ఉత్తమ సేవలందించిన వారికి
ఆగస్టు 15న సన్మానం : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయనున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క తెలిపారు. ఉత్తమ సేవలందించే అంగన్‌వాడీ సిబ్బందికి ఆగస్టు 15న సన్మానించనున్నట్టు ఆమె చెప్పారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా అధికారులు నిరంతరం సందర్శించాలని ఆదేశించారు. నాసిరకం సరుకులు సరఫరా చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై ఆమె బుధవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, విద్య, సంరక్షణ అందిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతున్న వివిధ పథకాలను జిల్లాల వారీగా మంత్రి సమీక్షించారు. కేంద్రాలను సందర్శించాలనీ, డీడబ్ల్యూఓలు, సూపర్ వైజర్లు తరచూ అక్కడ భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. గుడ్లు, పప్పు, పాలు, ఇతర పోషకాహార పదార్థాల ఇండెంట్, సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఒకట్రెండు కేంద్రాల్లో నాసిరకం కోడి గుడ్లు సరఫరా చేశారని పత్రికల్లో వచ్చిన కథనాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా వార్తలపై జిల్లా అధికారులు వెంటనే సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ పథకం మంచి ఫలితాలు ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల చిన్నారుల హాజరు పెరగ డంతో పాటు వారి అభ్యాస సామర్థ్యం కూడా మెరుగుపడుతోందన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ‘‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’’ కార్యక్రమం ద్వారా కేంద్రాల్లో పిల్లల సంఖ్య ఎంత మేర పెరిగిందో జిల్లాల వారీ గా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. పాలు అందించడం వంటి నూతన కార్యక్రమాల ఫలితాలను కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు.
వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



