Thursday, July 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఒక మనిషి తినడం మానేశాడు..ఒక దేశం వినడం మానేసింది!

ఒక మనిషి తినడం మానేశాడు..ఒక దేశం వినడం మానేసింది!

- Advertisement -

ప్రజాస్వామ్యంలో ఒక మనిషి ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది సాధారణ రాజకీయ ఘటన కాదు. అది ఒక సమాజం నైతిక ఆరోగ్యాన్ని పరీక్షించే క్షణం. ఎందుకంటే, ఒక మనిషి తన శరీరాన్ని క్రమంగా మరణానికి అప్పగిస్తూ కూడా ఒక మాటను, ఒక డిమాండ్‌ను, ఒక ఆవేదనను వినిపించడానికి ప్రయత్నిస్తున్నా‌డంటే సమస్య కేవలం ఒక రాజకీయ వివాదం కాదు. అక్కడ సంభాషణ విఫలమైంది. వినాల్సిన స్వరం వినిపించబడలేదు. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాథమిక బాధ్యత అయిన ‘వినడం’ అనే గుణాన్ని అది కోల్పోయింది. నేడు ప్రముఖ పర్యావరణ విద్యావేత్త సోనం వాంగ్‌‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఆ వ్యక్తి ఆకలి కాదు, ఒక సమాజపు అంతరాత్మ. ప్రజాస్వామ్యంలో మాటకు తలుపులు మూసుకుపోయాయని ఒక పౌరుడు భావించినప్పుడు అతను తన శరీరాన్ని ఒక వాదనగా మార్చుకుంటాడు. ఆమరణ నిరాహార దీక్ష వెనుక ఉన్న విషాదం ఇదే. అది ఆహారాన్ని తిరస్కరించడం కాదు, తన ఆవేదనను నిర్లక్ష్యం చేసిన వ్యవస్థను ఎదుర్కొనే చివరి ప్రయత్నం. ఆకలి శరీరాన్ని బాధిస్తుంది.

కానీ నిర్లక్ష్యం మనసుని వేధిస్తుంది. ఒక మనిషి తన సమస్యకు సమాధానం కోసం ఎదురుచూస్తూ తన స్వరం ఎక్కడా ప్రతిధ్వనించకపోతే అతను చేసిన డిమాండ్లకంటే వాటిపై కనిపించే ప్రభుత్వ మౌనమే పెద్దదిగా కనిపిస్తుంది. అక్కడే ప్రజాస్వామ్యం పరీక్షకు నిలబడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేయడంలోనే కాదు. ప్రజల మాటలను వినడంలో కూడా జీవిస్తుంది. నేడు సోనం వాంగ్‌‌చుక్ ఆకలితో కూర్చున్నాడు. అయితే ఆయన పోరాటం అన్నం కోసం కాదు. అది ఒక సమాజపు భవిష్యత్తు కోసం మనిషి ఎంత దూరం వెళ్లగలడో చూపించే సంకల్పంగా మారింది. ఆయన శరీరం బలహీనపడుతున్న కొద్ది ఒక ప్రశ్న బలపడుతుంది. ఆయన ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తాడన్నది కాదు.ఆయన లేవనెత్తిన డిమాండ్లకు సమాధానం ఎప్పుడు వస్తుందన్నది. ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి. కానీ, ప్రశ్న ఇంకొకటి ఉంది. ఒక పౌరుడు తన స్వరాన్ని వినిపించడానికి కాదు. వినిపించిన స్వరానికి సమాధానం పొందడానికి ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక సమాధానంతో ముగియాల్సిన విషయం ఇంత తీవ్రమైన రూపాన్ని ఎందుకు దాల్చింది? అన్నదే.

అలాంటి పరిస్థితులు ఒక్కసారిగా ఏర్పడవు. ప్రతి అధికారం కాలక్రమేనా తనకంటూ ఒక మానసిక తర్కాన్ని నిర్మించుకుంటుంది. ఆ తర్కం బలపడిన కొద్ది డిమాండ్ లోని న్యాయం కంటే అందులోని సవాలే ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు సమస్య న్యాయం వెనక్కి వెళ్లి అధికారపు ప్రతిష్ట ముందుకు వస్తుంది. సమాధానం ఇవ్వడం కంటే ఆలస్యం చేయడం సులభం అవుతుంది. మనిషి కంటే ఫైల్ ముఖ్యమవుతుంది. చివరికి అది ప్రజాస్వామ్యం మీదే ఒక ప్రశ్నగా నిలుస్తుంది. ఇక్కడి నుంచే అధికారం ఒక మౌన గోడను నిర్మించుకుంటుంది. ఆ గోడ రాళ్లతో కాదు. పదాలతో నిర్మితమవుతుంది. ‘పరిశీలనలో ఉంది’, ‘చర్చలు జరుగుతున్నాయి’ వంటి పదాలు కొన్నిసార్లు స్పందనలా వినిపించినా, ప్రజల దృష్టిలో అవే గోడకు ఇటుకలుగా కనిపిస్తాయి. వాంగ్‌‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష విషయంలో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి విమర్శనలనే ఎదుర్కొంటుంది. ఒక మనిషి ఇంత స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు అతని ఆందోళనను గుర్తించే కనీస రాజకీయ మర్యాద కూడా కనిపించడం లేదని భావన ప్రజల్లో పెరుగుతుంది. ఇక్కడ ప్రజలను కలవర పెడుతున్నది కేవలం వాంగ్‌‌చుక్ నిరాహార దీక్ష మాత్రమే కాదు. ఆ దీక్షకు అధికార వర్గం నుంచి కనిపిస్తున్న ప్రతిస్పందన కూడా. ఒకవైపు అతని ఆరోగ్యం క్షీణిస్తుంది అనే వార్తలు వస్తుంటే, మరోవైపు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ కార్యక్రమాలతో పాటు విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు చర్చకు వస్తున్నాయి.

రాజకీయంగా ఇందులో వివరణలు ఉండొచ్చు. కానీ ప్రజలు దృశ్యాలను కూడా చదువుతారు. ఒకవైపు ఆకలితో పోరాడుతున్న మనిషి, మరోవైపు కదలిక లేని అధికార ధోరణి ఈ వ్యత్యాసమే ప్రజల మనసుల్లో ఆందోళనతో పాటు అనుమానం కూడా కలిగిస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని మాత్రమే కాదు. సమాజాన్ని కూడా. ఎందుకంటే ప్రతి ఆమరణ నిరాహార దీక్ష ముందు ఒక అధికారం ఉంటుంది. దాని వెనుక ఒక సమాజం కూడా ఉంటుంది. ఒక మనిషి తన జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకునే స్థితికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మాత్రమే కనిపించడు.వ్యవస్థ వైఫల్యం కూడా కనిపిస్తుంది. అందుకే అతను మన ముందుంచిన నైతిక సవాలను విస్మరించే హక్కు ఎవరికీ లేదు. నేడు ప్రమాదం ప్రభుత్వం మౌనం మాత్రమే కాదు సమాజం అలవాటు పడిన మౌనం కూడా. అందుకే నేడు మన ముందున్న దృశ్యంలో కనిపిస్తున్నది ఒక ఆమరణ నిరాహార దీక్ష మాత్రమే కాదు. ఒక అద్దం. ఆ అద్దంలో వాంగ్‌‌చుక్ మాత్రమే కనిపించడం లేదు. మన రాజకీయ సంస్కృతి, అధికారపు అహంకారం కనిపిస్తోంది. ఒక మనిషి తన శరీరాన్ని నిరసనగా నిలబెట్టాడు. ఆ ప్రయత్నానికి సమాధానం ఈరోజు రాకపోవచ్చు.రేపూ రాకపోవచ్చు. కానీ చరిత్రకు ఒక అలవాటు ఉంది. అది ఆకలితో కూర్చున్న మనిషిని మాత్రమే గుర్తుంచుకోదు. అతను అడిగిన జవాబుదారితనాన్ని ఎవరు స్వీకరించారు? ఎవరు విననట్టుగా నటించారు? అన్నదాన్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది. ప్రజలు తీర్పు చెప్పడానికి ఆలస్యం చేయవచ్చు. కానీ చరిత్ర ఎప్పుడు ఆలస్యం చేయదు.

ఆయిరబోయిన భిక్షపతి, 7993248717

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -