ఫైబర్ తీగల గూటిలో కాలం గుడ్లు పెట్టి పొదుగుతోంది,
అరచేతి ఆకాశాల్లో చిక్కుకున్న మనిషి
తన నీడను తానే వెతుక్కుంటున్నాడు.
కోటి దీపాల వెలుగును మింగిన తెరల మధ్య
ఒక గుండె ఇంకా చీకటిలో దారి వెతుక్కుంటోంది
ఛాతీలో కొట్టుకునే పావురం రెక్కల చప్పుడును
నోటిఫికేషన్ల తుఫాను ఎప్పుడో ముంచేసింది.
పచ్చని అడవుల గొంతుకోసి
సిమెంట్ పర్వతాలకు పట్టాభిషేకం చేశాం
ఇప్పుడు గాలే శరణార్థిలా కిటికీల వద్ద ఆశ్రయం అడుగుతోంది.
ఆకాశహర్మ్యాల నీడల్లో ఆకలి ఎముకలు వీణ తీగల్లా కంపిస్తున్నాయి;
అభివద్ధి రథం చక్రాలకు అంటుకున్న దుమ్ములో
ఎన్ని బతుకుల రక్తచారికలో ఎవరికీ కనిపించవు.
నవ్వుల ముఖవస్త్రాల వెనుక
విషాదం నల్లజెండా ఎగురవేస్తోంది
సంబంధాల పట్టుదారాలను
స్వార్థపు చిమ్మట నెమ్మదిగా కొరుకుతోంది.
పాల వాసన మిగిలిన మాతఒడిని
ధరల పట్టికపై వేలానికి పెట్టారు
విలువల పురాతన వక్షాన్ని నరికి
నాణేలతో కొత్త మందిరాలు కట్టారు.
విశ్వాన్ని గుప్పెట్లో పెట్టుకున్న మనిషి
తన అంతరంగ ద్వారం మాత్రం తెరవలేకపోయాడు
జ్ఞాన సముద్రం మధ్య నిలబడి
దాహంతో పెదవులు చిట్లించుకుంటున్నాడు.
సమతా మమతల సమాధులపై
ఇనుప సామ్రాజ్యాలు మొలుస్తున్నాయి
యంత్రాల చక్రాల మధ్య చిక్కుకున్న ప్రాణం
తన హదయాన్నే యాచిస్తోంది.
అయినా – బూడిద కింద ఇంకా ఒక అగ్నికణం
మిణుకు మిణుకు మంటోంది
చివరి ఆకు రాలిపోయిన కొమ్మలోనూ
వసంతం చిరునామా దాగి ఉంది.
ఓ మనిషీ!
మట్టిలో మళ్లీ ప్రేమ విత్తనాన్ని నాటు,
కరుణకు నీళ్లు పోసి పెంచు
లేకపోతే ఈ గ్లోబల్ గూడంతా
ఒక రోజు
మనుషులు లేని కీకారణ్యంగా మిగిలిపోతుంది.
– యండి. ఉస్మాన్ ఖాన్, 9912580645
అరచేతి ఆకాశాల కింద…
- Advertisement -
- Advertisement -



