Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైరూ.26 కోట్లతో హైటెక్‌ ‌సిటీ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి

హైరూ.26 కోట్లతో హైటెక్‌ ‌సిటీ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి

- Advertisement -

వీడియో కాన్ఫరెన్స్‌ ‌ద్వారా రేపు ప్రారంభించనున్న ప్రధాని ‌మోడీ : దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

భారతీయ రైల్వేల్లో ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద మౌలిక సదుపాయాలను కల్పించడం, ఆధునీకరించడం, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం పునరాభివృద్ధి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగవంతం చేసింది. ఆ దిశలో తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధికి ఎంపిక చేసింది. అందులో బేగంపేట్, వరంగల్, కరీంనగర్ అనే మూడు స్టేషన్లల్లో పునరాభివృద్ధి పనులను ప్రారంభించింది. హైదరాబాద్‌‌లోని హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌ రూ.26 కోట్లతో ‌పునరాభివృద్ధి పనుల పూర్తి చేసింది. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ఈ రైల్వే స్టేషన్‌‌ను ప్రారంభించనున్నారు. బుధవారం రైల్‌ ‌నిలయయంలో సికింద్రాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కె. ముత్యాల నాయుడు, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. శివ హర్ష, సికింద్రాబాద్ డివిజన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆర్. మల్లికార్జున, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఎస్‌. వరుణ్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ‌ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి ప్రాజె‌క్టు, దాని విశిష్టతను తెలియజేసేందుకు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద భారతదేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.2000 కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగర పశ్చిమ కారిడార్‌‌లో ఉన్న హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌‌ను రూ.26 కోట్లతో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ స్టేషన్‌‌లో ప్రస్తుతం 12 మీటర్ల వెడల్పు గల పాదదారుల వంతెన, అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్రయాణీకులకు అనుకూలమైన సూచికలు, మెరుగైన స్టేషన్ ముఖభాగం,కొత్త పోర్టికో వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ప్రయాణీకులకు గానీ, రైలు సేవలకుగానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పునరాభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టినట్టు గుర్తు చేశారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి భారతీయ రైల్వేల దూరదృష్టికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక కేంద్రాలకు ప్రపంచ స్థాయి పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను అందించాలనే సంకల్పానికి మరో మైలురాయిగా నిలిచింది. విశాలమైన ప్రయాణికుల ప్రాంగణాలు, విమానాశ్రయ స్థాయిలో ఆధునిక సౌకర్యాలు, సమకాలీన శిల్పకళా వైభవం, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన స్మార్ట్ ప్రణాళికతో ఈ స్టేషన్ సరికొత్త రూపును సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఐటీ కారిడార్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణికులకు అత్యున్నత ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -