Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి

ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి

- Advertisement -

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి 1000 పడకలకు పెంచాలి
సమస్యల వలయంలో ప్రభుత్వాస్పత్రి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ–ఖమ్మం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఆస్పత్రిని 1000 పడకలకు విస్తరించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి జిల్లా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. అయితే అందుకనుగుణంగా వైద్య సౌకర్యాలు, సిబ్బంది అందుబాటులో లేరన్నారు. ఓపీ కేంద్రం వద్ద రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని, రద్దీకి అనుగుణంగా ఓపీ కేంద్రాలను పెంచాలని కోరారు. మందుల పంపిణీ కౌంటర్ల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 575 పడకలున్న ఆస్పత్రిని 1000 పడకలకు పెంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని, అందుకు అనుగుణంగా కాంట్రాక్ట్ వైద్యుల స్థానంలో రెగ్యులర్ వైద్యులను నియమించాలని అన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గైనకాలజిస్టుల కొరతను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆస్పత్రి భవనాల నిర్మాణాలకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని, ఇప్పటికే నిర్మించిన నూతన భవనాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. పాత ఆస్పత్రిలో ఓపీ విభాగాన్ని మెరుగు పరిచేందుకు మంజూరైన నిధులతో రోగులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. రూ.6 కోట్లతో మంజూరైన ఎంఆర్ఐ యంత్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఐ, స్కానింగ్ సౌకర్యాలు లేక పేద రోగులు ప్రయివేట్ ఆస్ప్రతులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధులకు రెగ్యులర్ వైద్యులు లేరని, వెంటనే నియమించాలని అన్నారు. సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు శానిటేషన్, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. కార్మికులకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
వికలాంగుల కోసం నిర్వహించే సదరం క్యాంపుల్లో సౌకర్యాలు పెంచి క్యాంపుల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌రేలు, రక్త పరీక్షల ఫలితాలు ఆలస్యంగా అందుతున్నాయని, వాటిని త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రిలో చేరిన రోగులందరికీ నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అవసరమైన అన్ని రకాల మందులను ప్రభుత్వ ఆస్పత్రిలోనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రి పరిశీలనలో.. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్‌, వై. విక్రమ్, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, ఎంఏ జబ్బార్, ఎస్‌కే మీరా సాహెబ్, టి. విష్ణు, పి. రమ్య, మెరుగు రమణ, ప్రవీణ్, మధు, ఎస్‌కే నాగులు మీరా, బోడపట్ల సుదర్శన్, వజినేపల్లి శ్రీనివాసరావు, పి. నాగసులోచన, ఎస్‌కే ఇమామ్, అమరావతి, కూరపాటి శ్రీను, భాగం అజిత, రాజు, సదానందం, కుటుంబరావు, పోతురాజు వెంకట్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -