రోత్సాహం పెరుగుతున్నది. ఇన్నిటి మధ్యనా చాపకింద నీరులా బీజేపీ ప్రభావం విస్తరించేందుకు పాచికలు వేస్తున్నది. టార్గెట్ తెలంగాణ, ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లు లేదా టార్గెట్ ఆంధ్రప్రదేశ్, ఆపరేషన్ తెలంగాణ అన్నట్టు ఉభయత్రా ప్రహసనం నడుస్తున్నది.

పవన్ హెచ్చరికలు
మతాన్ని, నాయకులను ఇష్టానుసారం దూషిస్తే సహించేది లేదని ఉపముఖ్యమంత్రి, సనాతన సేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక చేయడంతో ప్రభుత్వ వైఖరిలో మార్పు ప్రస్పుటమైంది. నారా లోకేశ్ ప్రకటించిన రెడ్‌బుక్ చర్చ కొత్తమలుపు తిరిగింది. కేవీఆర్, ప్రశ్న రావణ్ అనే ఇద్దరు యూట్యూబర్ల అరెస్టుతో ఇది మరింత తీవ్రరూపం దాల్చింది. చాలాచోట్ల వారిపై వరస కేసులు నమోదైన ాయి. రావణ్‌ను నాలుగుసార్లు కోర్టులో హాజరుపర్చినా బెయిలుతో బయటకొచ్చారు. అయిదోసారి అతన్ని ఉపా చట్టం కింద మరోచోట అరెస్టు చేయడంతో కోర్టు కస్టడీకి పంపించింది. తన అసలు పేరు జోసఫ్‌ అనీ, అతను హిందూమతాన్ని, కూటమి నాయకులనూ కించపర్చ డానికే ఇవన్నీ చేస్తున్నాడనీ ఫిర్యాదులతో మొదలై, తర్వాత మావోయిస్టు భావజాల ప్రచారకుడనీ, ఆ పైన అసభ్య వీడియోలు దొరికాయనీ అటు ప్రభుత్వ వర్గాల ఆరోపణ. తను గతంలో మీతోనే వున్నాడని వైసీపీ వాదన. కొన్ని క్రైస్తవ ప్రచార సభల విడియోలు కూడా విడుదలైనాయి. అయితే రాధా మనో హర్‌ దాస్ వంటి వారికి జవాబుగానే ఇవి మాట్లాడామని, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఇటు వైపు వారు ప్రశ్నలు వదిలారు. ఈ కేసులు కోర్టుల ముందుకు పోవడం న్యాయమూర్తులు తమవైన వ్యాఖ్యానాలతో సంబం ధిత చట్టాల ప్రకారం ఉత్తర్వులు ఇస్తూ వస్తున్నారు. అసలు ఈ యూట్యూబర్లు జర్నలిస్టులా? వీరికి హక్కులేమిటి, ఎవరు ఎవరి వెనక వున్నారు అంటూ నిజాలు, అబద్దాలు, ఆరోపణలు, అభూత కల్పనలూ మేళవించి ఏది వాస్తవమో, ఏది కల్పితమో తెలుసుకోలేనంత దారుణంగా రాజకీయ మీడియా రంగాలు వేడెక్కి పోతున్నాయి. కేంద్ర రాష్ట్రాల పాలకపార్టీల ప్రభుత్వాల నేతల తిట్ల పురాణాలు, పోటాపోటీ సవాళ్లు వీటికి తోడై నిజమైన రాజకీయ విషయాలు తెర వెనక్కుపోయాయి.

అందరిపై దాడి.. హక్కులకు ముప్పు
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌పై జనసేన కేసులనాటి నుంచి ఈ ధోరణులు రగులుతూ వున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇలాంటి నిర్బంధ చర్యలు మంచివి కావని చెప్పిన ప్రకాశ్‌‌రాజ్ వంటివారిని కూడా పెద్ద నిందితుడిగా దూషించడం, అరెస్టు చేయాలనడం, సినిమాల నుంచి బహిష్కరించాలనడం వైసీపీ కుట్రలతో, నిధులతో, క్రైస్తవ ప్రచారాలతో ముడిపెట్టి చూపడం పరిపాటి అయింది. ఎన్‌ఐఎ రంగ ప్రవేశం చేసి విజయవాడలో ముస్లిం తీవ్రవాదులపై సోదాలంటూ హడావుడి మొదలుపెట్టింది. దీనికి ముందు ప్రధానంగా నడుస్తున్న సాయి‌కృష్ణ లాకప్ డెత్ వంటివి వెనక్కు పోయాయి. దేని నిజానిజాలేమిటన్నది నిస్పాక్షిక దర్యాప్తులలో విచారణలో మాత్రమే తేలాల్సి వుంటుంది. అది ఏ మేరకు సాధ్యమన్నది ఒకటైతే, ముందస్తుగా కులమత ముద్రలతో విషప్రచారం చేయడం, ప్రభుత్వాలు పోలీసులు కఠోర చట్టాలతో దాడి చేయడం వాంచనీయం కాదు. రాజ్యాం గం ప్రసాదించిన హక్కులు, చట్టాలు ఏ ఒక్కరికో ఒక్క సందర్భానికో పరిమితం కాదు. ఎవరో ఏదో దుర్విని యోగం చేశారని ఆరోపిస్తూ నిరంకుశ చర్యలకు పాల్పడితే అప్పుడు వాటి ఉనికికే ముప్ప వస్తుంది. కారణాలు ఏమి చెప్పినప్పటికీ దేశమంతటా ముందునుంచి వ్యతిరేకిస్తున్న ఉపా వంటివాటిని -అది కూడా ఒకటికి నాలుగుసార్లు కోర్టులు విడుదల చేసిన తర్వాత ప్రయోగించడం సమర్థనీయం కాబోదు. భాష పరంగా, పరువునష్టం పరంగా, మత వివాదాల నిరోధం పరంగా చర్యలు తీసుకోవడానికి చాలా అవకాశాలు న్నాయి. దానికి బదులుగా ఒకవైపున బెదిరింపులు మరోవైపున అప్రజాస్వా మిక చట్టాలను ప్రయోగించడమంటే అది విమర్శల నోరునొక్కే ప్రయత్నం అవుతుంది.. దేశవ్యాపితంగా కూడా మీడియా సోషల్‌ మీడియాపై పత్రికలపై విమర్శకులపై నిర్బంధ ఘటనలు రోజూ చూస్తున్నాం. కొందరు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు. ఏపీలోనే సోషల్‌మీడియాపై రెండు వేలకు పైగా కేసులు 14 వందలకు పైగా అరెస్టులు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అయితే అసలు సోషల్‌మీడియాను మీడియానే కాదంటున్నారు.

విమర్శిస్తే నిందలేనా?
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రశ్నలడిగిన కార్మిక సంఘాల నేతలపైన, కమ్యూనిస్టు నాయకులపైన కూడా పవన్, లోకేశ్‌లు ఎదురుదాడితో విరుచుకుపడ్డారు. తీరాచూస్తే ఇప్పటికి నెలరోజులు గడిచినా గట్టిగా చేసిందేమీ లేదు. హడావుడి మొత్తం ఆర్సెలార్ మిట్టల్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, డేటా సెంటర్లపైనే వుంది. వాటిపై రౌండ్ టేబుళ్లు నిరసనలు చేసేవారందరూ అభివృద్ధిని అడ్డుకునేవారేనా? భోగాపురంలో మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడిని స్వయంగా తెలుగుదేశం నాయకులు నిలదీయడం నిజం కాదా? విశాఖలో బీజేపీ, జనసేన నాయకులు ఆక్షేపణలు తెలపడం, కేసులెయ్యడం, ఆఖరుకు స్పీకర్ కూడా విచారణ కోరడం నిజం కాదా? వీరందరినీ ఎవరితో ముడిపెడతారు?రుషికొండపై అంత రభస చేసిన వారు రెండేళ్లయినా ఎందుకు తేల్చలేదు? కేంద్ర రాష్ట్రాలు పాలుపంచుకుంటున్న పోలవరం, అమరావతిలో సమస్యలకు పరిష్కార మెప్పుడు? తెలంగాణలో గత ప్రస్తుత ప్రభుత్వాల విధాన నిర్ణయంతో ముడిపడివున్న మెట్రో, కాళేశ్వరం వంటివాటిపై చర్యలేమిటి? తిరుపతి లడ్డూపై అంత రభస చేసిన వారు అయోధ్య రాముడి సొమ్ములే అపహరిం చారనే దానిపై మౌనం దాల్చడమేమిటి? గతంలో ఇదే విమర్శకులు కొందరు అప్పటిపాలకులపై పోరాడ లేదా? రఘురామకృష్ణం రాజు అరెస్టుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదా? కనక హక్కులు ఎవరివైనా ఎప్పుడైనా ప్రజాస్వామిక దృక్పథం ఒకటే విధంగా వుంటుంది. ఇప్పుడు ఆకివీడులో రఘురామ కృష్ణంరాజు వంటివారి చర్యలపై దళిత రిజర్వేషన్‌ను స్థానిక వివాదంగా మార్చినా చర్చిలపై దండెత్తుతున్నా కూటమి అధికారికంగా స్పందించలేదు. కానీ, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటున్నది. హిందూత్వ సంస్థలు ఆయన్నూ, పవన్‌కళ్యాణ్‌ను తమ కోసం నిలిచేవాళ్లుగా చెప్పుకుం టున్నారు. ప్రధాని మోడీతో అనుకూలంగా వుండాలన్న తాపత్రయంతోనే ఇప్పుడు వైసీపీ నేతలు హడావుడిగా విడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి వంటివారు ఏకంగా ఉరితీయాలంటున్నారు.

అప్రమత్తత అవసరం
బూతులు, మత పరమైన దుర్భాషలు, ఏవి ఎప్పుడు ఎవరు చేసినా సమర్థనీయం కాదు. ఎవరు అధికారంలో వున్నా వ్యక్తిగతంగా నాయకులను, మహిళలను, దళిత వర్గాలను కించపర్చడం తప్పు. వాటిపై చర్యతీసుకోవడానికి వున్న చట్టాలు సరిపోతాయి తప్ప నిరంకుశ చట్టాలను తవ్వి తీయనవసరం లేదు. మామూలు చట్టాలు ఆలస్యమవు తున్నాయి గనక నిలవడం లేదు, గనక ఉపా వంటివి రుద్దుతామనడం సరికాదు. నాజకీయ కక్షసాధింపులు ఎప్పుడూ అనుమతించ రానివి. ఈ విషయాలలో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలి గానీ మతాన్ని బట్టి, మనుషులను బట్టి పార్టీలను బట్టి మార్చకూడదు. అసలు కులమతాలను పోటాపోటీగా పెట్టి విద్వేషాలు పెంచడం రెచ్చగొట్టడం అనుమతించరానిది. అయితే తమది సనాతన మంటూ మతాలపై,దేవుళ్లపై అసలు ఎవరూ ఏమీ మాట్లాడరా దనడం కూడా నిలిచేది కాదు. సనాతనం అనడంలోనే ఒక రాజకీయ భావజాలాన్ని సమర్థించినట్టు స్పష్టమవుతుంది. భారత దేశంలో భిన్న మతాలు, విశ్వాసాలు వున్నాయి. ఇదే రావణ్ అన్న పేరే తప్పయినట్టు పోలీసులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దక్షిణభారతంలో రావణుడు బలి వంటివారిపై భిన్నాభిప్రాయాలున్నాయి, దైవపాత్రలకు పెట్టింది పేరైన ఎన్టీఆర్ స్వయంగా రావణుడిపై అభిమానమేమిటో ఒక వ్యాసమే రాశారు. ఇప్పుడు దాన వీర శూర కర్ణ తప్పంటే చెల్లుతుందా? బీజేపీ-ఆరెస్సెస్‌ల అధికారిక భావజాలంగా వున్న హిందూత్వను భుజాన వేసుకున్న కూటమి లౌకిక సంప్రదాయాలు గల ఏపీ వంటిచోట్ల యథాతథంగా అనుసరించా లనుకోవడం కుదిరే పనికాదు. బీజేపీ తదుపరి లక్ష్యంగా ప్రకటించిన తెలంగాణలోనూ ఈ ముసుగులో ఉద్రిక్తతలు వివాదాలు పెంచడం సరైందికాదు. త్వరలోనే సున్నితమైన హైదరాబాద్ సహా ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలోనూ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. కనక మరింత అప్రమత్తత అవసరం. మీడియా సంస్థలు కూడా వీటిని ఎన్నడూ ఆమోదించలేదు. అదే సమయంలో విడిపోయిన మీడియా సోషల్ మీడియాకు సంబంధించిన వారు కూడా బాధ్యతాయుతంగా సంయమ నంతో మెలగవలసి వుంటుంది. విధానపరమైన అంశాలను వదలి వివాదాలకు పెద్దపీట వేయడం వల్ల లాభం కన్నా చర్చ పక్కదోవ పట్టే ప్రమాదమే ఎక్కువని గ్రహించాలి.ఈ భావావరణాన్ని కాపాడుకోవడానికి బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజాసమస్యలు, ప్రజాస్వామ్య లౌకిక విలువల సంరక్షణ, సామ్రాజ్యవాద ఆధిపత్యాలు, కుల వివక్ష వంటివాటిపై పోరాటానికి ప్రాధాన్యత నివ్వాలి. ప్రజలు కూడా దేనికి ఎంత ప్రాధాన్యత నివ్వాలి? దేన్ని ఎంత విశ్వసించాలి? అనే విచక్షణ పెంచకోవాలి. ఎఐ యుగంలో ఇది మరింత అవసరం.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -