డెడ్ స్టోరేజీకి చేరువలో నీటి ప్రాజెక్టులు గోదావరి, కృష్ణమ్మ వెలవెల
27 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం
ఎల్‌నినో దెబ్బకు రాష్ర్టం అతలాకుతలం
మొలక దశలోనే మాడిపోతున్న పత్తి
ఇంకా మొదలు కాని వరి నారు పోత
ఆకాశం వైపు ఆశగా రైతన్న ఎదురుచూపు
ఎల్‌నినో దెబ్బకు గోదావరి, కృష్ణా బేసిన్‌లోని నీటి పారుదల ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. రెండు బేసిన్లలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులు డెడ్ స్టోరెజీకి దగ్గర్లో ఉన్నాయి. 2002, 2015లో ఏర్పడ్డ అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులే ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్నాయి. రైతులు సాగు నీటికి నానా తంటాలు పడుతున్నారు. వేసిన పంటలు కాపాడుకోవడానికి కొన్ని చోట్ల బిందెలతో నీళ్లు చల్లుతున్న ధైన్యమైన పరిస్థితి నెలకొంది. మరో వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే మొలక దశలో ఉన్న పత్తి పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. జులై మధ్యస్థంలో కూడా ఇంకా చాలా చోట్ల వరి నారు పోత మొదలు కాలేదు. రాష్ర్టంలోని మెజార్టీ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్ష పాతం నమోదైంది. వానల్లేకుంటే రాబోయే రోజుల్లో సాగు నీరుతో పాటు ప్రజలకు తాగు నీరు కూడా కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఊరగొండ మల్లేశం
రాష్ర్టంలోని వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అప్రమ త్తమవుతోంది. దానికోసం పంటల మార్పిడిపై విస్ర్తృత ప్రచారం చేస్తున్నది. అదే సమయంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. రాష్ర్టంలో గోదావరి బేసిన్ 52.64 శాతం, కృష్ణా బేసిన్ 46.60 శాతం, చిన్న నది పరీవాహక ప్రాంతాలు 0.76 శాతం వాటా కలిగి ఉన్నాయి. జులై 15 వరకు నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణంతో పోలిస్తే సగటున 20 శాతం తక్కువ వర్ష పాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో అయితే 30 నుంచి 40 శాత వరకు తక్కువ స్థాయిలో నమోదైంది. ఫలితంగా గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదలుకుని కడెం నారాయణ రెడ్డి, నిజాం సాగర్, మిడ్‌మానేర్, లోయర్ మానేర్, ఎల్లంపల్లి వరకు, అటు కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జున సాగర్, తుంగ భద్ర, జూరాల వరకు అన్ని ప్రధాన ప్రాజెక్టులు కనిష్ట నీటి మట్టానికి చేరుకు న్నాయి. ప్రాజెక్టుల్లో నీరు లేక, వర్షాలు కురవక వ్యవసా యాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు.
విత్తనాలు వేసి నెలరోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, ఎండల తీవ్రత కారణం గా పత్తి, మొక్కజొన్న, పెసర, పసుపు తదితర విత్తనాలు మొలక దశలోనే వాడి పోతున్నాయి. వరి నారు పోత చాలా ప్రాంతాల్లో ఇంకా మొదలే కాలేదు. సాధార ణంగా జూన్ 15 నుంచి జులై మొదటి వారంలో నార్లు పోసి, జులై చివరి వారం నుంచి ఆగస్టు చివరి వరకు నాట్లు పూర్తి చేస్తారు. ఈ సారి వర్షాలు కురవక పోవడంతో వరి సాగు ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల బోర్ల కింద నార్లు పోసి నాటేసిన వరి మళ్లు పగుళ్లు వారి పోయాయి. ఆరుతడి పంటలతో పాటు వరి, పత్తి మొదలగు పంటలు వర్షాలు లేక వాడిపోయే దశకు చేరుకున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగ ర్భ జలమట్టం పడిపో వడంతో బోర్లలో కూడా నీరు రావడం లేదని వాపోతున్నారు. పంట లను రక్షించుకునే అవకాశం లేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
35 శాతం లోటు వర్ష పాతం
తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ప్రకారం జులై 16 నాటికి తెలంగాణలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 27 జిల్లాల్లో 20 నుంచి 60 శాతం తక్కువ వర్షం కురిసింది. జులైలో మిగిలిన రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 243.4 మిల్లీమీటర్లు కాగా కేవలం 159.1 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. మేడ్చల్-మల్కాజ్‌గిరి, హన్మకొండ జిల్లాలు అత్యధిక లోటు (60 నుంచి 67 శాతం) నమోదైంది. నల్లగొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
తగ్గిన భూగర్భ జలాలు
వర్షాభావం, ఎల్‌నినో కారణంగా తెలంగాణలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. 2025 వేసవిలో 6.22 మీటర్ల సగటు భూగర్బ జలమట్టం ఉండగా, ఇప్పుడు ఏకంగా 9.47 మీటర్ల దిగువకు పడిపోయింది. 33 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో భూగర్భ జలమట్టం తగ్గింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే వేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. జూన్ నుంచి జులై వరకు నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 3 మీటర్లు తగ్గాయి. రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో సగటున 2 మీటర్లు, మిగతా జిల్లాల్లో 1 మీటరు వరకు తగ్గిందని తెలంగాణ భూగర్భ శాఖ అంచనా వేస్తోంది.
