Friday, July 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచరిత్ర మోడీని ఎలా గుర్తుంచుకుంటుంది?

చరిత్ర మోడీని ఎలా గుర్తుంచుకుంటుంది?

- Advertisement -

చరిత్ర కొందరిని కొన్ని విజయాల కారణంగా, మరికొందరిని వారు తీసుకున్న నిర్ణయాల ప్రభావం కారణంగా గుర్తుంచుకుంటుంది. దేశాన్ని పాలించిన ప్రతి ప్రధానమంత్రి తనదైన ముద్రను భారత చరిత్రపై వదిలి వెళ్లారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసి బహుళార్థసాధక ప్రాజెక్టులు, ఐఐటీలు, ఇస్రో వంటి పరిశోధనా సంస్థలను నెలకొల్పి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్-జై కిసాన్‌’ నినాదంతో దేశంలో హరిత విప్లవానికి, శ్వేత విప్లవానికి పునాది వేశారు. 1965 భారత్ – పాక్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించి, అత్యంత నిరాడం బరమైన, నీతివంతమైన నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. ఇందిరా గాంధీ జాతీయ భద్రత, అంతర్గత సంక్షోభాల సమయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్న నాయకురాలిగా నిలిచి ‘ఉక్కు మహిళ’గా చరిత్రలో స్థానం సంపాదించారు. పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా దేశాన్ని ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నుండి కాపాడారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం , విద్యా హక్కు చట్టం వంటి చారిత్రాత్మక హక్కుల ఆధారిత చట్టాల ద్వారా సామాన్యుడికి, బలహీన వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పించిన శాంతస్వభావుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

నరేంద్రమోడీ తన పన్నేండేండ్ల పాలనతో నెహ్రూను దాటేశానని చెబుతున్నారు. ఎంతకాలం పనిచేశామని కాదు, దేశానికి ఏ మేలు చేశారన్నదే ముఖ్యం. భవిష్యత్తులో చరిత్ర మోడీని ఏ విధంగా గుర్తుంచుకుంటుంది? అంటే, విమర్శకులు, రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఆయన పాలన భారత రాజ్యాంగ పునాదులను, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసిన కాలంగా, అధికార దుర్విని యోగానికి పరాకాష్టగా గుర్తుండిపోతుంది. ఆయన రాజకీయ ప్రయాణం మొదటి నుంచి తీవ్ర వివాదాలతో కూడుకున్నది. 2002 గుజరాత్ అల్లర్ల మరక ఆయన రాజకీయ జీవితాన్ని విశ్లేషించే ప్రతి చర్చలోనూ ప్రముఖంగా వస్తుంది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చాక, దేశంలో మతపరమైన ధ్రువీకరణ పరాకాష్టకు చేరిందనే విమర్శ ఉంది. గోరక్షణ పేరిట జరిగిన మూక దాడులు, విద్వేష ప్రసంగాలు పెరగడం, పౌరసత్వ సవరణ చట్టం , జాతీయ పౌరుల నమోదు వంటి నిర్ణయాలు మైనారిటీలలో, ముఖ్యంగా ముస్లింలలో తీవ్ర అభద్రతా భావాన్ని సృష్టించాయి. దేశ శతాబ్దాల నాటి లౌకికత్వ భావనను దెబ్బతీసి, సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించారనేది ఆయనపై ఉన్న అతిపెద్ద ఆరోపణ.

అలాగే 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అసంఘ టిత రంగం, చిన్న వ్యాపారాలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. నల్లధనం అరికట్టడమనే లక్ష్యం నెరవేరకపోగా, వందలాది మంది సామాన్యులు బ్యాంకుల ముందు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని ఒక ‘పిచ్చి నిర్ణయం’ గా విమర్శకులు అభివర్ణిస్తారు. అలాగే, ప్రభుత్వరంగ సంస్థల(ఎల్‌ఐసి, ఎయిర్ ఇండియా, రైల్వేలు, పోర్టులు) విచక్షణారహిత ప్రయివేటీకరణ ద్వారా దేశ ప్రజల ఆస్తులను కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టారనేది బహిరంగంగానే చర్చ జరుగుతోంది. మోడీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలోని స్వతంత్ర సంస్థలైన ఈడి, సిబిఐ, ఐటి, ఈసి, న్యాయవ్యవస్థ సైతం ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయాయనే ఆందోళన బలంగా వ్యక్తమైంది. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, ప్రాంతీయ ప్రభుత్వాలను కూల్చడానికి దర్యాప్తు సంస్థలను ఒక ఆయుధంగా వాడుకున్నారనే విమర్శ ఉంది. నిర్ణయాధికారం కేవలం పీఎంఓ చేతుల్లోనే కేంద్రీకృతమై, సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల హక్కులను కాలరాశారని విమర్శకులు వాదిస్తారు.

ప్రశ్నించే మీడియా గొంతుకలను నొక్కేయడం, భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే జర్నలిస్టులు, సామా జిక కార్యకర్తలపై కఠినమైన చట్టాలను (ఉపా వంటివి) ప్రయోగించి జైళ్లలో పెట్టడం ఈ కాలంలో విరివిగా జరిగింది. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ స్థానం దిగజారడం, ప్రభుత్వానికి భజన చేసే ‘గోదీ మీడియా’ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. రాజకీయాల్లో ప్రజాస్వామ్య పద్ధతులకు భిన్నంగా తీవ్రమైన వ్యక్తి ఆరాధనను ప్రోత్సహించా రనే విమర్శ ఉంది. తాను సాధారణ జీవశాస్త్ర ప్రక్రియ ద్వారా జన్మించలేదని, పరమాత్మ తనను ఒక ప్రత్యేక కార్యం కోసం పంపిందని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం.. ప్రజాస్వామ్య ప్రధానిగా కాకుండా, ఒక సర్వాధికారిలాగా తనను తాను భావించుకునే మానసిక స్థితిని సూచిస్తుందని విమర్శకులు ఎండగట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి వంటి నైతికత, మన్మోహన్ సింగ్ వంటి పారదర్శకమైన, చట్టబద్ధమైన హక్కుల పాలనతో పోల్చినప్పుడు.. మోడీ పాలన ప్రజాస్వామ్య విలువల పతనానికి, అధికార కేంద్రీకరణకు సాక్ష్యంగా నిలుస్తుందని విమర్శకుల స్పష్టమైన వాదన. చరిత్ర మోడీని కేవలం ఒక శక్తివంతమైన ప్రచారకర్తగా మాత్రమే కాకుండా, దేశ సామాజిక ఐక్యతను, ఆర్థిక పునాదులను, రాజ్యాంగ స్వేచ్ఛను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన నాయకుడిగా కూడా రికార్డు చేసే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ ప్రభావాలపై అంతిమ తీర్పును కాలమే నిర్ణయిస్తుంది.

యండి. ఉస్మాన్ ఖాన్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -