Saturday, July 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికల్తీ కాటు…ప్రజారోగ్యానికి చేటు!

కల్తీ కాటు…ప్రజారోగ్యానికి చేటు!

- Advertisement -

ఆహారం మనిషికి జీవనాధారం. అదే ఆహారం విషంగా మారితే సమాజానికి అంతకంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉండదు. నేడు మార్కెట్‌లోకి వస్తున్న అనేక ఆహార పదార్థాలపై ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు యాదృచ్ఛికం కావు. పాలు, నెయ్యి, వంటనూనెలు, కారం, పసుపు, మసాలా దినుసులు, స్వీట్లు, తేనె, ప్యాకెట్ ఆహార పదార్థాలు, పానీయాలు… ఇలా రోజూ మన ఇంటి వంటగదిలోకి చేరే ప్రతి వస్తువూ ఇప్పుడు నాణ్యత పరీక్షకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం కల్తీ వ్యాపారం కాదు. ఇది ప్రజల ఆరోగ్యంపై జరుగు తున్న ఒక నిశ్శబ్ద యుద్ధం. నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీసే విషపూరిత వ్యాపారం. లాభాల కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెట్టే అమానవీయ ధోరణి.

కల్తీ అనేది ఒక వ్యక్తి చేసే చిన్న నేరం కాదు. దీనివెనుక ముడి పదార్థాల సరఫరాదారులు, అక్రమ తయారీ కేంద్రాలు, నకిలీ ప్యాకింగ్ యూనిట్లు, మధ్యవర్తులు, పంపిణీదారులు, కొంతమంది వ్యాపారులు కలిసి పనిచేసే భారీ నెట్‌వర్క్ ఉంటుంది. ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ లేబుళ్లు ముద్రించడం, నాసిరకం పదార్థాలను కలిపి అసలైన ఉత్పత్తుల్లా విక్రయించడం, గడువు ముగిసిన వస్తువులకు కొత్త తేదీలు ముద్రించడం వంటి మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఒక్కరోజులో పుట్టిన సమస్యలు కావు, సంవత్సరాలుగా పర్యవేక్షణలో ఏర్పడిన బలహీనతల ఫలితమే.ప్రతి పండుగ సీజన్‌లో, లేదా ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు దాడులు నిర్వహించి టన్నుల కొద్దీ కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే అసలు ప్రశ్న వేరే ఉంది. ఈ వస్తువులు మార్కెట్‌లోకి వచ్చేంత వరకు తనిఖీ వ్యవస్థ ఏమి చేస్తోంది? అక్రమ తయారీ కేంద్రాలు నెలల తరబడి ఎలా కొనసాగుతు న్నాయి?ప్రతి దాడి తర్వాత మళ్లీ అదే తరహా కల్తీ బయటపడుతుంటే, దాడులు సమస్యకు పరిష్కా రమా? లేక కేవలం ప్రచార చర్యలుగానే మిగిలిపో తున్నాయా? కల్తీని అరికట్టాలంటే చిన్నచిన్న దుకాణాలపై చర్యలు తీసుకోవడం సరిపోదు. మూలాలను ఛేదించే దిశగా దర్యాప్తు సాగాలి. అక్రమ సరఫరా గొలుసును పూర్తిగా విచ్ఛిన్నం చేయాలి.

కల్తీ ఆహారం వల్ల వచ్చే నష్టం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ అది శరీరాన్ని లోపల నుంచి నెమ్మదిగా దెబ్బతీస్తుంది. కాలేయం, మూత్రపిండాలు, గుండె, జీర్ణవ్యవస్థ వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపు తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే కల్తీని సాధారణ ఆర్థిక నేరంగా కాకుండా, ప్రజల ప్రాణాలపై జరిగే దాడిగా పరిగణించే సమయం ఆసన్నమైంది. ఆహార భద్రతకు సంబంధించిన చట్టాలు దేశంలో కొదవలేదు. కానీ వాటి అమలులోనే సమస్య ఉంది. నమూనాల సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, కేసుల విచారణ, శిక్షల అమలు వంటి ప్రక్రియలు నెలల తరబడి, కొన్నిసార్లు ఏండ్ల పాటు సాగుతుండటంతో నేరస్థులకు భయం లేకుండా పోతోంది. కల్తీ కేసుల విచారణకు ప్రత్యేక వేగవంతమైన న్యాయవ్యవస్థ అవసరం. భారీ జరిమానాలతో పాటు పునరావృత నేరాలకు శాశ్వత లైసెన్స్ రద్దు, ఆస్తుల స్వాధీనం వంటి కఠిన చర్యలు అమలైతేనే పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది.
ప్రతి జిల్లాలో అత్యాధునిక ఆహార పరీక్షా ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. వినియోగదారులు మొబైల్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించాలి. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక ట్రాకింగ్ నంబర్ ఇచ్చి, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలి. దాడుల వివరాలు, పరీక్షల ఫలితాలు, శిక్షలు, లైసెన్స్ రద్దు చేసిన సంస్థల జాబితా ప్రజలకు అందుబాటులో ఉంచితే పారదర్శకత పెరుగుతుంది. భయమే నేరస్థులకు మొదటి శిక్ష. అలాగే ప్రభుత్వం మాత్రమే కల్తీని అరికట్టలేదు. వినియోగదారుడే మొదటి నిఘా అధికారి. కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై తయారీ తేదీ, గడువు తేదీ, నాణ్యత గుర్తులు పరిశీలించాలి. బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానాస్పద వస్తువులపై వెంటనే ఫిర్యాదు చేయాలి. సామాజిక మాధ్యమాల్లో నిర్ధారణ లేని ప్రచారం కాకుండా అధికారులకు ఆధారాలతో సమాచారం అందించాలి. ప్రజల అప్రమత్తత పెరిగితేనే కల్తీ వ్యాపారుల మార్కెట్ కుంచించుకు పోతుంది.

ప్రభుత్వాలు రోడ్లు వేయవచ్చు. భారీ భవనాలు నిర్మించవచ్చు. పెట్టుబడులు తీసుకురావచ్చు. పారిశ్రామిక అభివృద్ధి సాధించవచ్చు. కానీ ప్రజలు తినే ఆహారం సురక్షితంగా లేకపోతే ఆ అభివృద్ధికి అసలు అర్థమే ఉండదు. ఆహార భద్రత అనేది కేవలం ఆరోగ్య శాఖ బాధ్యత కాదు. అది పాలనకు ప్రమాణం. ప్రజల ప్రాణా లను కాపాడే అత్యంత ప్రాథమిక బాధ్యత. కల్తీపై పోరాటం ఒకరోజు దాడులతో ముగిసేది కాదు. అది నిరంతర పర్యవేక్షణ, కఠిన చట్టాల అమలు, పారదర్శక పరిపాలన, బాధ్యతాయుత వ్యాపారం, అప్రమత్తమైన ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంత మవుతుంది.
శ్రీశైలం దూడం, 9133947176

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -