Saturday, July 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఏది సనాతనం? ఏది ఆధునికం?

ఏది సనాతనం? ఏది ఆధునికం?

- Advertisement -

సనాతన వాదం గురించి ఈ మధ్యకాలంలో విస్తృ తంగా చర్చ జరుగుతోంది. ఏది సనాతన వాదమో, ఏది కాదో ఎవరికీ తెలియదు. సనాతన వాదులమని చెప్పటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏది సనాతనమో? ఏది ఆధునికమో? తెలియని అయోమయ పరిస్థితి సాధారణ పౌరునికి వస్తుంది. బొట్లు పెట్టుకోవడం, జైశ్రీరామ్ అనటం, గుడులకి పోయి రావటమే సనాతనం అనే భావనలో ప్రస్తుత తరానికి చెందిన వారిలో అత్యధికులు ఉన్నారు. కానీ ఎప్పటినుండి ఎప్పటి వరకు ఉన్న ఆచార సంప్రదాయాలు సనాతనమో, ఎప్పటినుండి ఆచరించే ఆచార సంప్రదాయాలు ఆధునికమో ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. క్రీస్తుపూర్వానికి ముందున్న ఆచార సంప్రదా యాలని పాటించటం సనాతనమా? లేదా, ఇంగ్లీష్ వారు వచ్చేవరకు పాటించబడిన ఆచార సంప్రదా యాలు సనాతనమా? లేదా స్వతంత్ర్యం వచ్చే వరకు ఉన్న ఆచార సంప్రదాయాలు పాటించటం సనాతనమా? లేదా ఈ తరం అంటే గత పాతకేండ్ల తర్వాత పాటించేవి కూడ సనాతనమేనా? లేదా సాధువులు సన్యాసులు బ్రాహ్మణులు చెప్పేదే సనాతనమా? లేక బొట్లు పెట్టుకొని, జై శ్రీరామ్ అంటూ, గుడుల చుట్టూ తిరగటం మాత్రమే సనాతనమా? ఈ విషయాలు వివరణ ఇవ్వటానికి సరైన సనాతన వాది మీకు ఎవరూ దొరకరు.

వాస్తవానికి అందరూ ఆచరించేది ఆధునికమే. చెప్పేది మాత్రమేమో సనాతనం. అది ఎలానో చూద్దాం. సనాతనవాదానికి ప్రామాణికంగా చెప్పబడేవి మను, పరాచరస్మృతులే. వాటి ప్రకారం అయితే, మనుధర్మం ఒకటవ స్మృతి 31వ శ్లోకం ప్రకారం బ్రాహ్మణుడు పౌరోహిత్యాన్ని చేయాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయరాదు. అలా చేస్తే ఆధునికవాదం అవుతుంది. వైశ్యులు వ్యాపారాలే చేయాలి. చదువుకొని ఉద్యోగాలు చేయరాదు. అలా చేస్తే ఆధునికవాదం అవుతుంది. క్షత్రియులు యుద్ధాలు చేయాలి, రాజ్యపాలనే చేయాలి. ఇంకొక వృత్తిలో ఉండకూడదు. ఏదైనా వృత్తిలో పాల్గొంటే అది ఆధునికవాదం అవుతుంది. మను ధర్మశాస్త్రం రెండవ స్మృతి పదహారవ శ్లోకం ప్రకారం శూద్రులు, అనగా ఎస్సీ,ఎస్టీ,బీసీలు చదువుకోకూడదు. అలా చదవకుండా శూద్రుడు ఉంటే సనాతన ధర్మాన్ని పాటించినట్లు, చదువుకుంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినట్లు. 8వ స్మృతి417 వ శ్లోకం ప్రకారం ఆస్తులు కలిగి ఉండకూడదు. ఆస్తులు కలిగి ఉంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినట్లే.8 వ స్మృతి 413 వా శ్లోకం ప్రకారం పై మూడు వర్ణాలకే శూద్రులు సేవలు చేయాలి. అలా కాకుండా చదువుకొని ఉద్యోగాలు చేయడం ఆధునిక వాదం అవుతుంది. దళితులను గుడిలోకి రానివ్వకూడదనేది సనాతన వాదం. అందరితో పాటు దళితులను కూడా గుడిలోకి అనుమతించడం ఆధునికవాద మవుతుంది.

సనాతన వాదానికి మరో ప్రామాణికమైన ఐత్రియ బ్రాహ్మణీయం (111. 9.8) ప్రకారం గోమాంసం అంటే ఎద్దు,ఆవు ల మాంసాన్ని తింటేనే నిజమైన సనాతన వాదం అవుతుంది. ప్రత్యేకంగా విందులో తద్దినాలలో బ్రాహ్మణులకు ఎద్దు, అవు మాంసాలని వడ్డించాలి. అలా తిన్న బ్రాహ్మణుడే సనాతన వాది. గోమాంసం తినని వాడు ఆధునిక వాది అవుతాడు. పరాచర స్మృతి(2-9)ప్రకారం అమ్మాయిలకు పుష్పవతి కాకముందే పెళ్లి చేయాలి. 4-18 ప్రకారం భార్య భర్త అనుమతి లేకుండా ఏ పని స్వతంత్రంగా చేయకూడదు. భర్తని భార్య అనుమానించకూడదు. ప్రశ్నించకూడదు.10-18 ప్రకారం భర్త చనిపోతే అతని చితిలోనే భార్య కూడా పడి చనిపోవాలి. ఇవన్నీ పాటిస్తే సనాతన వాదులు అవుతారు. ఇవన్నీ పాటించని వారంతా ఆధునికలవుతారు. ఇలాంటివి సమకాలీన సమాజంలో అనేకం చూడవచ్చు. ఉదాహరణ లుగా చెప్పుకోవాలంటే… సనాతనవాదులు ప్రయాణాల కోసం ఎడ్లబండ్లను లేదా గుర్రాలను వాడాలి. ఆధునికులు వాడే బైకులను, కారులను, బస్సులను, రైళ్లను, విమానాలను వాడకూ డదు. ఫోన్లు,మొబైల్ కంప్యూటర్లు వాడకూడదు. అలా వాడితే సనాతన వాదాన్ని వదిలి ఆధునికవాదాన్ని ఆమోదించినట్లు అవుతుంది.

అవసరం లేదనుకుంటే పుట్టగానే ఆడపిల్లని చంపేయటం సనాతనవాదం.చంపటం తప్పు అని చెప్పటం ఆధునిక వాదం. కులాలని బట్టి శిక్ష వేయాలి,అగ్రకులాలు ఎంత పెద్ద తప్పు చేసినా చిన్న శిక్షలు వేయాలి, చిన్న కులాల వారు ఎంత చిన్న తప్పు చేసినా పెద్ద శిక్షలు వేయాలనేది సనాతనవాదం.నేరాన్ని బట్టి కులాలకతీతంగా శిక్షలుండాలనేది ఆధునిక వాదం.కొత్తగా పెళ్లయిన శూద్రుల ఆడపిల్లలు మొదటి మూడు రాత్రులు బ్రాహ్మణులతో గడపాలనేది సనాతన వాదం. దీనిని వ్యతిరేకించేది ఆధునిక వాదం. దేవదాసి విధానం ఉండాలని అది ఆచారంలో భాగమనేది సనాతనవాదం. ఈ విధానం ఉండకూడదు అనేది ఆధునికవాదం. ‘‘చరక్ పూజ’’ పేరిట శూద్రులను నరబలులు ఇవ్వాలనేది సనాతనవాదం. ఇది అమానుషం, ఉండకూడదు అనేది ఆధునిక వాదం.భర్తలు చనిపోతే ఇంకొక పెళ్లి చేసుకోకూడదు, కానీ భార్యలు చనిపోతే భర్తలు ఎన్నైనా పెళ్లి చేసుకోవచ్చు అనేది సనాతన వాదం. భర్తలైనా భార్యలైనా రెండో వివాహం అనగా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చనేది ఆధునికం. ఎవరి కులంలో వారే పెళ్లి చేసుకోవాలి అనేది సనాతన వాదం. కులాలని పాటించకుండా ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆధునిక వాదం. కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేయాలి అనేది సనాతన వాదం. కులాంతర వివాహాలు జాతి ప్రయోజనాల కొరకే కాబట్టి విరివిగా ప్రోత్సహించాల నేది ఆధునిక వాదం.

సనాతన వాదం అంటే సమాజాన్ని చీల్చేది. మనుషుల మధ్య వైశ్యామ్యాలు పెంచేది. మూఢనమ్మకాలను అంద విశ్వాసాలను ప్రోత్సహించేది. సమాజ పురోగమనానికి ఆటంకమయ్యేది. అలాంటి సనాతన వాదనాలను సమాధి చేయాలి. కుల, మత వివక్ష లేని సమసమాజంగా దేశం పురోగమించాలి. మనదేశం ప్రపంచ దేశాలతో పోటీపడా లంటే, అగ్ర రాజ్యంగా నిలవాలంటే ఆధునిక వాదం విస్తరించాలి. తిరోగమన వాదాలను తిరస్కరించాలి. సనాతనవాదం గురించి స్వామి వివేకానందుడు ఏమన్నాడో గమనించండి. ‘‘మన ముఖం మీద బొట్టును ఈ తీరుగా పెట్టుకోవాలా? ఆ తీరుగా పెట్టుకోవాలా అంటూ శతాబ్దాల కొద్ది ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నాం ఒక మనిషి దృష్టి అన్నాన్ని మైలపరుస్తుందా?లేదా? అనే సమస్య లను గూర్చి సంపుటాలు సంపటాలుగా గ్రంధాలు రాస్తున్నాం. కొన్ని శతాబ్దాలుగా మనం చేస్తున్న పని అంతా ఇదే. ఇలాంటి సమస్యలతోను, మెదడు బలాన్నంతటిని వినియోగిస్తున్న జాతి ఇంకా ఏ ఘన కార్యము చేయగలదని మనం విశ్వసించగలం?’’అని ‘‘శ్రీ వివేకానంద సాహితి సర్వస్వం, సంపుటి 6, పేజీ 133’’లో రాయబడిన విషయం అందరి గమనంలో ఉండాల్సిన అవసరం ఉంది.

జి. రాములు, 9490098006

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -