సంసారంలో కలతలు సహజం. భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోతే ఇలాంటివి ఎన్నొచ్చినా క్షణాల్లో పరిష్కారమవుతాయి. కానీ కొంతమంది మాత్రం ప్రతి విషయంలోనూ భాగస్వామితో కయ్యానికి కాలు దువ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మాటలు, చేతలతో వారి మనసును గాయపరుస్తుంటారు. తమది తప్పని తెలిసినా దాన్ని అంగీకరించరు.. సరికదా అన్నింట్లోనూ తామే కరక్ట్ అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఫలితంగా ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పాటు అనుబంధంలోని మాధుర్యమూ ఆవిరైపోతుంది. అయితే ఇది ఇద్దరినీ విడదీయకముందే జాగ్రత్తపడమంటున్నారు మానసిక నిపుణులు. ఇందుకోసం తమ దాంపత్య బంధంలో ప్రతికూల పరిస్థితులు రావడానికి ఇద్దరిలో కారణమెవరో గుర్తించమంటున్నారు. తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోమంటున్నారు.
గొడవలైనప్పుడు క్షణికావేశంలో భార్యాభర్తలిద్దరూ మాటా మాటా అనుకున్నా.. ఆ తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి కలిసిపోవడం చూస్తుంటాం. కానీ కొంతమంది భాగస్వామి వేసిన ప్రతి అడుగులోనూ తప్పులు వెతుకుతుంటారు. ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలో అవతలి వారు బాధతో ఓ మాట అన్నా.. విడాకులిస్తానంటూ బెదిరిస్తుంటారు. ఇలా ప్రతి చిన్న విషయానికీ విడాకులిస్తాననడం వారి అభద్రతా భావానికి సంకేతమంటున్నారు నిపుణులు. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి, అనుబంధంలో కలతలు రేగడానికి అసలు కారణం వారేనంటున్నారు.
స్వేచ్ఛను హరించొద్దు
మ-ంచి జరిగితే తమకు ఆపాదించుకోవడం, చెడు జరిగితే ఇతరుల పైకి నెట్టేయడం.. ఇలా కొంతమంది చేస్తుంటారు. కొందరు దంపతుల్లోనూ ఇలాంటి ప్రవర్తనను గమనించచ్చు. ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమే అయినా.. తప్పుల్ని భాగస్వామి పైకి నెట్టేసే వారే తమ అనుబంధంలో కలతలకు అసలు కారణమని గ్రహించమంటున్నారు నిపుణులు. మరో విషయం ఏమిటంటే భార్యాభర్తలే అయినా.. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఈ విషయాన్ని విస్మరించి కొంతమంది తమ భాగస్వామి ఇలాగే ఉండాలి.. ఈ తరహా దుస్తులే వేసుకోవాలి.. నాకు నచ్చినట్లుగానే నడచుకోవాలి.. అంటూ ఆంక్షలు పెడుతుంటారు. ఇది అవతలి వారికి నచ్చక చీటికీ మాటికీ గొడవలవుతుంటాయి. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఆంక్షలు పెట్టిన వారే కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి హద్దులు దాటనంత వరకు ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించకపోవడం మంచిదంటున్నారు.
పనులు కలిసి చేసుకోవాలి
అతి ఆలోచనల వల్ల కూడా దాంపత్య బంధంలో అరమరికలొస్తాయంటున్నారు నిపుణులు. కనుక భాగస్వామికి సంబంధించిన ప్రతి విషయాన్నీ లోతుగా పరిశీలించి చూడడం, విశ్లేషించడం వల్ల.. అందులో పొరపాట్లు లేకపోయినా ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు కారణమవుతుంది. కాబట్టి దంపతులిద్దరిలో ఎవరు ఇలాంటి ఆలోచన విధానంతో ఉంటే.. వారే దాంపత్య బంధంలో కలతలు రేగడానికి అసలు కారణం అంటున్నారు నిపుణులు. అటు ఉద్యోగ బాధ్యతల్ని, ఇటు ఇంటి బాధ్యతల్ని సమానంగా పంచుకుంటున్నారు ఈతరం భార్యాభర్తలు. అయితే కొంతమంది ఇంటి పనుల విషయానికొస్తే.. అది నా పని కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అన్ని పనులు భాగస్వామి చేసుకున్నప్పటికీ.. కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రారు. ఈ నిర్లక్ష్యమే ఇద్దరి మధ్య దూరం పెంచుతుంది.
తెలుసుకుంటే సరిపోదు..
దాంపత్య బంధంలో కలతలు రేగడానికి కారణమెవరో గుర్తిస్తే సరిపోదు.. ఆయా సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా ఆలోచించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పొరపాటు ఇద్దరిలో ఎవరిదైనా.. ఒప్పుకొని భాగస్వామిని క్షమాపణ కోరడం.. ఇకనుంచైనా ఒకరి మనసు మరొకరు తెలుసుకొని మసలుకోవడం.. వంటివి సమస్య అక్కడితో సద్దుమణిగేలా చేస్తాయి. అలాకాకుండా.. కొంతమంది మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు రావడానికి తామే కారణం అని తెలిసినా.. తమను తాము మార్చుకోవడానికి, అవతలి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. పైగా ఎవరి మాట వినను అన్నంత మొండిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి కౌన్సెలింగ్ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
పాత విషయాలు వద్దు
‘నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు’, ‘బయటికి వెళ్దాం అని చెప్పి ఆలస్యంగా ఎందుకు వచ్చావ్’, ‘నీకు రోజూ మీటింగ్లు ఎక్కువైపోతున్నాయి’, ‘ఈరోజు వంట బాధ్యత నీదే..’ ఇవన్నీ చూడటానికి మామూలు సంభాషణల్లానే ఉన్నా… ఇవే హద్దులు దాటి పెద్దవిగా మారుతున్నాయి. ఎందుకంటే దంపతులిద్దరూ వాదించుకునేటప్పుడు వీటికే పరిమితం కావడం లేదు. హద్దులు దాటి పాత విషయాల్నీ తవ్వడం మొదలుపెడుతున్నారు. దాంతో ఆ తగాదా చినికి చినికి గాలివానగా మారుతోంది. దీన్నే ‘కిచెన్ సింకింగ్’ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత ప్రశ్న, సమస్య గురించి మాట్లాడటం మానేసి… తమదగ్గర సరైన సమాధానాలు లేనప్పుడు, డిఫెన్స్ మెకానిజం కోసం పాత విషయాలు, తప్పులు, బాధలు, హేళనలు ప్రస్తావించడం. దాంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మనస్తాపానికి కారణం అవుతున్నాయి. వీటన్నింటి వల్లా విడిపోవడానికి కూడా వెనకాడటం లేదు దంపతులు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులే ఎక్కువయ్యాయనీ చెబుతున్నారు ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు.
దీన్నుంచి బయటపడాలంటే…
ఒకసారి ఒక సమస్య మీద మాట్లాడటానికే దృష్టి పెట్టమంటున్నారు. పాత విషయాల్ని తీసుకురాకూడదు. పరిష్కారం కోసమే మాట్లాడాలి. ‘నువ్వు’, ‘నాకు’ అనే పదాలు ఎక్కువగా వాడకండి. ఇవి ఎదుటివాళ్లపై దాడిచేసినట్లే అనిపిస్తాయి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కొంత విరామం తీసుకుని ప్రశ్నిస్తే… భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. బాధను, అసంతృప్తిని మనసులో దాచుకోకుండా ఎప్పటిది అప్పుడు మాట్లాడే వాతావరణాన్ని సృష్టించుకోండి. ఎవరు తప్పు చేశారు అనే దాని కంటే… సమస్య మళ్లీ రాకుండా ఏం చేయాలి అనే దానిమీద మాట్లాడేందుకు ప్రయత్నించండి. స్పష్టంగా చెప్పాలంటే గతాన్ని నిరూపించడానికో, అవతలి వాళ్లని నిందించడానికో పూనుకోకుండా వర్తమానాన్ని ఎలా మెరుగుపరచాలి అన్న అంశం మీద మాట్లాడుకునేట్లు అయితే… బంధాలు పదిలంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరి ప్రయత్నిస్తారు కదా..!
ఎవరు తప్పు చేశారు అనే దాని కంటే… సమస్య మళ్లీ రాకుండా ఏం చేయాలి అనే దానిమీద మాట్లాడేందుకు ప్రయత్నించండి. బాధను, అసంతృప్తిని మనసులో దాచుకోకుండా ఎప్పటిది అప్పుడు మాట్లాడే వాతావరణాన్ని సృష్టించుకోండి. ఎవరు తప్పు చేశారు అనే దాని కంటే… సమస్య మళ్లీ రాకుండా ఏం చేయాలి అనే దానిమీద మాట్లాడేందుకు ప్రయత్నించండి.
ఒక సారి ఒక సమస్య మీద మాట్లాడటానికే దృష్టి పెట్టమంటున్నారు. పాత విషయాల్ని తీసుకురాకూడదు. పరిష్కారం కోసమే మాట్లాడాలి. ‘నువ్వు’, ‘నాకు’ అనే పదాలు ఎక్కువగా వాడకండి. ఇవి ఎదుటివాళ్లపై దాడిచేసినట్లే అనిపిస్తాయి.



