ఇరాన్ సుప్రీం లీడర్
మొజ్తాబా ఖమేనీ హెచ్చరికలు
యుద్ధంలో మరణించిన
వారందరికీ న్యాయం
జరిగే వరకూ పోరాటం
ప్రపంచవ్యాప్తంగా మద్దతుదారులు
ఇందులో భాగమవుతారు
అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల అనంతరం
తొలిసారిగా దేశ ప్రజలకు సందేశం
భద్రతా కారణాలతోనే అంత్యక్రియలకు
మొజ్తాబా గైర్హాజరు : ఇరాన్ వివరణ
టెహ్రాన్ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదని ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. తండ్రి అంత్యక్రియలు ముగిసిన తర్వాత తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన సందేశం విడుదల చేశారు. అలీ ఖమేనీతో పాటు ఇటీవలి యుద్ధాల్లో మరణించిన వారందరి రక్తానికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం ఈ మేరకు రాతపూర్వక సందేశాన్ని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇరాన్, ఇరాక్‌లోని టెహ్రాన్, కోమ్, నజఫ్, కర్బలా, మష్హద్ నగరాల్లో లక్షలాది మంది ప్రజలు అంతిమయాత్రల్లో పాల్గొనడాన్ని చారిత్రక సంఘటనగా అభివర్ణించారు. శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనే సంకల్పాన్ని ప్రజలు తమ హాజరుతో చాటారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసిన వారిని నేరస్థులు, అవమానకర హంతకులుగా మొజ్తాబా ఖమేనీ అభివర్ణించారు. వారి చేతుల్లో చనిపోయిన తన తండ్రితో పాటు ఇటీవలి రెండు యుద్ధాల్లో మరణించిన అమరులందరి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ‘‘మీ వారసత్వాన్ని కాపాడుతాం. మీ పవిత్ర రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఆయన తన సందేశంలో చెప్పారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అనీ, దానిని కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు. ఈ ప్రతీకారం తనతోనో, ఇరాన్ ప్రభుత్వంలోని ఇతర అధికారులతో మాత్రమే పరిమితం కాదనీ, ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛను విశ్వసించే ప్రజలు కూడా ఈ లక్ష్య సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తారని ఆయన హెచ్చరించారు. తనను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన నేపథ్యంలో మొజ్తాబా ఖమేనీని నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
కాగా ఈ ప్రకటనకు ముందు మొజ్తాబా ఖమేనీ వారం పాటు జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అలీ ఖమేనీకి చెందిన మరో ముగ్గురు కుమారులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మొజ్తాబా మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే ఆయన గైర్హాజరుపై ఇరాన్ ఒక వివరణనిచ్చింది. భద్రతా కారణాలతోనే ఆయన పాల్గొనలేకపోయారని అధికారులు వెల్లడించారు. అదే దాడిలో మొజ్తాబా ఖమేనీ కూడా గాయపడినట్టు, ప్రస్తుతం ఆయన బహిరంగంగా కనిపించకుండా తెర వెనుక నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా–ఇజ్రాయెల్ దాడిలో అలీ ఖమేనీ మరణించిన విషయం విదితమే. అనంతరం టెహ్రాన్‌లో ప్రారంభమైన అంత్యక్రియలు కోమ్ మీదుగా మష్హద్‌కు చేరుకున్నాయి. ఈనెల 9న మష్హద్‌లోని షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఇమామ్ రెజా దర్గాలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. అదే దాడిలో మరణించిన ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యుల సమాధుల పక్కనే అలీ ఖమేనీని ఖననం చేశారు. వారం పాటు కొనసాగిన ఈ అంతిమయాత్రల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొనడంతో ఇది ఇరాన్ చరిత్రలో అతిపెద్ద ప్రభుత్వ అంత్యక్రియల్లో ఒకటిగా నిలిచింది.
నాన్న మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


