ప్రజల సందర్శనార్థం రేపు సీపీఐ(ఎం) కార్యాలయానికి మృతదేహం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీఐటీయూ సీనియర్ నాయకులు, గవర్నమెంట్ ప్రెస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకులు పసుపులేటి వెంకటేశ్వరరావు (92) సోమవారం రాత్రి కన్ను మూశారు. కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 13న రాత్రి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని జులై 16 (గురువారం) ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు హైదరా బాద్లోని సీపీఐ(ఎం) హైదరాబాద్ సిటీ సెంట్రల్ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. విదేశాల్లో ఉన్న కుమార్తె, అల్లుడు జనీల అండ్ అశోక్ వార్త తెలిసిన వెంటనే స్వదేశానికి బయలుదేరారు.
మరణానంతరం కూడా సమాజానికి సేవ చేయాలన్న తన ఆకాంక్ష మేరకు పసుపులేటి వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు ఇవ్వనున్నట్టు కుమార్తె ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఆయన కోరిక మేరకు కంటి కార్నియాలను వాసన్ ఐ బ్యాంక్ కు, చర్మాన్ని ఉస్మానియా ఆస్పత్రి స్కిన్ బ్యాంక్ కు ఈ నెల 14న దానం చేసినట్టు చెప్పారు. పసుపులేటి వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మిక ఉద్యమాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
తీరని లోటు : సీఐటీయూ
హైదరాబాద్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం(చంచల్గూడ) యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సీఐటీయూ నేత పసుపులేటి వెంకటేశ్వరరావు మృతికి సీఐటీయూ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఈ మేరకు సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రేడ్యూనియన్లో పీవీ రావుతో తమకున్న సాన్నిహిత్యాన్ని పాలుపంచుకున్నారు. టీయూతో పాటు విద్యార్థి, మహిళా, ఎన్పీఆర్డీ, తదితర ప్రజా సంఘాలకు ఆయన అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. ఆయన నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్ధమని పేర్కొన్నారు. సాధారణ కార్మికులతో పాటు ప్రజా సంఘాల నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ తన అనుభవాలను పాలుపంచుకునేవారని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఆదర్శ కమ్యూనిస్టు
ఆయన మృతి బాధాకరం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
గవర్నమెంట్ టెక్స్ట్బుక్ ప్రెస్ యూనియన్(సీఐటీయూ) నాయకులు, సీపీఐ(ఎం) సీనియర్ నేత పసుపులేటి వెంకటేశ్వరరావు(92) మృతి బాధాకరమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకటేశ్వరరావు ఆదర్శ కమ్యూనిస్టుగా బతికారని కొనియాడారు. ఆయన తన మొత్తం కుటుంబాన్ని పార్టీకి, ప్రజా ఉద్యమాలకు మమేకం చేశారని గుర్తుచేశారు. వెంకటేశ్వరరావు సుధీర్ఘ కాలం పాటు సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యదర్శివర్గ సభ్యులుగా పనిచేశారని తెలిపారు. అనారోగ్యంతో ఆయన మరణించడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు
ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య
ప్రముఖ కార్మిక నేత, గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపకులు పసుపులేటి వెంకటేశ్వర్ రావు (92) మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, ప్రధాన కార్యదర్శి యం అడివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సీపీఐ(ఎం) అభివృద్ధికి, గవర్నమెంట్ ప్రెస్ లో యూనియన్ బలోపేతం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. మంగళవారం చిక్కడపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో పీవీ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగుల కోసం సంఘం చేస్తున్నా ఉద్యమాలను అభినందించేవారని తెలిపారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటాలను ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. ఎన్పీఆర్డీ చేస్తున్న అనేక ఉద్యమాలకు ఆయన చేయూతనందించేవారని తెలిపారు. జీవితాంతం మంచి కమ్యూనిస్టుగా జీవించారనీ, చనిపోయిన తర్వాత కూడా తన దేహాన్ని దేశానికి, ప్రజాసేవకు ఉపయో గించారని కొనియాడారు. ఆయన అవయవాల దానం చేయడమే కాకుండా తన ఇద్దరు కూతుళ్లు జానిలా, సుశీలలతో కూడా చేయించిన గొప్ప మానవతా మూర్తి అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కాషాప్ప, ఉపేందర్, స్వామి , బాలేశ్వర్, గంగాధర్, రమేష్, షాహిన్ బేగం, శివ, రజిత తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ సీనియర్ నేతపసుపులేటి వెంకటేశ్వరరావు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



