– ఉన్నతాధికారులకు కౌన్సిలర్ల వినతి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనుల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, అకౌంటెంట్ రాములు కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్లు, శాతం వారీగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఫిర్యాదులో చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అప్రమత్తత శాఖ (విజిలెన్స్) ఆరోపణలు ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు 1వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డు కౌన్సిలర్ తాటి లావణ్య ప్రసాద్, 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షితలు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అప్రమత్తత, అమలు విభాగం డైరెక్టర్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)లకు ఫిర్యాదు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం, సాధారణ నిధులు, 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద చెల్లించిన బిల్లులపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత బిల్లుల చెల్లింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ పార్వతాలు, అకౌంటెంట్ రాములు వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.



