గ్లాస్ డోర్ తెరిచిన వెంటనే చల్లని గాలి ముఖానికి తగిలింది. బయట నగరం ఇంకా ట్రాఫిక్ శబ్దాల్లోనే ఉంది. లోపల మాత్రం మరో ప్రపంచం.. తెల్లటి గోడలు. సాఫ్ట్ పసుపు వెలుతురు. పియానో సంగీతం మధ్య వైన్ గ్లాసులతో నెమ్మదిగా తిరుగుతున్న మనుషులు. ఆర్ట్ గ్యాలరీలు ఎప్పుడూ నాకు కొంచెం అసౌకర్యంగానే అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ అన్నీ అర్థం చేసుకున్నట్టే కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ రోజు గోడల మీద ఉన్న చిత్రాలు మాత్రం నటించడం లేదు. ఖాళీ ఇళ్లు. పగిలిన నేలలు. దూరంగా నడుస్తున్న నీడలు. చిరిగిన మ్యాపుల్లా కనిపించే గ్రామాలు. అవి పెయింటింగ్స్ కాదు. ఎవరో నిశ్శబ్దంగా నిలబడి, ”మమ్మల్ని మర్చిపోవద్దు” అని చెబుతున్నట్టున్నాయి. ఆమె ఆ హాల్లో ఎక్కడ ఉందో నేను వెతకాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆమె ఉన్న చోట హాలు కొంచెం ఎక్కువగా వెలుగుతున్నట్టు అనిపించింది. ఆమె చుట్టూ ఆమె స్నేహితులు. అందరితో మాట్లాడుతోంది. నవ్వుతోంది. కానీ గ్యాలరీ తలుపు తెరుచుకున్నప్పుడల్లా ఒకసారి తల పైకెత్తి చూస్తోంది. నేను లోపలికి అడుగుపెట్టిన క్షణంలో ఆమె చూపు నాపై ఆగిపోయింది. ఆ చిన్న క్షణంలోనే ఆమె ముఖం మారిపోయింది. అది పెద్ద ఆనందం కాదు. చాలా వ్యక్తిగతమైన రిలీఫ్. ఆమె నేరుగా నా దగ్గరికి వచ్చింది.
”నువ్వు వస్తావో లేదో అనుకున్నా” అంది.
”వస్తానన్నాను కదా” అన్నాను.
”ఇక్కడ ఎవరున్నా, నువు లేకుంటే అది లోటే..”
”ఇవాళ స్టార్స్ నీ పెయింటింగ్స్. నేను కాదు”
ఆమె నవ్వింది. అప్పటికే కార్యక్రమం మొదలవుతోంది. వేదికపై అతిథులు కూర్చున్నారు. ముందు వరుసల్లో విద్యార్థులు. వెనుక వైపు మీడియా వాళ్లు. గోడల దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్న సిటీ ఎలైట్. ”»»Her work has resistance…, »»Very political…,»»Beautifully disturbing…”వాక్యాలు గాల్లో తేలుతున్నాయి. నేను వెనుక నిలబడిపోవాలని అనుకున్నాను. అప్పుడే ఆమె మెల్లగా అంది..
”చివర్లో నువ్వు మాట్లాడాలి.”
నేను వెంటనే ఆమె వైపు తిరిగాను.
”నేనా?”
”అవును.”
”నేను అందుకు రాలేదు.”
ఆమె కొంచెం దగ్గరగా వచ్చి, చాలా నెమ్మదిగా అంది..
”ఇది నా ఆర్ట్ ఎగ్జిబిషన్ రామ్.. నువ్వు మాట్లాడకపోతే ఎలా?”
”ఏం చెప్పాలి?”
”చూసింది చెప్పు”
ఆ మాట తర్వాత నేను ఏం మాట్లాడలేకపోయాను. ఆమె మళ్లీ అతిథుల మధ్య కలిసిపోయింది. కార్యక్రమం కొనసాగుతోంది. అతిథులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు.. చప్పట్లు.. ఫొటోలు.. ఫ్లాష్‌లు.. కొద్దిసేపటికి నన్ను పిలిచారు. ఒక క్షణం నేను ఆమె వైపు చూశాను. వేదిక పక్కనే నిలబడి ఉంది. చేతులు ముడుచుకుని. చిన్నగా నవ్వుతూ కళ్లతోనే ఆహ్వానిస్తోంది. నేను వేదికపైకి నడిచాను. మైక్ ముందు నిలబడగానే గది మొత్తం నిశ్శబ్దమైంది. నాకు సిద్ధమైన ప్రసంగం లేదు. కొన్ని క్షణాలు గోడల మీదున్న చిత్రాలను మాత్రమే చూశాను. తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాను. ”నేను కళ గురించి మాట్లాడటానికి సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను రోజంతా వార్తల మధ్య ఉంటాను. అక్కడ సంఘటనలు ఉంటాయి. సంఖ్యలు ఉంటాయి. హెడ్‌లైన్లు ఉంటాయి” గది నిశ్శబ్దంగా వింటోంది. ఒక్కసారి ఆమెవైపు చూశాను. నేను కాసేపు ఆగగానే చిన్నగా తలూపింది.
”మాట్లాడు… నేను వింటున్నాను” అన్నట్టుగా.
”కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చాక ఒక విషయం అర్థమైంది. మేము వార్తల్లో రాసేది సంఘటనలు మాత్రమే. ఈ చిత్రాలు మాత్రం ఆ సంఘటనల తర్వాత మిగిలిపోయిన మనుషులను చూపిస్తున్నాయి.” ఆమె పెదవులపై నెమ్మదిగా చిరునవ్వు మెరిసింది. తన చిత్రాలను ఎవరో అర్థం చేసుకున్నప్పుడు వచ్చే చిరునవ్వు అది.
”ఒక గ్రామం ఖాళీ అయితే అది ఒక వార్త అవుతుంది. ఒక ఇల్లు కూలిపోతే అది ఒక గణాంకం అవుతుంది. కానీ ఈ గోడల మీద… ఆ వార్తల్లో కనిపించని జీవితాలు కనిపిస్తున్నాయి” చివరి వాక్యం చెప్పేటప్పటికి నా చూపు మళ్లీ ఆమెను వెతికింది. ఆమె కళ్ళు నాపైనే ఉన్నాయి. హాల్లో ఉన్న మిగతా వాళ్లందరూ వింటున్నారు. కానీ ఆమె మాత్రం వినడం కాదు. నా మాటల వెనుక నేను ఏం అనుభవిస్తున్నానో చదువుతున్నట్టుంది. ఆమె కళ్లలో కనిపించిన ఆ చిన్న వెలుగు, నేను ఇంకా చెప్పాల్సిన మాటలను గుర్తు చేసింది.
”కొన్ని చిత్రాలు గోడల మీద వేలాడవు. అవి మన మనస్సాక్షికి ఎదురుగా నిలబడతాయి.” చివరి మాట చెప్పే ముందు మరోసారి ఆమెవైపు చూశాను. ఆమె కళ్లలోని నిశ్శబ్దం, నా ప్రసంగానికి అందని చోటుకు చేరుతోంది. నా గొంతు కొద్దిగా భారమైంది.
”కొన్నిసార్లు… మన మౌనాన్ని పగలగొట్టడానికి కూడా కళ అవసరం..”
అంతే.. ఒక్క క్షణం హాలు నిశ్శబ్దంగా నిలిచిపోయింది. తర్వాత చప్పట్లు. ముందు వరుసల నుంచి మొదలై నెమ్మదిగా హాలు మొత్తం వ్యాపించాయి. నేను మైక్ నుంచి వెనక్కి జరిగాను. ఆ శబ్దాల మధ్య కూడా నా చూపు మళ్లీ ఆమెనే వెతికింది. ఆమె అక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఆమె చుట్టూ మనుషులు చేరుతున్నారు. అభినందనలు, కరచాలనాలు, ఫొటోలు. నేను వేదిక దిగాను. కొద్దిసేపటి తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చింది.
”ఇంతకాలం నువ్వు నీలోనే దాచుకున్నావా ఇవన్నీ?” అంది.
”చెప్పే అవకాశం రాలేదు అంతే” అన్నాను. ఆమె నవ్వింది.
”నువ్వు వార్తల్లో మనుషులను వెతుకుతావు రామ్… అందుకే నువ్వు ఇంకా చెడిపోలేదు.”
ఆ మాట చెప్పి ఆమె మరోసారి నావైపు చూసింది. ఆ చూపులో అభినందన లేదు. ఆశ్చర్యం లేదు. ఏదో కొత్తగా తెలుసుకున్న మనిషి నిశ్శబ్దం మాత్రమే ఉంది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఆ హాల్లో ఉన్నవాళ్లు నా ప్రసంగం విన్నారు. ఆమె మాత్రం నా మాటల వెనుక దాగి ఉన్న మనిషిని విన్నది.
రామ్
గ్యాలరీ డైరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



