Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన ప్రాంతాల ప్రభుత్వాస్పత్రులకు కొత్తపాలసీ

గిరిజన ప్రాంతాల ప్రభుత్వాస్పత్రులకు కొత్తపాలసీ

- Advertisement -

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహా, రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి కొత్త పాలసీ తీసుకొస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ ప్రకటించారు. ఐటీడీఏల పరిధిలోని అన్ని ఏరియాస్పత్రుల్లో దశలవారీగా సిటీస్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. అవసరమైన చోట కొత్త సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలను మంజూరు చేస్తామనీ, కొన్నింటిని అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తామని హామీనిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనుకయ్య, జారె ఆదినారాయణ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎమ్‌‌డీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, వైద్యారోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లాలోని ఏరియాస్పత్రుల్లో సీటీ స్కాన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పీహెచ్‌సీలలో 24 గంటలు వైద్య సేవలందించేలా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏజెన్సీలో కరెంటు సమస్యరీత్యా పీహెచ్‌సీల్లోనూ జనరేటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగూడెం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఎంసీహెచ్, జీజీహెచ్ నడుమ దూరమెక్కువ కాబట్టి ఎంసీహెచ్‌కు ప్రత్యేకంగా ఇన్‌‌చార్జి సూపరింటెండెంట్‌ను నియమించాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికీ ఒక అంబులెన్స్ మంజూరు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఏడు డయాలసిస్ సెంటర్లు ఉండగా, కొత్తగా మరో నాలుగు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏజెన్సీలోని అన్ని పీహెచ్‌‌సీల్లోనూ జనరేటర్‌ ‌సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్వారీగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తామనీ, గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కొమురారం ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, ఇల్లందు దవాఖానాలో ఐసీయూను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, కొత్తగూడెం ఎంసీహెచ్‌లో డాక్టర్లు, సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు డాక్టర్‌‌ను ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది ఆటెండెన్స్‌ మానిటరింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -