రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పావులు
మహిళల కోటాను లోక్సభ విస్తరణతో ముడిపెట్టడంపై విమర్శలు
ఉత్తరాదిన రాజకీయ బలం పెంచుకునే వ్యూహం : రాజకీయ విశ్లేషకులు, నిపుణులు
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర ఉద్యమం నుంచే భారత రాజకీయాల్లో మహిళలు కీలకపాత్ర పోషించినప్పటికీ.. శాసనసభలు, పార్లమెంట్ వంటి నిర్ణయాత్మక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం లోక్సభలో మహిళా సభ్యులు మొత్తం స్థానాల్లో 14 శాతమే ఉన్నారు. రాష్ట్ర శాసనసభల్లో వారి సగటు ప్రాతినిధ్యం 9 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించా లని దశాబ్దాలుగా డిమాండ్ కొనసాగుతోంది.
మహిళా రిజర్వేషన్ అంశం ఈనాటిదే కాదు. 1996లో తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినా.. రాజకీయ పార్టీల ప్రతిఘటనతో అది అమలు కాలేదు. చివరకు 2023లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ (106వ రాజ్యాంగ సవరణ చట్టం) ఆమోదం పొందింది. అయితే ఈ చట్టాన్ని తదుపరి జనగణన, అనంతరం జరిగే డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే అమలు చేయాలని నిబంధన విధించడంతో మహిళా రిజర్వేషన్లు ఇంకా అమల్లోకి రాలేదు.
రిజర్వేషన్ను షరతులతో ముడిపెట్టడం సరికాదు
ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు ఈ షరతులను అనవసరమని విమర్శించాయి. మహిళల సాధికారతను ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టడం వల్ల అమలు నిరవధికంగా వాయిదా పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాయి. అయితే ప్రభుత్వం జనగణన పూర్తయ్యాక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఈ ఏడాది ఏప్రిల్లో మూడు బిల్లులు
ఈ ఏడాది ఏప్రిల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించిన కేంద్రం.. మహిళల రిజర్వేషన్ల అమలుకు అనుసంధానంగా మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్సభ స్థానాలను 543 నుంచి 816కు పెంచాలని భావించారు. అనంతరం కొత్త డీలిమిటేషన్ నిర్వహించి, అందులో మూడో వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోవడంతో అది వీగిపోయింది. బిల్లుకు 298 ఓట్లు మాత్రమే లభించగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ప్రభుత్వం మిగతా రెండు బిల్లులను కూడా ఉపసంహరించుకుంది.
టార్గెట్ డీలిమిటేషన్?
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్లను ఒక ఆయుధంగా వాడుకుంటోంది. అసలు మహిళా రిజర్వేషన్ అనేది ప్రభుత్వం అసలు లక్ష్యం కాదనీ, డీలిమిటేషన్ ప్రక్రియను ముందుగానే ప్రారంభించడానికి ఈ బిల్లులను తీసుకొచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్నికల రాజకీయ సమీకరణాలను మార్చే ప్రయత్నంగా రాజకీయ పరిశీలకులు దీనిని విశ్లేషిస్తున్నారు.
‘మహిళా రిజర్వేషన్లు ఆలస్యం చేయొద్దు’
బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం లెక్కలు వేసుకుంటూ మహిళా రిజర్వేషన్లను అటకెక్కిస్తుందేమోనన్న భయం, ఆందోళన మహిళ సంఘాలు, ప్రజాస్వామికవాదుల్లో నెలకొంది. మహిళలకు శాసనసభలు, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించడం ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ప్రజాస్వామ్య సంస్కరణగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాటిని లోక్సభ విస్తరణ, డీలిమిటేషన్ వంటి వివాదాస్పద రాజ్యాంగ మార్పులతో ముడిపెట్టకుండా ప్రత్యేకంగా అమలు చేయాలని వారు సూచిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు లోక్సభ స్థానాల కేటాయింపును ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. కుటుంబ నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ విధానం అమల్లో ఉంది. కానీ తాజా డీలిమిటేషన్ జరిగితే అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు లభించే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవచ్చనీ, సమాఖ్య వ్యవస్థలో బలసమీకరణాలు మారి, సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
బీజేపీకి ప్రయోజనం
వాస్తవానికి బీజేపీకి దక్షిణాదిన పట్టు లేదు. తెలంగాణ, కేరళ, తమిళనాడు,
కర్నాటకలలో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. ఇక కాషాయపార్టీకి ఉత్తరాది
మీదనే ఆశలు ఉన్నాయి. వచ్చే ఏడాది మినీ జనరల్ ఎలక్షన్స్గా భావించే యూపీ ఎన్నికలు, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు పొలిటికల్ గేమ్ ఆడుతోంది. లోక్సభ స్థానాల విస్తరణ, జనాభా ప్రాతిపదికన కొత్త సీట్ల కేటాయింపు వల్ల ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో బలమైన రాజకీయ ఆధారం ఉన్న బీజేపీకి దీని ద్వారా దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం కలగవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రిజర్వేషన్ల కంటే డీలిమిటేషన్కే ప్రాధాన్యం
- Advertisement -
- Advertisement -



