బాలసాహిత్య వికాసోద్యమంలో నికార్సయిన తత్వంతో అచ్చంగా పనిచేసిన వ్యక్తులు చాలా కొద్ది మందే మనకు కన్పిస్తారు. అటువంటి వారి సాహిత్యమే నిలబడిందని చెప్పవచ్చును. అట్లా దాదాపు దశాబ్దమున్నర క్రితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే బాల సాహిత్యంలో బడి బాషకు బదులు ఇంటి భాషకు పట్టం కట్టి తెలంగాణ మాండలిక పదాలతో బాలల కోసం అనేక కథలు రాసిన వారిలో పెండెం జగదీశ్వర్ ముందు వరుసలో వుంటారు. చాలా కాలం పాటు ఇంటి భాషలో కథలు రాస్తూ నూతన ఒరవడి సృష్టించారు. పెండెం జగదీశ్వర్ వినోదం కోసమో, అవార్డుల కోసమో రచనా రంగంలోకి అడుగు పెట్టలేదు. వర్తమాన విషయాలపై స్పందిస్తూ నిత్యం చైతన్యం గావించన అక్షరయోగి మాత్రమే కాదు, ఆయన పిల్లల మనసును గెలిచిన అచ్చమైన బాల సాహితీవేత్త.
జగదీశ్వర్ వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ప్రవృత్తి రీత్యా కార్టూనిస్టు గా, బాలల రచయితగా పనిచేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక బాల సాహిత్య కార్యశాలలో పాల్గొని ఎన్నో సృజనాత్మక రచనలు చేశారు.అయన ఉమ్మడి నల్లగొండ (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి) జిల్లాలోని రామన్నపేటకు సమీపంలోని మునిపంపుల గ్రామంలో చేనేత కుటుంబంలో జూన్ 28, 1976 లో జన్మించారు. స్వచ్ఛమైన తెలంగాణ మాండలిక పదాలను పట్టుకుని పిల్లల కథలు రాయడంలో మంచి దిట్ట. కానీ పిల్లల సాహిత్యంలో గెలిచినప్పటికీ, జీవితంలో స్వల్ప కాలంలోనే ఓడిపోయి అందరి హృదయాలలో జీవిస్తున్న విజేత మన పెండెం జగదీశ్వర్.
బాల సాహిత్యం రాశిలోనూ పెరిగిన మాట వాస్తవమే . కుప్పలు కుప్పలుగా పుస్తకాలు పెరుగుతున్నాయి. ప్రతి వారానికి వివిధ దిన పత్రికలలో పదిహేను వరకు బాలల కథలు వస్తున్నాయి. అయితే రాసినదంతా నిలవడటం లేదు. విద్యార్థులకు చేరువ కావడం లేదు. కానీ ఆనాడే ప్రతిభావంతంగా జీవ భాషలో పిల్లల స్థాయికి అనుగుణంగా పిల్లలే కాదు పెద్దలు మెచ్చే విధంగా అనేక కథలు రాసి ఒక విలక్షణ శైలి సృష్టించారు పెండెం జగదీశ్వర్. మనకు తెలిసిన మన కథలను తెలంగాణ మాండలిక భాషలో చెప్పడం జగదీష్ కు తెలిసినంత విద్య మరెవ్వరికీ తెల్వదని చెప్పవచ్చుననేది నా వ్యక్తిగత అభిప్రాయం. 1994 నుండి బాల సాహిత్యంలో రచనలు చేస్తున్న ఇతను ” ఆంధ్రప్రదేశ్ జానపద కథలు ” దగ్గర నుండి “ఆనంద వృక్షం,” “గజ్జెల దయ్యం” , “పసిడి మొగ్గలు”, “వంకాయంత వొజ్రం”, “విడ్డూరాల బుడ్డోడు” , “నాకోసం ఎవలేడుస్తరు?, “నూట పదహారు నవ్వులు”, “తాను తీసిన గోతిలో”, “ముగ్గురు అవివేకులు”, “మాతో పెట్టుకోకు”, “దాగని నిజం”, “మతి మరుపు అల్లుడు”, “బంగారం చేసే విద్య”, “దొంగ స్వామిజీ” , “చిన్ని కోరిక” వంటి వివిధ పుస్తకాలు రాశారు. అతడు రాసిన ప్రతి పుస్తకం పిల్లల్నే కాదు పెద్దలను సైతం ఆకర్షించే విధంగా మాత్రమే కాకుండా ఆలోచింపజేసే విధంగా ఉన్నవని కూడా చెప్పవచ్చును. పిల్లలంతా జగదీశ్వర్ రాసిన కథల కోసం పాఠశాలల్లో ఎదురు