రోడ్ల విస్తరణకు అడ్డంకులు తొలగింపు
నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలో రహదారులు,పుట్ ఫాత్ ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, రహదారులను ఆక్రమించి నిర్మించుకున్న అక్రమ కట్టడాలను అధికారులు బుధవారం కూల్చివేశారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు మరియు పట్టణ సౌందరీకరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రధాన రహదారుల పక్కన అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లు, గోడలు మరియు ఇతర ఆక్రమణలను అధికారులు గుర్తించి, జేసీబీల సహాయంతో వాటిని తొలగించారు. ఆక్రమణదారులందరూ స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా సంబంధిత యజమానుల నుంచే వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కూల్చివేత చర్యలపై మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ స్పందిస్తూ, పట్టణ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రహదారుల ఆక్రమణల వల్ల వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతోనే ఈ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ఆక్రమణలను తొలగించుకోవాలని ఇదివరకే పలుమార్లు వ్యాపార సంస్థలకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. అయినా స్పందన లేకపోవడంతోనే అనివార్యంగా కూల్చివేతలు చేపట్టాల్సి వచ్చిందని కమిషనర్ స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు బొజ్జం కరుణ మాట్లాడుతూ, తమకు కనీసం పది నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా, సుమారు 20 వేల రూపాయల విలువైన వస్తువులను మట్టిలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులను తొలగించుకోవడానికి తగినంత సమయం ఇవ్వకుండానే యంత్రాలతో కూల్చివేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆమె వాపోయారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ హెడ్ (టీపీఎస్) కె. సుమన, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ సందీప్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డితో పాటు టౌన్ ప్లానింగ్ మరియు శానిటేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



