Friday, July 17, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగ సవరణకు యత్నం సఫలం కాదు

రాజ్యాంగ సవరణకు యత్నం సఫలం కాదు

- Advertisement -

డీఎంకే, ఆప్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు
వర్షాకాల పార్లమెంటు సమావేశాలపై కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంటులో అవినీతికరమైన పద్దతిలో 2/3వ వంతు మెజారిటీని సాధించేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. భారత రాజ్యాంగాన్ని అవమానించేలా మోడి చేస్తోన్న ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో సఫలం కాదని పేర్కొంది. ఇందుకోసం డిఎంకె, ఆప్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. గురువారం నాడిక్కడ పార్లమెంటరీ పార్టీ చై ర్‌పర్సన్(సీపీసీ) సోనియా గాంధీ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ ఎంపీలు హాజరయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈభేటిలో… వర్షాకాల సమావేశంలో కేంద్రం తెచ్చే బిల్లులు, దేశంలోని ఆందోళనకర పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా 131 రాజ్యాంగ సవరణ, అయోధ్య చందాల చోరీ, ఇథనాలతో దేశ వ్యాప్తంగా లక్షలాది వాహనదారులు ఇబ్బందులు, ఇతర అంశాలపై సుదీర్గంగా చర్చించారు.

అనంతరం ఈ సమావేశ వివరాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, ఎంపీ డాక్టర్ నసీర్ హుస్సేన్ లు మీడియాకు వెల్లడించారు. 19 రోజులపాటు సాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురానున్న అన్ని ముఖ్యమైన అంశాలు, చట్టాలపై వ్యూహాత్మక బృందం చర్చించిందని తెలిపారు. ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడితే, దానిని పూర్తి శక్తితో వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి పార్టీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఏ ప్రతిపాదననైనా వ్యతిరేకిస్తుందన్నారు. రాజకీయ పార్టీలను చీల్చడం ద్వారా, ఇతర మార్గాల ద్వారా లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జైరామ్ రమేష్ ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ దీనిని వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు.

ప్రతిపక్ష పార్టీలతో రాహుల్, ఖర్గే చర్చలు
ఏప్రిల్ 17న లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు ఘోరంగా వీగిపోయిన తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దానిని మరోసారి తీసుకురావడానికి ప్రయత్నిస్తారని విమర్శిం చారు. డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిం చిందని, ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని ఆయన పునరుద్ఘా టించారు. అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో సహా అత్యున్నత స్థాయి కాంగ్రెస్ నాయకులు… డిఎంకె, ఆప్ సహా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైరామ్ రమేష్ తెలిపారు. మూడింట రెండు వంతుల మెజారిటీ మార్కుకు ప్రభుత్వం ఇంకా చాలా దూరంలో ఉందన్నారు. లోక్‌సభలో ఆ స్థాయికి చేరుకునే అవకాశం లేదని తాము నమ్మకంతో ఉన్నామన్నారు. ప్రభుత్వం టీఎంసీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీలను చీల్చిందని, ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. పార్టీ మారిన టీఎంసీ సభ్యులు ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో చేరడాన్ని స్వాగతించడం లేదన్నారు. కేవలం మూడేండ్ల క్రితం ఏర్పడిన, ఇంకా గుర్తింపు కూడా పొందని ఆ పార్టీ అకస్మాత్తుగా ఎన్డీఏలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా మారిందన్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీని మూడో స్థానానికి నెట్టివేసిందని ఆయన ఎత్తిచూపారు. “పార్టీ మారిన ఎంపీలకు ఆ పార్టీని హోం మంత్రి ఒక ‘పార్కింగ్ స్థలం’లా వాడుకున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) నియోజక వర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతిస్తుందన్న వార్తలను ఆపార్టీ ఎంపి సుప్రియా సూలే ఇప్పటికే వివరంగా ఖండిం చారన్నారు. గందరగోళం సృష్టించడానికి ప్రభుత్వం ఇలాంటి కథనాలను కావాలనే ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.

చందాల చోరీ– విశ్వాస ద్రోహం
వర్షాకాల సమావేశాల్లో రామమందిర విరాళాల చోరీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుందని జైరాం రమేష్ చెప్పారు. “చందా చోరీ, ఆస్థా ధోఖా” (విరాళాల చోరీ, విశ్వాసానికి ద్రోహం) అనే అంశాలను ప్రస్తావిస్తాం. అలాగే దేశంలో విద్యా, పరీక్షల వ్యవస్థ కుప్పకూలిన అంశాన్ని సభ ద్వారా ప్రజలకు వివరిస్తాం. రాహుల్ గాంధీ ఇప్పటికే ‘ఛాత్రోన్ కి గూంజ్’ (విద్యార్థుల గళం) ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిపై నేడు(శుక్రవారం) డెహ్రాడూన్‌లో జరుగుతుంది’ అని తెలిపారు.

బిల్లుల గురించి సమాచారం ఇవ్వలేదు
వర్షాకాల సమావేశాల్లో ఏ బిల్లులను ప్రవేశపెట్టనున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదని జైరామ్ రమేష్ అన్నారు. అందువల్ల, ప్రవేశపెట్టే అవకాశం ఉన్న బిల్లులపై వివరంగా చర్చించడం జరిగింది. జులై 19న జరగనున్న అఖిలపక్ష సమావేశంలో ఈ విషయమై ప్రభుత్వం నుంచి సమాచారం కోరనున్నట్లు ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ… కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రధాన్ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న కీలక బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలు, ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’, ఎఫ్‌సీఆర్ఏ సవరణలు, జాతీయ ఆహార భద్రతా చట్టానికి ప్రతిపాదిత మార్పులను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ పై అభ్యంతరాలు
ఈ సమావేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదన, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికపై కూడా చర్చ జరిగిందన్నారు. ఈ ప్రతిపాదనను కూడా తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి పదవులకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ఏ బిల్లుకు కూడా తాము మద్దతు ఇవ్వబోమన్నారు. ఎఫ్ సిఆర్సఎ సవరణ బిల్లును, అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013కు ప్రతిపాదిత సవరణలను కూడా వ్యతిరేకించాలని ఆ పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ప్రధాన మంత్రి అన్న యోజన ఈ చట్టం కిందే నడుస్తోందని, దీనికి మార్పులు చేయడం అనుచితమని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశ ప్రక్రియ కేవలం ఒక లాంఛనప్రాయంగా మారిందని జైరామ్ రమేష్ విమర్శించారు. ‘అక్కడ చాలా మంది నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు, కానీ చివరికి కొద్దిమంది మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించడం లేదు’ అని అన్నారు.

వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం…: ఖర్గే
రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల హక్కులపై నిరంతరం దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం అనంతరం ఆయన ఎక్స్ లో స్పందించారు. ‘చందా చోరీ–ఆస్థా సే ధోకా, పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థ క్షీణత, సంస్థాగత ఆక్రమణ, రాజకీయ పార్టీల విచ్ఛిన్నం, బహుళ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, సామాన్యుల నడ్డి విరిచే ధరల పెరుగుదల, విదేశాంగ విధాన వైఫల్యాలు, వ్యూహాత్మక తప్పిదాలు, 3.5 కోట్ల వాహన యజమానులపై ఇథనాల్ మిశ్రమాన్ని బలవంతంగా రుద్దడం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తాం’ అని పేర్కొన్నారు. దేశ ప్రజల జీవితాలు, ఆకాంక్షలను ప్రభావితం చేస్తోన్న ఈ తీవ్రమైన సమస్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీసీ) సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -