ఐదు కొత్త బిల్లులు ఆమోదం కోసం జాబితా చేసిన కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను లోక్‌సభ సెక్రెట రీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ గురువారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితో ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను కూడా ఆమోదించుకునేందుకు జాబితా చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లును ఈ సమావేశాల్లో చర్చించి.. ఆమోదం తెలపనుంది. ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు’ను కూడా ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆదాయపన్ను సవరణ బిల్లు (ఆర్డినెన్స్ స్థానంలో), సుప్రీం కోర్టు (న్యాయమూర్తులు సంఖ్య) సవరణ బిల్లు (ఆర్డినెన్స్ స్థానంలో), జనన, మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాలను నివారించే (సవరణ) బిల్లు, సూక్ష్మ, చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు వంటి కొత్త బిల్లులను కూడా ఈ సమావేశాల్లో తీసుకురానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు చట్ట సవరణ చేయనుంది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేపట్టనుంది. జనన, మరణాల ఆలస్యం రిజిస్ట్రేషన్ల నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టానికి మరికొన్ని సవరణలు చేయనుంది. ఎంఎస్ఎంఈ రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆలస్యపు చెల్లింపుల పరిష్కారం కోసం సవరణలు చేయనుంది. రాష్ట్రాలు సొంతంగా ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసుకునేలా చట్ట సవరణ చేయనుంది. ఆగస్టు 13 తో ఈ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.
ఎంపీలకు సరికొత్త మార్గదర్శకాలు
వర్షాకాల సమావేశాల్లో ఎంపీల కోసం సరికొత్త మార్గదర్శకాలను లోక్‌సభ సచివాలయం జారీ చేసింది. ముఖ్యంగా సభలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు పార్లమెంటు అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా.. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలపై సచివాలయం పూర్తిస్థాయి ఆంక్షలు విధించింది. సభా రికార్డులకు భిన్నంగా రహస్యంగా చిత్రాలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం వంటి అనధికారిక చర్యలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. డిజిటల్ భద్రతా ప్రమాణాల దృష్ట్యా సభలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నూతన ఆదేశాల ప్రకారం.. సభలోకి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి ఎలాంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లనూ అనుమతించరు. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, రాజకీయ నిరసనలు చేపట్టడంపై పూర్తి నిషేధం విధించారు. అలాగే సభా సమయాన్ని, వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్లకార్డులు ప్రదర్శించడం, ఆయుధాలు తీసుకురావడం వంటి చర్యలను పూర్తిగా నిరాకరించారు. వీటితో పాటు పార్లమెంటు పరిధిలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేదా పూజలు నిర్వహించకూడదని స్పష్టం చేస్తూ, సభా మర్యాదలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఎంపిలందరూ సహకరించాలని లోక్‌సభ సచివాలయం కోరింది.
డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
ప్రధాని మోడీకి ఖర్గే లేఖ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న సవరించిన డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు పార్టీలకు వాటిని పూర్తిగా పరిశీలించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కూడా డీలిమిటేషన్ ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఖర్గే గుర్తు చేశారు. తమ అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026కు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బిల్లును సవరించి వర్షాకాల సమావేశాల్లో మళ్లీ తీసుకురానున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలు, అనుబంధ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఖర్గే కోరారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు వాటిని అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026 కూడా ఏప్రిల్‌లో లోక్‌సభలో ఆమోదం పొందలేదు. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కు పెంచనున్నారు.



