Friday, July 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసీతారామను పూర్తి చేస్తాం

సీతారామను పూర్తి చేస్తాం

- Advertisement -

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్టు బీఆర్‌ఎస్ నేతల డ్రామాలు : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


నవతెలంగాణ – సత్తుపల్లి
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను సరిదిద్ది సీతారామ ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంటకు వచ్చిన ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి యాతాలకుంట సొరంగ కాలువ మార్గాన్ని (టన్నెల్) పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ జూలూరుపాడు టన్నెల్‌ను త్వరితగతిన పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి ప్రజాధనానికి నష్టం కలిగించారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇందిరమ్మ సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రూపొందించారని, వాటిని పక్కనపెట్టి సీతారామ ప్రాజెక్టును చేపట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ.135 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామనీ, అవసరమైన బిల్లులను సిద్ధం చేసి వెంటనే పంపాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు తెలిపారు.

లక్ష‍లాది ఎకరాలకు సాగునీరందించినట్టు ప్రచారం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించినట్టు బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల గోదావరి జలాల అనుమతులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. గత ప్రభుత్వం సాయిల్ టెస్ట్‌లు నిర్వహిం చకుండా నిర్మాణాలు చేపట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ సమస్యలు తలెత్తాయన్నారు. మిగిలిన బ్యారేజీల భద్రతపై కూడా నిపుణుల సూచనలు ఉన్నాయనీ, ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబం ధించిన భూసేకరణలో ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం వేగంగా పరిహారం చెల్లింపులు చేస్తామని, అధికారులు ఈ అంశాన్ని ప్రాధాన్యం గా తీసుకోవాలని సూచించారు.

కరువు పరిస్థితుల్లోనూ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు : మంత్రి పొంగులేటి
కరువు పరిస్థితుల్లోనూ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన అన్ని నీటిపారుదల పనులను నిజాయితీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జునసాగర్, వైరా–లంకసాగర్ ప్రాజెక్టులు, ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా సాధ్యమైనంత మేరకు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రారంభించిన ప్రాజెక్టులను డిజైన్ మార్పుల పేరుతో ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, సత్తుపల్లి, కల్లూరు ఏఎంసీ చైర్మెన్లు దోమ ఆనంద్ బాబు, బాగం నీరజదేవి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం సుడా చైర్మెన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎ‌న్పీడీసీఎల్ డైరెక్టర్ వి. మోహన్ రావు, ఇరిగేషన్ సీఈలు శ్రీనివాస రెడ్డి, ఎం. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీఎస్ఈ యుగంధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -