విద్యావేత్త, విద్యా కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహారదీక్ష చేపట్టి ఇప్పటికి రెండు వారాలు దాటిపోయాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి బాధ్యత, స్పందన లేని స్థితిలో ఆయన ప్రాణాలు ప్రమాదాన్ని ఎదుర్కొం టున్నాయి. సమాజంలో వివిధ విద్యార్థి బృందాల నుంచి విశాల ప్రజాస్వామిక, లౌకిక వర్గాల నుంచి ఆయనకు విస్తారమైన సంఘీభావం వ్యక్తమవు తున్నది. భారతీయ విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్న స్థితిలో వుందో దేశం దృష్టికి తేవడంలో ఆ దీక్ష జయప్రదమైంది. సహజంగానే విద్యామంత్రి రాజీ నామా చేయాలన్నది ఇక్కడ ప్రధాన కోర్కెగా ముందు కొచ్చింది. కానీ వాస్తవానికి విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక విధాలైన సంక్లిష్ట ఆందోళనలను అది మొత్తంగా బయిటపెట్టింది. రాజ్యాంగ మూల స్ఫూర్తి, భారత దేశ స్వాతంత్ర్యం తర్వాత విద్యా రంగానికి సంబం ధించి మనం పెట్టుకున్న లక్ష్యాలు, విధానాలు, ఎంచుకున్న నమూనా, నిర్వచించుకున్న దృక్పథం వీటన్నిటి నుంచి చాలా దూరంగా వెళ్లిపోయినట్టు కనిపిస్తుంది. వలస పాలనా వ్యవస్థ నిర్మూలనకు ఒక పదునైన అస్ర్తంగా విద్యను వినియో గించాలన్నది ప్రధాన భావనగా వుండింది. విద్యా బోధన క్రమంలో అందుబాటు, సమానతతో ప్రజాస్వామి కీకరణ చేయడం మూలస్తంభంగా పరిగణించబడింది.
ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే ఆదేశిక సూత్రాల ప్రకారం రాజ్యాంగంలోని 45వ అధికరణం ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసులో వున్న పిల్లలందరికీ విద్యాబోధన వలసానంతర ప్రభుత్వ కర్తవ్యంగా పేర్కొంది. సార్వత్రిక విద్యను నొక్కి చెప్పడంలోనే కులం, మతం, తెగ, జాతి తేడాలు, ఆర్థిక పరాధీనత వంటి అంశాలతో నిమిత్తం లేకుండా అందరికీ అందించాలన్న వక్కాణింపు వుంది. 1993లో సుప్రీం కోర్టు అదివరకు తానిచ్చిన మోహినీ జైన్ కేసు తీర్పును వెనక్కు తీసుకుని 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని చెప్పింది. చార్రితాత్మకమైన ఈ తీర్పు ప్రత్యక్ష ప్రభావంతో 21ఎ అధికరణం వచ్చింది. అది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా జొప్పించబడింది. ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసులో వున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యా బోధన తప్పనిసరి చేసింది. పసి వయసులో పిల్లల పోషణ, విద్య కోసం చురుకైన పథకాలు మొదలైనాయి. నిధుల కొరత వల్ల పూర్తి ఫలితాలు సాధించడంలో కొరత వున్నా అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకాలు ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేశాయి. కానీ నిస్సందేహంగా పథకాల మూల సూత్రం మాత్రం మంచిదే.
నీతి ఆయోగ్ నివేదిక
ఏమైనా 80వ దశకం మధ్య కాలం నుంచి ఈ పరిస్థితి క్రమేణా మారడం మొదలెట్టింది. ఆర్థిక వ్యవస్థలో నయా ఉదారవాద సంస్కరణలు మొదలైనాక పూర్తిగా తలకిందులైంది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడమే కీలకమనే విధానం పూర్తిగా మార్చబడకపోయినా గట్టి పోటీ ఎదుర్కొన్నది. 1990ల నుంచే విద్యా విధానం క్రమంగా వాణిజ్యీకరణ, కేంద్రీకరణ, కొంతవరకూ మతైకరణ అనే మూడు విధాల మారింది. మూడు ‘సి’ల ప్రాబల్యం పెరిగిపోయింది. మోడీ సర్కారు గట్టిగా స్థిరపడ్డాక కార్పొ రేటీకరణ, కాషాయీకరణ అనేవి పూర్తిగా విజృంభించాయి. 2020 జాతీయ విద్యా విధానం (ఎన్.ఇ.పి) ఒకవైపున ఆరెస్సెస్ ద్వారా రూపొందించబడితే మరోవైపున కార్పొరేట్ లాభార్జనకు వీలుగా తయారైంది. 2020 ఎన్‌ఇపి గురించి పైపై ఆర్భాటాలతో దాని నిజస్వరూపమేమిటో ప్రజలు మొత్తం సమాజం కూడా గమనించలేకపోయారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి దాని దెబ్బ ఏమిటో పంజా గుర్తులు, గోళ్ల రక్కులతో సహా దర్శనమిస్తున్నాయి. అది ఇక ఎంతమ్రాతం ఊహలలో లేదు. పూర్తి నివేదికనే వచ్చేసింది. నీతి ఆయోగ్ లెక్క ప్రకారం గత దశాబ్దిలో దేశ వ్యాప్తంగా 94,000 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. విస్తరించడం మాట అటుంచి అసలు చేరే పిల్లల సంఖ్య 2.26 కోట్లు తగ్గిపోయింది. రోజుకు 25 పాఠశాలలు మూతపడు తున్నాయి.
ప్రత్యేకించి గ్రామీణ భారతం దృశ్యం ఎంత ఘోరంగా వుందో అదే నివేదిక స్పష్టం చేసింది. ఈ వివరాలను మరింత లోతుగా మధించి చూస్తే ఆదివాసులు, దళితులు అధికంగా నివసించే ప్రాంతాలే హెచ్చుగా నష్టపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు 2014-15లో 11.07 లక్షలుంటే, 2024-25 నాటికి 10.13 లక్షలకు పడిపోయాయి. ఇదే కాలంలో ప్రభుత్వ సహాయం పొందే ఎయిడెడ్ విద్యాలయాలు కూడా 83,000 నుంచి 79,000 కు తగ్గాయి. ఇందుకు భిన్నంగా మరోవైపున చూస్తే ప్రైవేటు సూళ్లు ఇదే కాలంలో 2.88 లక్షల నుంచి 3.39 లక్షలకు పెరిగాయి. ప్రైవేటు స్కూళ్లు ఇంత ఇబ్బడిముబ్బడిగా పెరగడమంటే వాటిని అందుకోవడం, అందుబాటుపై అంత ఘోరమైన ప్రభావం పడుతుందని అంతరార్థం గ్రహించాలి. ఈ విశ్లేషణ ఇంకో విషయాన్ని కూడా వెల్లడిస్తున్నది. స్కూళ్ల మూతకు అనుగుణంగానే విద్యార్థుల చేరిక కూడా తగ్గిపోయింది. 2020 విధానంలో నిర్దేశించినట్టుగా ప్రధానంగా విలీనాలు, కలిపేయడాల వల్లనే ఈ కుదింపు జరిగిందని ఆ నివేదిక అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇరుగు పొరుగు పాఠశాలలనేవి దాదాపు మాయమైపోయాయి.
పునాది దశలోనే పరిస్థితి ఇలా వుంటే తర్వాత ఉన్నత దశలో బడి మానేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్నది. భారత దేశంలో లభించే డేటా నాసిరకం అనుకున్నప్పటికీ పరిస్థితి త్రీవత మాత్రం కళ్లకు కడుతుంది. కేవలం పదేళ్ల కాలంలో భారత దేశంలో కొత్తగా 550 విశ్వవిద్యాలయాలు వెలశాయి. వాటిలో అధిక భాగం ప్రైవేటు యాజమాన్యాల కింద వున్నవే. విద్యా మంత్రిత్వశాఖ ఉన్నత విద్యకు సంబంధించి అఖిల భారత సర్వే (ఎ.ఐ.ఎస్.హెచ్.ఇ) ప్రకారం దేశంలో ఈ విశ్వవిద్యాలయాలు స్థాపించే వారెవరన్నది కూడా మారిపోతున్నది. 2013-14 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి ఎ.ఐ.ఎస్.హెచ్.ఇ అందించిన ఈ డేటా చూస్తే ప్రైవేటు విశ్వవిద్యాలయాల సంఖ్య 219 నుంచి 546కు పెరిగింది. ఇది దాదాపు 149 శాతం అన్నమాట. ఇదే కాలంలో ప్రభుత్వ విద్యాలయాలు 504 నుంచి 733కు అంటే కేవలం 45 శాతం మాత్రమే పెరిగాయి.
వాణిజ్యీకరణ, కేంద్రీకరణ
ఉన్నత విద్యా పరిశోధనా రంగానికి నిధుల కూర్పు బాగా తగ్గిపోవడం కార్పొరేట్ చొరబాటును చురుగ్గా ఇతోధికంగా ప్రోత్సహించే విధానాల ఫలితమే. వాటి లాభాల వేట కోసమే. విద్యారంగం వాణిజ్యీకరణతో పాటు కీలకమైన విద్యా విభాగాలను కూడా వ్యాపారీకరించడం జరుగుతున్నది. వాణిజ్యీకరణతో పాటు విపరీత కేంద్రీకరణ కూడా ఎన్.ఇ.పి లో ప్రధానంగా ప్రోత్సహించబడింది. ఎన్.ఇ.పి రూప కల్పనలో ఆర్ఎస్ఎస్ భాగస్వామి కావడం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భారతీయ వాస్తవికత మూలాలకే ముప్పు తెచ్చిపెట్టింది. ఆ సైద్ధాంతిక స్రూతాల అమలు కోసం ఈ విపరీత కేంద్రీకరణ ప్రాణాంతక పరికరంగా పనిచేస్తున్నది. దానికి కొట్టవచ్చినట్టు కనిపించే ఒక ఉదాహరణ నేషనల్ టెస్టింగ్ అథారిటీ (ఎన్.టి.ఎ). నీట్-యు.జి నిర్వహణలో భారీ కుంభకోణంతో ఎన్.టి.ఎ అవమానకర తీరుతెన్నులు ఇప్పుడు బట్టబయల య్యాయి. కేంద్రం 2017 నుంచి నిర్వహించిన పరీక్షలన్నీ చిన్న, పెద్ద మోసాలతో భ్రష్టుపట్టాయి. ఈ కేంద్రీకరణను ఇంకా పెంచడంతో పాటు కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష తీసుకురావడంతో ఈ ప్రమాదం ఇంకా తీవ్రమ వుతున్నది. ఈ సామూహిక అవినీతిలో ప్రైవేటు విద్యాసంస్థలు కోచింగ్ పర్రిశమ చాలా పెద్ద ప్రాత పోషిస్తున్నట్టు వెల్లడైంది. న్యాయంగా ఉచితంగా విద్య అందుబాటు అనే అవకాశమే లేకుండా ధ్వంసం చేయబడుతున్నది. ఆశలన్నీ కుప్పకూలిన ఫలితంగానే విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే కోర్కె ప్రతిపక్ష సమీకరణకు ప్రధాన నినాదంగా మారింది.
పాఠ్యాంశాలకూ చేటు
విద్య నూతన నమూనాకు వాణిజ్యీకరణతో పాటు కేంద్రీకరణ మరో మూలస్తంభంగా తయారైంది. అన్ని కేంద్ర వ్యవస్థలు, అనుసంధాన వాహికలను కేంద్రీకరణ వల్ల ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, సంఘాలు విద్యకు సంబంధించిన అన్ని రంగాలనూ అదుపు చేసే వీలు కలిగింది. అందువల్లనే సిలబస్‌నూ పాఠాలనూ మొత్తంగా మతతత్వంతో నింపేయడం ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నదే. చరిత్ర అనేది ఇప్పుడు పురాణాలకు బందీగా మార్చబడింది. విజ్ఞానశాస్త్రం ఇది వరకటివలె అభివృద్ధిపై గాక పురాణ గాధలపై ఆధారపడేదిగా మారింది. అభివృద్ధికి అందుబాటుకూ సమానతకు ఒక సాధనంగా విద్యను హక్కును కాపాడుకోవలసిన అవసరం ఈనాడు వున్నంతగా ముందెన్నడూ రాలేదు. దీంతోపాటుగానే వైజ్ఞానిక స్పృహను పరిరక్షించుకోవడం, హేతుశీలతను నిలబెట్టుకోవడం తక్షణావసరాలుగా వచ్చి కూర్చున్నాయి. అందువల్ల ఈ లక్ష్యాల సాధన కోసం అలాంటి సువిశాల వేదికను పెంపొందించుకోవడమే కాదు. సాధారణ విద్యా వర్గాల పరిధిలోకి రాని విస్తృత సమాజాన్ని కూడా కలుపుకుని పోరాడాలి.
(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం, జులై 14)
విద్యారంగ వినాశనం దిశగా పయనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



