Friday, July 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅభివృద్ధి ముసుగులో భూదోపిడీ

అభివృద్ధి ముసుగులో భూదోపిడీ

- Advertisement -

​భూమి హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమాలు : ​భూమి అధికార్ ఆందోళన్ నేతల పిలుపు
​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములను దోచిపెడుతోందని భూమి అధి కార్ ఆందోళన్ (బీఏఏ) నేతలు విమర్శించారు. భూ సేకరణ పేరుతో జరుగుతున్న ప్రభుత్వ భూకబ్జాలను ప్రతిఘ టించాలనీ, భూమి హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమా లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం నాడిక్కడ ఏఐకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో భూమి అధికార్ ఆందోళన్ అఖిల భారత నాయకత్వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, అటవీ హక్కులపై ఆధారపడిన ప్రజలు, మత్స్య కారులు, గ్రామీణ పేదల భూమి హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సాగిస్తున్న దాడులను సమావేశం తీవ్రంగా ఖండిం చింది. అభివృద్ధి, పారిశ్రా మికీకరణ, మౌలిక వసతుల నిర్మాణం పేరుతో జరుగుతున్న భూ సేకరణ వాస్తవానికి ప్రభుత్వాల భూకబ్జా విధానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లక్షల ఎకరాల భూములను అప్పగిస్తోందనీ, అందుకోసం ప్రజలను బలవంతంగా వారి భూముల నుంచి తరిమివేసే విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేస్తున్నాయని పేర్కొంది.

​ప్రధాని నరేంద్ర మోడీ అండతో గుజరాత్‌లో లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు కేటాయిస్తున్నారని, ఇదే విధానం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, కర్నాటక, అసోం, తదితర రాష్ట్రాల్లోనూ అమలు అవుతోందని తెలిపింది. ఈ భూ సేకరణలు 2013 భూ సేకరణ చట్టం, న్యాయమైన పరిహారం, పారదర్శకత, పునరావాస హక్కుల చట్టం స్ఫూర్తికి, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం, గ్రామసభల నిర్ణయాధికారాన్ని పూర్తిగా పక్కనబెట్టి గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించింది. గిరిజనుల భూములు, అడవులు, జీవనాధారాలపై జరుగుతున్న ఈ దాడులు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని చెప్పింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ ప్రజల హక్కులను కాలరాస్తోందని విమర్శించింది. అలాగే గ్రేట్ నికోబార్ దీవిలో పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యం, స్థానిక ఆదివాసీ సమాజాల ఉనికిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ భారీ ప్రాజెక్టులను బలవంతంగా అమలు చేయడం అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ​ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని భూమి అధికార్ ఆందోళన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపింది. భూమి, అడవి, నీటి వనరులు ప్రజల హక్కులనీ, వాటిని కార్పొరేట్ లాభాల కోసం బలిపెట్టే కుట్రలను ప్రజా ఉద్యమాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృత ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రాల వారీగా విస్తృత పర్యటనలు నిర్వహించడం, భూ సమస్యలపై ప్రజలను చైతన్యపరచడం, జిల్లా, రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, దళిత, మహిళా, యువజన, ప్రజాస్వామ్య, సామాజిక ఉద్యమాలను ఐక్యం చేస్తూ దేశవ్యాప్త పోరాటాలను నిర్మించాలని నిర్ణయించింది.ఆగస్టు 2న జాతీయ విస్తృత సమావేశం నిర్వహించి దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని తెలిపింది. అలాగే భూమి హక్కుల పరిరక్షణ కోసం సదస్సు నిర్వహించి, కార్పొరేట్ అనుకూల భూ విధానాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన దేశవ్యాప్త పోరాటాలను చేపట్టాలని పిలుపునిచ్చింది.

భూమి ప్రజల హక్కు – కార్పొరేట్ల ఆస్తి కాదు
​తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాలక వర్గాల మద్దతుతో కొందరు వ్యక్తులు 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆందోళనకరమైన పరిణామమని భూమి అధికార్ ఆందోళన్ సమావేశం పేర్కొంది. షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల భూమి హక్కులను రక్షించేందుకు ఉద్దేశించిన 1/70 చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రూపొందించిన కీలక రక్షణ చట్టమని స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని బలహీనపరిచే లేదా రద్దు చేసే ఏ ప్రయత్నాన్నైనా భూమి అధికార్ ఆందోళన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులు, షెడ్యూల్ ప్రాంతాల చట్టాలు, 1/70 చట్టాన్ని దృఢంగా సమర్థిస్తూ నిలబడాలని డిమాండ్ చేసింది. అలాగే 1/70 చట్ట పరిరక్షణ కోసం ఆదివాసీ ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమాలకు తన సంపూర్ణ సంఘీభావం, మద్దతును ప్రకటించింది. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఈ పోరాటానికి అండగా నిలవాలని, భూ కబ్జాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిం చాలని పిలుపునిచ్చింది ఈ సమావేశంలో హన్నన్ మొల్లా, అశోక్ ధావలే, కృష్ణప్రసాద్ (ఏఐకేఎస్‌), బి. వెంకట్ (ఎఐఏడబ్ల్యూయూ), సివిల్ సొసైటీ నుంచి శ్వేత, సంజీవ్, దశం, ఏఐకేఎస్‌ నుంచి కె.డి. సింగ్, ఏఐకేకేఎంఎస్ నుంచి సత్యవాన్, వన్ శ్రమజీవి సంస్థ నుంచి రోమా చౌదరి, త్యాగి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -