Thursday, July 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీ పాలిత రాష్ర్టాల్లో ‘ఉపాధి’కరువు

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ‘ఉపాధి’కరువు

- Advertisement -

దక్షిణాదికి పెరుగుతున్న వలసలు
రూ. ఏడెనిమిది వేల జీతాల కోసం గొడ్డు చాకిరీ
ఇరుకు షెడ్లల్లో దుర్భర జీవితాలు
ఏజెన్సీల ఉచ్చులో విలవిల కార్మిక చట్టాలకు తూట్లు

-ఎస్‌.వెంకన్న
‘డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్‌ ఉంటే..అభివృద్ధి వేగంగా జరుగుతుంది’ అని కేంద్ర బీజేపీ పెద్దలు పదేపదే ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. కానీ..వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్ర్రాల్లో ( డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్లు) ఉపాధి దొరకటం కష్టంగా మారింది. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకుని బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, పాశమైలారం పారిశ్రామిక ప్రాంత్లాలోని ఏజన్సీల ద్వారా వేలాది మంది వలస కార్మికులు ఇక్కడకు వస్తున్నారు. అంతేకాదు.. బొల్లారం, కాజిపల్లి, బొంతపల్లి, హత్నూర్‌, కొండాపూర్‌, సదాశివపేట, జహీరాబాద్‌‌లతో పాటు ఆ జిల్లావ్యాప్తంగా లక్షలాది మంది వలస కార్మికులు పని కోసం బారులు తీరుతున్నారు. ఆయా రాష్ట్రాలు వలసల ఉత్పత్తి కేంద్రాలుగా మారటంతో దక్షిణాది రాష్ట్రాలకు వలస కార్మికులు వస్తున్నారనేది వాస్తవం. ఆ కార్మికుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయనే దానికి.. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి బతుకు చిత్రాలే ప్రత్యక్ష సాక్ష్యం.

​ఇరుకు షెడ్లు..
వలసొచ్చిన కార్మికులు ఆయా పరిశ్రమల ఆవరణలో మూత్ర శాలల పక్కన ఏర్పాటు చేసిన ఇరుకు షెడ్లల్లో నివాసముంటున్నారు. ఒక్కో షెడ్‌‌లో దాదాపు ఎనిమిది నుంచి 12మంది వరకు ఉంటున్నారు. ఇలా వరసగా రెండూ మూడు షెడ్లు. వాటిలో అట్టపెట్టెల షీట్లను పడక దుప్పట్లుగా వాడుతున్నారు. ఆ షెడ్లకు ఒకటి, రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయి. తగిన నీటి సౌకర్యం లేదు. దీంతో షిప్టుల వారీగా మూత్రశాలలను, స్నానపు గదులను వినియోగించు కుంటున్నారు. ఇంత దుర్భర జీవితాన్ని భరిస్తూ వారు రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేస్తే వారికిచ్చే వేతనం రూ. 9వేల నుంచి 14 వేలు మాత్రమే.

వ్యాపారంగా మారిన కూలీల తరలింపు
‌పాశమైలారం ప్రాంతం పరిశ్రమలకు పెట్టింది పేరు. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలే కాకుండా ఇతర వాణిజ్యపరమైన వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. పరిశ్రమలు నేరుగా కార్మికులను తమ సంస్థలో చేర్చుకోకుండా కాంట్రాక్టర్ల ద్వారా పనుల్లో పెట్టుకునే విధానానికి అలవాటుపడ్డాయి. దాంతో ఇక్కడ ఉన్న కంపెనీల్లో లక్షలాది మంది కార్మికులు వివిధ స్థాయిల్లో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా వీరిని అన్‌స్కిల్డ్‌ (ఎలాంటి నైపుణ్యంలేని వారు లేబర్‌ కేటగిరీ), స్కిల్డ్‌(నైపుణ్యత కలిగిన), సెమీస్కిల్డ్‌(కొద్దిపాటి నైపుణ్యత గలవారు), హెవీస్కిల్డ్‌(పూర్తి నైపుణ్యత గలవారు) కార్మికులుగా విభజించి పనుల్లో పెట్టుకుంటారు. కాగా, అన్‌స్కిల్డ్‌, స్కిల్డ్‌ కార్మికులను కాంట్రాక్టు పద్ధతిలో పనుల్లో పెట్టుకుని మిగతా రెండు రకాల కార్మికులను నేరుగా పరిశ్రమలు భర్తీ చేసుకుంటున్నాయి. దాదాపు 60 వేల మంది అన్‌స్కిల్డ్‌ కార్మికులను ఇక్కడి పరిశ్రమలు కాంట్రాక్టు పద్ధతిలో పనుల్లో పెట్టుకుంటున్నాయి. దాంతో వారికి డిమాండ్‌ పెరగడంతో సమకూర్చే సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిసి నిరుపేదల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి.

ప్రశ్నార్థకంగా సంక్షేమం
కాంట్రాక్టు పద్ధతిలో పనుల్లో చేరే కార్మికుల సంక్షేమం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. కాంట్రాక్టు లైసెన్స్‌ పొందిన సంస్థలు ప్రతీనెలా కార్మికుల సంక్షేమం కోసం కల్పించిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులు చెల్లిస్తున్నాయా? లేదా? అనే విషయాల గురించి పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనుల్లో చేరే కార్మికుల సంక్షేమం బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లపైనే ఉండాలి. అలాగే ప్రతీనెలా వేతనం సక్రమంగా చెల్లించటంతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను కూడా కాంట్రాక్టరు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ పరిశ్రమల్లో ఉన్న కొందరు కాంట్రాక్టర్లు కార్మికులకు నెలవారీగా చాలీచాలని వేతనంతోనే సరిపెడుతున్నారు. పరిశ్రమల్లో కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులను పెట్టుకునే సంస్థల్లో చాలా వాటికి కార్మికశాఖ అనుమతులు కూడా ఉండకపోవటం గమనార్హం. ఉన్నవారు లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయిం‌చుకోకుండా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఒక పరిశ్రమలో కాంట్రాక్టు లేబర్లను పెట్టుకోదలచినవారు సంబంధిత శాఖతో అనుమతి పొందాల్సి ఉంటుంది. కార్మికశాఖ అనుమతి పొందిన సంస్థలు ఎంతమంది కార్మికులను సమకూర్చగలరన్న విషయాన్ని ముందుగా తెలపాల్సి ఉంటుంది. 50మందికి అనుమతి పొంది ఉంటే.. అంతమందినే పనుల్లో పెట్టుకోవాలి. కాగా, ఇక్కడి పరిశ్రమల్లో 50మందికి అనుమతి పొంది ఉన్న సంస్థలు 500 మంది కార్మికులను పనుల్లో పెట్టుకోవటం గమనార్హం. కాంట్రాక్టు లైసెన్స్‌ ఉన్నవారు ఒకే పరిశ్రమలో కార్మికులను పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న కొన్ని సంస్థలు ఒకే లైసెన్స్‌పై 5 నుంచి 6 పరిశ్రమల్లో కార్మికులను పనిలో పెట్టుకుంటున్నాయి. సంబంధిత శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా నెలనెలా మామూళ్లకు అలవాటుపడి కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్థానికేతరులే ఎక్కువ..
పరిశ్రమల్లో లేబర్‌ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్లో చాలామంది స్థానికేతరులు బీహార్‌, ఒడిషా, రాజస్తాన్‌, పశ్చిమబెంగాల్‌, యూపీ తదితర రాష్ట్రాలకు చెందినవారే. అంతేకాకుండా ఏపీలోని శ్రీకాకుళం, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందినవారూ ఉన్నారు. ఇక్కడ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాల నుంచి 8 గంటల పనికిగాను ఒక్కో కార్మికుడు రోజువారీగా రూ.500-600 తీసుకుంటున్నారు. కార్మికులకు మాత్రం రూ.300-400 వరకు చెల్లిస్తున్నారు. దీనికితోడు 8 గంటలకు బదులుగా రెండు గంటలు అదనంగా పని చేయించుకుని, ఆ శ్రమకు వేతనం ఇవ్వటం లేదు. పరిమితికి మించి కార్మికులను పరిశ్రమల్లో పెట్టుకుని వారి కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్న పరిశ్రమలు, లేబర్‌ కాంట్రాక్టు సంస్థల గురించి పట్టించుకోవాల్సిన కార్మిక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించటమే ఇందుకు కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కార్మిక శాఖ అధికారుల వైఫల్యం
​ లేబర్‌ కాంట్రాక్టర్ల పనితీరును పర్యవేక్షించాల్సిన సంబంధిత కార్మికశాఖ అధికారుల వైఫల్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జీవో నెంబర్‌ 6 ప్రకారం అన్‌స్కిల్డ్‌ కేటగిరీలో పనిచేసే కార్మికులకు నెలవారీ కనీస వేతనం రూ.16,000 ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వారికి కాంట్రాక్టర్లు కనీసం రూ.9వేలు కూడా చెల్లించటం లేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు సక్రమంగా కట్టకపోవటంతో ప్రమాదానికి గురైన కార్మికులకు వైద్యసేవలు అందటం లేదు. కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని పనులు చేయిస్తున్నారు.

జీవో 6ను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో 6 ప్రకారం అన్ని పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను రూ. 26వేలకు పెంచాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్‌,ఈఎల్స్‌, బోనస్‌ ‌వంటి చట్టబద్ధ సౌకర్యాలను అమలు చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన జీవోను 6ను పునపరిశీలించి శాస్ర్తీయంగా కనీస వేతనాలను అమలు చేయాలి.
​అతిమేల మాణిక్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు

పిడికెడు అన్నం కోసం..
‘పిడికెడు అన్నం కోసం కాంట్రాక్ట్‌ ‌లేబర్‌‌గా పనిచేస్తున్నా. పని చేస్తున్న దగ్గరే ఓ టిక్కి లాంటి గదిలో ఉంటున్నా. అందులో ఎనిమిది మంది ఉంటాం. బాత్రుమ్‌‌లు, నీటి సౌకర్యాలు సరిగా లేవు. వచ్చే జీతం సరిపోదు. రోగమొస్తే కష్టమే. కుటుంబాన్ని ఎట్లా సాకాలో అర్థం కావటం లేదు…’
​జయలాల్‌, కాంట్రాక్ట్‌ ‌కార్మికుడు, బీహార్‌

​​ఫాయిదా లేని బతుకు..
‘ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసినా..అవసరాలు తీరటం లేదు. ఇంటివద్ద ఉన్న కుటుంబ సభ్యులకు నెలకు రూ.ఐదు వేలు పంపించాలి. కానీ..ఒక్కో నెలా పంపించలేక పోతున్నా. ఊరుకాని ఊరొచ్చి పని చేసినా ఫాయిదా లేకుండా పోతుంది. వేతనాలు పెంచాలి. సౌకర్యాలు కల్పించాలి…’
​రాంపాల్‌ ‌యాదవ్‌, కాంట్రాక్ట్‌ ‌కార్మికుడు, ఉత్తరప్రదేశ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -