పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన
దూరదృష్టితో పనిచేస్తున్న సీఎం : మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో బుధవారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా ప్రపంచ స్థాయి, కాలుష్యరహిత, అత్యాధునిక నగరంగా హైదరాబాద్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు, వేలాది కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారని, ఫార్చ్యూన్–500 సంస్థల పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా సుమారు 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతం ఉందని, దాన్ని 2047 నాటికి 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ లక్ష్య సాధనకు భారీ పెట్టుబడులు, అత్యాధునిక మౌలిక వసతులు, విస్తృత ఉపాధి అవకాశాలు అవసరమని తెలిపారు.
తెలంగాణ–2047 అభివృద్ధి విధానాన్ని అంతర్జాతీయ నిపుణుల సూచనలతో రూపొందించినట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం, పారదర్శక అనుమతుల వ్యవస్థ, వేగవంతమైన భూ కేటాయింపులతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పెట్టుబడిదారుల సమస్యలను ప్రతి నెలా స్వయంగా సమీక్షించి తక్షణ పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక, పర్యాటక, ఇంధన, క్రీడలు, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు సమగ్ర విధానాలను రూపొందించామన్నారు. నాణ్యమైన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుతో తెలంగాణలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం అవుతుందని, దీనివల్ల ఐటీ, సాఫ్ట్‌వేర్, అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముందస్తు ప్రణాళికతో నగరాభివృద్ధి
హైదరాబాద్‌ను కాలుష్యరహిత, సుస్థిర మహానగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ వాహనాలకు ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ కాలుష్యం, ముంబై వరదలు, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు వంటి పరిస్థితులు హైదరాబాద్ లో తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నగరాభివృద్ధి చేపడుతున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల, రీజినల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న విస్తార ప్రాంతాన్ని తయారీ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేసి, విద్యుత్, నీరు, భూమి, అనుమతులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందుబాటులో ఉంచడం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రైతులు ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల అభివృద్ధి కోసం భూములు అందించి రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న సహకారాన్ని ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. రైతులకు న్యాయమైన, మెరుగైన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ యాజమాన్యానికి, ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తూ, అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం అత్యంత వేగంగా మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా కొనసాగాలని సంస్థను కోరారు.
దూరదృష్టితో సీఎం పని చేస్తున్నారు : మంత్రి శ్రీధర్ బాబు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో పనిచేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణకు, పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి అవకాశాల కల్పనకు కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం పరిశ్ర మలకు నియంత్రణ సంస్థగా కాకుండా సహాయకునిగా వ్యవహరిస్తోందని, పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, అనుమతులు, మౌలిక సదుపాయాలు వేగంగా అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు కె.కిరణ్మయి, కె.చంద్రారెడ్డి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులు విక్రమ్, అనురాగ్, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ గోపాల్, ఎంపీడీవో బానోతు సరిత, తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడుల గమ్యస్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



