అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వచ్చిన ప్రతి వినతిని విధిగా పరిశీలించాలనీ, అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్క విద్యార్థి కూడా గురుకుల విద్యకు దూరం కాకుండా అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని డీఎస్సీ భవన్‌లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తమ పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి మంత్రి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించారు. ఒక్కొక్కరి సమస్యను ఓపికగా వింటూ వారి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువుపై ఉన్న ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాలు, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు సమీప జిల్లాల్లో సీట్లు కేటాయించాలని, ఇతర జిల్లాల్లో చదివించడం వల్ల రవాణా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవు తున్నాయని వారు మంత్రికి వివరించారు. వారి సమస్యలను విన్న మంత్రి స్పందిస్తూ, పేద కుటుంబాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు సాధ్యమైనంత మేరకు వారికి అనుకూలమైన జిల్లాల్లో సీట్లు కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) సక్రు నాయక్ కు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. సీట్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత, మానవీయ దృక్పథం, విద్యార్థుల సంక్షేమం ప్రధాన ప్రమాణాలుగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత, గిరిజన విద్యార్థుల విద్యా అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ భారీ స్థాయిలో నిధులు కేటాయించి గురుకుల విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న సమయంలో, క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను ప్రతి అధికారి తన బాధ్యతగా భావించి పని చేయాలని, ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు.
ప్రతి వినతినీ పరిశీలించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