చూడటం ఆ రోజులలో జరిగేది. ఇంకా ఆయన వైజ్ఞానిక దృక్పథంతో కూడా అనేక కథలు రాశారు. ఏ కథ చదివినా ముచ్చుట పెడుతున్నట్లే అనిపిస్తది. పెండెం జగదీశ్వర్ కళాజాత బృందాల కోసం, ఆ నాటి వయోజన విద్యా ప్రచారం కోసం జన విజ్ఞాన వేదిక సభ్యునిగా హేతుబద్ధ దృక్పథంతో చిన్న చిన్న కథలు రాశారు. “గజ్జెల దయ్యం” పుస్తకంలో ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలు, భయాలపై లోతుగా ఆలోచింపజేశాడు. ప్రతి కథలో ఉన్న కారణాన్ని చూపిస్తూ ప్రజలను సహితం చైతన్యం చేశాడు. ఈ పుస్తకానికే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు బాల సాహిత్య కీర్తి పురస్కారం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ జిల్లా “జాబిల్లి” పిల్లల మాస పత్రిక సంపాదక మండలిలో నాతో కలిసి పని చేయడం మరిచిపోలేని అనుభూతి. పిల్లల కోసం నిరంతరం తపన పడుతూ వివిధ పాఠశాలల్లో ఆనాడు సర్వ శిక్ష అభియాన్ అమలు చేసిన వినూత్న కార్యక్రమంలో భాగంగా పిల్లలు రాసిన మంచి మంచి కథలను, బొమ్మలను సేకరించి జాబిల్లి పత్రికలో ముద్రితం అయ్యేవిధంగా కృషి చేస్తూ పిల్లల్ని ప్రోత్సహించే వారు. ఆయన ఏది రాసినా, ఏది చేసినా ఒక వినూత్నంగా ఉండేది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినంక జగదీశ్వర్ రాసిన “బడి పిల్ల గాళ్ళ కథలు” ఇంటి భాషకు మహా గొప్పగా పట్టం కట్టాయి. అదేవిధంగా “విడ్డూరాల బుడ్డోడు” కథలు కూడా బాగా ఆకర్షిస్తాయి. సరదాగా అనిపించే ఈ కథలు ఎదుగుతున్న బాల్యాన్ని పరిచయం చేస్తాయి. తెలంగాణ మాండలికం అయిన కిత కితలను గమ్మతి గమ్మతిగా పదిలపరుచుకుంది. కష్టం, శ్రమ, గ్రామీణ జీవన సౌందర్యం లోని అంతరార్ధం , పరమార్ధం బాగా తెలిసినవాడు. అందుకే ప్రతి కథలో వాటిని ప్రతిబింబింప చేశాడు. గ్రామీణ కుల వృత్తులను సహితం కథలో చెప్పించి , పిల్లలు జాగరూకులు అయ్యే విధంగా సమయస్ఫూర్తిగా వివరించే తీరును విశ్లేషించ గలిగారు. జగదీశ్వర్ రాసిన అనేక కథలలో అద్భుతమైన హాస్యాన్ని పండింపజేశారు.
పర్యావరణ స్పృహ ను కలిగిస్తూ జగదీశ్వర్ రాసిన “చెట్టు కోసం ” కథను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం లోని ఆరవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా 2007-08 విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టింది. తెలంగాణ యవనిక మీద బలమైన వాగ్దానాల సంతకాలు చేసిన అతడు శాశ్వతంగా 42యేండ్ల అతి పిన్న వయసులోనే జూలై 19న కనుమరుగైపోవడం అత్యంత విషాదకరం. తెలుగు సాహితీ లోకాన్ని దుఃఖ సముద్రంలోముంచి వెళ్లి పోయాడు. బాలజ్యోతి, బాలమిత్ర, బాలభారతి, బుజ్జయి వంటి పత్రికలలో అయన రాసిన ఎన్నో కథలు ముద్రితమైనయి. ఇంకా చెకుముకి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, వార్త, బతుకమ్మ, మొదలగు దిన, మాస పత్రికలలో అనేక వ్యాసాలు, కార్టున్లు ప్రచురింప బడినాయి. కథలో ఎలా గెలవాలో చెప్పినవాడు జీవితంలో తాను నిలువలేకపోయాడు. ఇది అత్యంత బాధాకరం.
బాల సాహిత్యానికే వన్నెతెచ్చిన పెండెం జగదీశ్వర్ కు అనేక సన్మానాలు, అవార్డులు లభించాయి. ఉత్తమ రచయితగా , కార్టూనిస్టుగా ఆనాటి కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి గారిచే సన్మానం పొందారు. కరీంనగర్ నుండి వాసాల నరసయ్య బాల సాహితీ పురస్కారం 2013లో లభించింది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే సత్కారం తీసుకున్నారు. 2014 లో అక్షర భారతి చౌటుప్పల్ వారి అక్షర సాహిత్య పురస్కారం పొందారు. ఇలా ఎన్నో సన్మానాలు సత్కారాలు స్వీకరించడం జరిగింది. ఉపాధ్యాయుడిగా అంకిత భావంతో తాను పనిచేసిన ప్రతిచోట వేలాది మంది విద్యార్థులకు , అనేకమంది మిత్రులకు ఆదర్శంగా నిలిచిన పెండెం సేవలు నిజంగా చిరస్మరణీయం. అందుకే ఆయన మరణానంతరం కూడా అతని ఆత్మీయులు, స్నేహితులు మిత్ర బృందంగా ఏర్పడి, ఆయన రాసిన బాల సాహిత్యాన్ని బతికించే విధంగా ప్రయత్నం చేస్తూ పెండెం జగదీశ్వర్ స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కారం ఇచ్చే కార్యక్రమంలో కీలక పాత్ర వహిస్తున్నారు . ఈ విధంగా ప్రతి యేటా బాల సాహిత్యంలో విశేష సేవలు కనబరిచిన తెలుగు రాష్ట్రాల నుండి ఒకరిని ఎంపిక చేసి 5,116 ల నగదు, శాలువ, మేమెంటోతో పురస్కారం ప్రదానం చేస్తున్నారు. 2018లో పెండెం మరణించిన సంవత్సరంలో “బాల సాహిత్య రత్న” పేరుతో వ్యాస సంకలనం తీసుకొచ్చారు. ఇందులో అనేకమంది ప్రముఖులు డాక్టర్ కృష్ణ కౌండిన్య, పెరుమాళ్ళ ఆనంద్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పుప్పాల కృష్ణమూర్తి, మే రెడ్డి యాదగిరి రెడ్డి, సాగర్ల సత్తయ్య, బాసరాజు యాదగిరి, ఉప్పల పద్మ, తదితరులెందరో పెండెం జీవితం పై, సాహిత్యం పై వ్యాసాలను రాశారు. మొట్టమొదటగా సూర్యాపేట జిల్లాకు చెందిన పుప్పాల కృష్ణమూర్తి తొలుత ఈ పురస్కారం అందుకున్నారు. అనంతరం 2021లో చొక్కాపు వెంకటరమణ, 2022 లో వి.ఆర్. శర్మ, 2023లో దార్ల బుజ్జిబాబు, 2024లో గరిపెళ్లి అశోక్ ,2025లో మంజులూరి కృష్ణకుమారి వంటి ప్రముఖ బాల సాహితీవేత్తలు వరుసగా అందుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుతం 2026 సంవత్సరానికి గాను ప్రముఖ బాలసాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పత్తి పాక మోహన్ కు “పెండెం జాతీయ స్మారక బాల సాహిత్య పురస్కారం” జులై 19న జగదీశ్వర్ వర్ధంతి సందర్భంగా నల్లగొండలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. బాల సాహిత్యానికి దండెంగా నిల్చిన పెండెం సేవలు నిజంగా చిరస్మరణీయం.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655
బాల సాహిత్యానికి పెండెం సేవలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -


