సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఆఫీస్‌లో మృతదేహానికి నివాళులర్పించిన నేతలు
గాంధీ మెడికల్ కాలేజీకి డెడ్‌బాడీ అప్పగింత
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మికోద్యమ నిర్మాణానికి అహర్నిశలూ కృషి చేసిన ధీశాలి, నిబద్ధత కలిగిన నాయకుడు పసుపులేటి వెంకటేశ్వరరావు అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి. రాఘవులు అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు ఈనెల 13న మరణించిన విషయం తెలిసిందే. గురువారం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఆఫీస్‌లో ఉంచారు. అక్కడ బివి. రాఘవులు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, నాయకులు ఆశాలత, ఇతర నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. 1994లో తాను హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి వెంకటేశ్వరరావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. చివరి శ్వాస వరకు ఉద్యమ పురోభివృద్ధి కోసమే తపించిన గొప్ప నాయకుడన్నారు.పసుపులేటి వెంకటేశ్వరరావుతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అన్నారు. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఉద్యమంలో ఎదగాలని ఆయన ఎంతో ఆకాంక్షించేవారని, వారి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారని గుర్తుచేశారు. చివరి వరకు పార్టీ గురించి, కార్యకర్తల యోగక్షేమాల గురించి వాకబు చేసేవారని, అటువంటి క్రమశిక్షణను నేటి తరం అలవర్చుకోవాలని సూచించారు.
నిర్మాణ దక్షత కలిగిన నాయకుడు
తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభం నుంచి వెంకటేశ్వరరావుతో అనుబంధం ఉందని, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని పక్కనపెట్టి కార్మికుల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సీపీఐ(ఎం) మాజీ నగర కార్యదర్శి పిఎస్.ఎన్.మూర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ట్రేడ్ యూనియన్‌ల నిర్మాణంలో, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో పసుపులేటి పాత్ర కీలకమని చెప్పారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం, ఎం.శ్రీనివాస్, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర నాయకులు అడివయ్య, పెన్షనర్స్ నాయకులు ఎంఎన్ రెడ్డి, ఐప్సో నాయకులు జి.నాగేశ్వరరావు, ఐలు నాయకులు పార్థసారథి, హెచ్‌ఏఎల్ నాయకులు బీఎన్ సుదర్శన్, ఎల్‌ఐసీ నాయకులు వేణుగోపాల్, బీహెచ్‌ఈఎల్ నాయకులు కృష్ణారావు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు సాంబిరెడ్డి, బుచ్చిరెడ్డి, సీఐటీయూ సీనియర్ నాయకులు రాజారావు, యూటీఎఫ్ నాయకులు, పసుపులేటి కుటుంబ సభ్యులు, కూతుళ్లు, అల్లుళ్లు బివి రాఘవయ్య, ఏ.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు.
వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
పసుపులేటి వెంకటేశ్వరరావు ఆశయాలను కొనసాగిస్తూ వర్గ పోరాటాలను ఉధృతం చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. వెంకటేశ్వరరావు అత్యంత అరుదైన వ్యక్తి అని, హైదరాబాద్‌లో తాను ఎస్‌ఎఫ్‌ఐ బాధ్యతల్లో ఉన్నప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు. కార్మిక, వ్యవసాయ కూలీల ఐక్యత కోసం నిరంతరం కృషి చేశారని, వ్యవసాయ కూలీల పోరాటాలకు ఆర్థిక సహకారాన్ని అందించారని కొనియాడారు.



