వచ్చే 20 ఏండ్ల గిడ్డంగుల అవసరాలపై అధ్యయనం చేయండి
వడ్డీ భారాలు తగ్గించుకోవాలి
ప్రభుత్వ కార్పొరేషన్లకు మంత్రి తుమ్మల సూచననవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్రాష్ట్రంలో రైతులకు గోదాముల సౌకర్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రెండేండ్లలో ప్రస్తుతమున్న సామర్థ్యానికి అదనంగా మరో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, హాకా కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో 52 సొంత గోదాములుండగా వాటి నిల్వ సామర్థ్యం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులని తెలిపారు. ప్రస్తుతం ఈ గోదాముల్లో 104 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదై 6.33 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఈజీ, ఇన్వెస్టర్ గోదాములు, అద్దె గోదాములతో కలిపి మొత్తం 524 గోదాములను ప్రస్తుతం వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 48 కొత్త గోదాముల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 32 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామనీ, వీటి ద్వారా మరో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కల్పించేలా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ప్రతి కొత్త గోదాంపైనా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని సంస్థల పరిధిలోని గోదాములన్నింటినీ ఒకే సమన్వయ వ్యవస్థ కింద నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. గోదాముల్లో ఎక్కడ ఖాళీలున్నాయో గుర్తించి వాటినే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనీ, ఇందుకోసం అన్ని కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వేర్ హౌసింగ్ సామర్థ్యం పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