అడుగంటిన ప్రాజెక్టులు
రాష్ర్టంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీటి నిల్వలు మునుపెన్నడు లేని విధంగా పడిపోయాయి. శ్రీరామ్‌సాగర్ వంటి కీలక జలాశయాలు డెడ్ స్టోరేజ్‌కు సమీపంలో ఉండగా, 27.55 టీఎంసీ అడుగుల సామర్థ్యం గల మిడ్-మానేరు జలాశయంలో కేవలం 7.44 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. తెలంగాణ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం డెడ్ స్టోరేజీ పోగా గోదావరి బేసిన్‌లోని అన్ని భారీ, మధ్య తరహా జలాశయాల్లో వినియోగించదగిన నీటి నిల్వ కేవలం 27.69 టీఎంసీలు, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 14.81 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు తాగు నీటి అవసరాలకు కూడా సరి పోవని అంచనా వేస్తున్నారు. జులై, ఆగస్ట్ చివరి వరకు వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పోతే జలాశయాల నుండి సాగునీటి విడుదల సాధ్యం కాదని నీటి పారుదల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పత్తి మొలకలు ఎండి పోతున్నాయి. కలవేన సతీష్, కొత్తపల్లి, పెద్దపల్లి జిల్లా
నాకున్న ఏడెకరాల భూమిలో పత్తి వేశా. గింజలు నాటిన తర్వాత వర్షం కురవడంతో మొలకలు మొలిచాయి. 10 రోజులుగా వర్షం కురవక పోవడంతో మొలకలు ఎండి పోతున్నాయి. మరో వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే వేసిన పత్తి పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. ఎప్పుడు మబ్బొచ్చినా ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నాం.
వరికి నీరందడం లేదు బొడ్డు చంద్రయ్య, రాజక్కపల్లి, జగిత్యాల జిల్లా
నాకు 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 6 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి సాగు చేశా. వరి నారుకు నీరందక మళ్లల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. బోర్ నుంచి నీరందించే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు. పత్తి సైతం మొలక దశలోనే మాడి పోతుందేమోనని భయమేస్తోంది.
పెట్టుబడి కూడా దక్కదు గుర్రాల లింగమూర్తి, రాగినేడు, పెద్దపల్లి జిల్లా
నేను 10 ఎకరాల్లో పత్తి సాగు చేశా. జూన్ చివరి వారంలో కురిసిన వర్షాలకు పత్తి గింజలను నాటా. జానెడు వరకు పెరిగింది. దుక్కి దున్నడం, కలుపు తీయడం, ఎరువు వేయడం వరకు ఇప్పటికే ఎకరాకు రూ.10 వేలు ఖర్చయ్యాయి. మరో వారం రోజుల్లో వర్షం కురవకుంటే 10 ఎకరాలకు గాను రూ.లక్ష నష్టం వస్తుంది.
గోదావరి బేసిన్‌లోని ప్రాధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు (టీఎంసీల్లో)
ప్రాజెక్ట్ పేరు నిల్వ సామర్థ్యం ప్రస్తుతం నిల్వ గతేడాది నిల్వ ఇన్‌ఫ్లో (కూసెక్కులు) డెడ్‌స్టోరేజీ
1).శ్రీరాంసాగర్ 90.00 15.05 20.90 288 3.5
2). శ్రీపాద ఎల్లంపల్లి 20.18 7.85 8.98 213 1.5
3).కడెం నారాయణరెడ్డి 4.70 0.46 2.39 43 0.7
4).నిజాం సాగర్ 17.80 6.54 4.70 నిల్ 2.5
5).సింగూర్ 29.91 4.53 18.48 238 1.1
6).లోయర్ మానేర్ డ్యాం 24.03 5.60 6.11 నిల్ 1.0
7).మిడ్ మానేర్ డ్యాం 25.87 7 .44 6.84 నిల్ 1.0
కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల నీటి నిల్వలు(టీఎంసీల్లో)
ప్రాజెక్ట్ పేరు నిల్వ సామర్థ్యం ప్రస్తుతం నిల్వ గతేడాది నిల్వ ఇన్‌ఫ్లో (కూసెక్కులు)
1). జూరాల 9.06 9.53 8.83 నిల్ 2.44
2). నాగార్జున సాగర్ 312.05 137.86 222 5182 132
3). శ్రీశైలం 215.81 41.89 201.58 134 3.3
4). తుంగ భద్ర 105.75 25.47 79.13 4860 32



