– వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు
– పాడుబడి ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను పరిశీలించిన ప్రజా సంఘాల నాయకులు
నవతెలంగాణ-సత్తుపల్లి
ఇండ్లులేని పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలను తక్షణమే మంజూరు చేయాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కాకర్లపల్లి వచ్చిన ఆయన రాష్ట్ర, జిల్లా ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వెంకట్రాములు మాట్లాడుతూ గత కొంతకాలంగా వ్యవసాయ కార్మిక సంఘం, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల కోసం అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నామన్నారు. నిరుపయోగంగా పడి ఉన్న 34 ఎకరాల పాత ఎన్టీఆర్ కాలువను వెంటనే పూడ్పించి, కాకర్లపల్లి పేదలతో పాటు సత్తుపల్లిలోని నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాకర్లపల్లి పేదల ఇళ్ల స్థలాల సాధన కోసం గత ఏడాది కాలంగా నిరంతరాయంగా ఎన్నో రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ల వరకు అనేక పర్యాయాలు విన్నవించారని, ప్రభుత్వ యంత్రాంగం సానుకూలంగా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి లాంటి ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. పేదల ఇళ్ల సమస్యపై నోరు మెదపకపోవడం అత్యంత దారుణమన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ మేరకు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం కింద అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేసి, నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ఉద్యమాల గడ్డ అని, ఇక్కడి ప్రజల సహనాన్ని పరీక్షించకుండా తక్షణమే ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను చేపట్టాలని, లేదంటే ఆందోళనలు తప్పవని వెంకట్రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి మాట్లాడుతూ కాకర్లపల్లి పేదల ఇండ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఐద్వా మండల కార్యదర్శి జాజిరి జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, రైతు సంఘ నాయకులు రావుల రాజబాబు, సీఐటీయూ జిల్లా నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు వ్యకాస మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, నాయకులు తడికమళ్ల రామకృష్ణ, వేపులపాటి కుమారస్వామి, బండి వేలాద్రి, ప్రజానాట్య మండలి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కండే సత్యం అయినంపూడి సనందనరావు, అలివేలు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఇమామ్ పాల్గొన్నారు.



