Monday, July 13, 2026
E-PAPER
Homeఆటలుటీజీ20 తొలి ఛాంపియన్ హైదరాబాద్..

టీజీ20 తొలి ఛాంపియన్ హైదరాబాద్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ యువ క్రికెట్ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రారంభించిన తొలి టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఈ ఫ్రాంఛైజీ, ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఖమ్మం ఏసెస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి తొలి సీజన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు తామే నిజమైన ఛాంపియన్లమని నిరూపించుకుంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. స్పిన్నర్ యశ్వీర్ గౌడ్ (3/17) తన మాయాజాలంతో ఖమ్మం బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయగా, పేసర్లు దేవ్ మెహతా (2/25), అజయ్‌దేవ్ గౌడ్ (2/36) రాణించారు. దీంతో ఖమ్మం జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో మికిల్ జైస్వాల్ (39 బంతుల్లో 65) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. హిమతేజ (31)తో కలిసి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయినప్పటికీ, చివర్లో హైదరాబాద్ బౌలర్లు మళ్లీ పట్టు బిగించడంతో ఖమ్మం ఏసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే, షణ్ముఖ అశ్విన్ (36), కెప్టెన్ అభిరథ్ రెడ్డి (48) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత వైష్ణవ్ రెడ్డి (28 బంతుల్లో 41 నాటౌట్) ఆకాశమే హద్దుగా సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ప్రణవ్ వర్మ (19 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా 17.3 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చాడు.

విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు రూ. కోటి, రన్నరప్‌గా నిలిచిన ఖమ్మం ఏసెస్‌కు రూ. 50 లక్షల నగదు బహుమతి లభించింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, డీజీపీ సి.వి.ఆనంద్, లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండతో పాటు రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సీహెచ్ కిరణ్, మార్గదర్శి ఎండీ సీహెచ్ శైలజాకిరణ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, ఈటీవీ, రామోజీ టూరిజం డైరెక్టర్లు హాజరయ్యారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్ (అభిరథ్ రెడ్డి), అత్యధిక వికెట్లు తీసినందుకు పర్పుల్ క్యాప్ (అజయ్ దేవ్ గౌడ్) రెండూ హైదరాబాద్ ఆటగాళ్లకే దక్కడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -