కేంద్రంతో చర్చలేకుండా దీక్ష విరవించను..
నేడు సామూహిక నిరాహార దీక్ష
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ అవకతవకలు వంటి విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, ఆందోళనలో లేవనెత్తిన డిమాండ్లను పట్టించుకునేందుకు ముందుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తుంది. ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు, విద్యావేత్తలు , 1,800 మందికి పైగా పౌరుల విజ్ఞప్తులను పక్కనపెట్టి, ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతూ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించడానికి నిరాకరించారు. ఆయన మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ చాలా బలహీనంగా ఉన్నారని, ఆయనను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నామని వైద్య బృందం తెలిపింది. వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా, సీజేపీ గురువారం సామూహిక నిరాహార దీక్షను ప్రకటించింది. ఎస్ఎఫ్ఐ కూడా గురువారం నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించింది. దీక్ష ప్రారంభించి నప్పటి నుంచి వాంగ్‌చుక్ బరువు సుమారు తొమ్మిది కిలోలు తగ్గింది. వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించిన కొందరు విద్యార్థి నేతలను ఆసుపత్రికి తరలించారు.
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న శాంతియుత ఆందోళనను భగ్నం చేయడానికి సంఘ్ పరివార్ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆందోళనను దేశద్రోహంగా చిత్రీకరించేందుకు సంఘ్‌పరివార్ గూండాలను జంతర్ మంతర్‌కు పంపుతున్నారని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంగ అన్నారు. 25వ రోజు కొనసాగిన ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు బుధవారం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. స్టాండప్ హాస్యనటుడు, రాజకీయ వ్యంగ్య రచయిత కునాల్ కమ్రా, కాంగ్రెస్ ఎంపీ ప్రశాంత్ పడోలే, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ రాశారు.
సోనమ్ వాంగ్‌చుక్ కు అందించిన
వైద్య సహాయం, తీసుకున్న చర్యలేంటీ?
కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం, కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆయనకు ఇప్పటివరకు అందించిన వైద్య సహాయం, తీసుకున్న చర్యలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, ఇప్పటికే సుమారు తొమ్మిది కిలోల బరువు తగ్గారని, పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని పిల్ దాఖలైంది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించి చికిత్స అందించాలని, అవసరమైతే ద్రవాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించిన హైకోర్టు, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆయనకు తక్షణ వైద్య సాయం అందించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై కూడా వివరణ కోరింది. విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమానికి మద్దతుగా వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమం
- Advertisement -
- Advertisement -



