Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయం‘టీఆర్ఎస్’ పేరు పెట్టుకుంటామంటే ఒప్పుకోం

‘టీఆర్ఎస్’ పేరు పెట్టుకుంటామంటే ఒప్పుకోం

- Advertisement -

అధికారం కోల్పోవడంలో మా తప్పులు ఉన్నాయి
2027లో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తా
వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ
తెలంగాణలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు : ​ కేటీఆర్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎవరైనా ‘టీఆర్ఎస్’ పార్టీ పేరు పెట్టుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక‌రామారావు అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు తెలిపి ఉండవచ్చన్నారు. తానైనా, ఇంకెవరైనా పార్టీ కంటే పెద్ద కాదని, పార్టీయే సుప్రీం అని తెలిపారు. బుధవారం ఎంపీ వద్ది రాజు నివాసంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్ అంటే 22 ఏండ్ల ఒక ప్రస్థానం. అలాంటి పేరును వేరే ఎవరైనా సొంతం చేసుకోవాలంటే… పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఖచ్చితంగా అభ్యంతరం తెలుపుతారు. 2022లో పార్టీ పేరు మార్చుకున్నాక… ఆరేండ్లు టీఆర్ఎస్ పేరును కేంద్ర ఎన్నికల సంఘం సీజ్ చేసింది. ఈ పేరు కావాలంటే ఎన్నికల సంఘం అభ్యంతరాలు కోరుతుంది. అందుకు మా వాళ్లు స్పందిస్తారు’ అని కవిత పార్టీ పేరుకు సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ నుంచి విభేదించి కొందరు పోయారని, ఎవరి ఎజెండాలు, రాజకీయాలు వాళ్లవని అన్నారు. ఇష్టం లేక పార్టీ నుంచి పోయిన వాళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి100 శాతం మా తప్పులే కారణం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి 100 శాతం మా తప్పులే ఉన్నాయని కేటీఆర్ అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనీ, సరిదిద్దుకుంటామని తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను ప్రజలను నమ్మారన్నారు. అయితే అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన పాలనను ప్రజలు ప్రస్తుతం గమనిస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో కేవలం 1.8 శాతం ఓట్లు, దాదాపు 4 లక్షల ఓట్లతో తేడాతో తాము ఓడిపోయామన్నారు. అయితే 2018 తో పోల్చితే బీఆర్ఎస్ గ్రాఫ్ 10 శాతం తగ్గిందని ఒప్పుకున్నారు. తెలంగాణలో కుల రాజకీయాలకు తావు లేదని, ఆ పరిస్థితి ఎప్పటికీ రాదన్నారు. మళ్లీ ఎన్నికల సమయానికి ఏదో మ్యాజిక్ చేసి అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారనీ, కానీ కాంగ్రెస్ కు ఓటమి తప్ప మరేమి మిగలదన్నారు.

బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిస్థితే
15 ఏండ్ల మోడీ సుదీర్ఘ పాలనపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే మోడీ నేతృత్వంలోని బీజేపి ఓడిపోయిందని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సహకారంతో సంకీర్ణం ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిస్థితే వస్తుందని, కనీసం ఆపార్టీకి డిపాజిట్ సైతం దక్కదన్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంటుందని చెప్పారు.

మెట్రో విస్తరణ పేరిట డ్రామాలు
బీఆర్ఎస్ హయాంలోనే రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తి చేశామని కేటీఆర్ చెప్పారు. దాదాపు 33 కి.మీటర్ల ఈ లైన్‌ను 24 నెలల్లో పూర్తి చేసేందుకు ఎల్ అండ్ టీ టెండర్లు దక్కించుకుందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటే ఇప్పటికే ఎయిర్ పోర్ట్ కు మెట్రో పరుగులు పెట్టేదన్నారు. కానీ అధికారంలోకి రాగానే ఈ టెండర్లు రద్దు చేసిన రేవంత్‌రెడ్డి, ప్రస్తుతం 28 నెలల తర్వాత మళ్లీ మెట్రో విస్తరణ పేరిట డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో ఫేజ్-1కు సంబంధించి ఎల్ అండ్ టీ ప్రయివేటు సంస్థ రూ. 14 వేల కోట్లను అప్పులను రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలపై మోపారన్నారు. అసలు ఎవరు ఆదేశాలిస్తే ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో లాక్, అన్ లాక్ డీల్స్
రాష్ట్రంలో లాక్, అన్ లాక్ డీల్స్ నడుస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటిపై మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. తమ హయాంలో కేవలం 16 లక్షల నిషేధిత భూమి ఉంటే ప్రస్తుతం కోటి ఎకరాలకు చేరిందన్నారు. ల్యాండ్ పంచాయితీ ఉంటే చాలని, దాన్ని నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అన్లాక్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఈ భూముల వివాదాలను అన్లాక్ చేసేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా 30 శాతం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో సీట్లు పెరగడం ఖాయం
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమని, అది డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా సీట్లు పెరగాల్సిందేనని కేటీఆర్‌ అన్నారు. అయితే ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 24శాతం వాటా తగ్గకుంటేనే పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు.

ఎన్‌డీఎస్‌ఏతో బీజేపీ కుట్ర
2023 ఎన్నికల టైంలో నేషనల్ డ్యాం సేఫ్టి అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సంస్థ పేరుతో బీజేపీ కుట్ర చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం కూలిందని రాహుల్ గాంధీ చెప్పగానే 48 గంటల్లో ఎలాంటి పరీక్షలు చేయకుండా ఆ సంస్థ అబద్ధపు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అది నిజానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని ఆరోపించారు.

నీళ్లివ్వమంటే రక్తం చల్లుకోమంటారా…?
పోలలాకు నీళ్లివ్వమంటే..‘పొలాల్లో రక్తం చల్లుకోండి’ అని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా రక్తం, హిట్లర్ వంటి మాటలు ఏంటన్నారు. నరహంతకుడైన హిట్లరే నాకు ఆదర్శమని బహిరంగంగా చెప్పడం, హైడ్రా పేరుతో నిర్భాగ్యుల ఇండ్లు కూల్చేసి.. దాన్ని ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితులతో పోల్చుకోవడం హేయమైందన్నారు.

2027లో పాదయాత్ర చేస్తా…
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ విజయాలపై త్వరలో పాదయాత్ర చేస్తానన్నారు. 2027 నుంచి ఈ యాత్రను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. దీనిపై కేసీఆర్‌తో చర్చించాక ముందుకెళ్తానన్నారు. స్వామ్యంలో పీపుల్ పవర్ ఫుల్ అని… మహిళల రక్షణ విషయంలో ఎవరు తప్పు చేసినా పోరాడుతానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -