నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు చాట్ల శ్రీశైలం ఇటీవల మరణించిన నేపథ్యంలో గురువారం నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ హాజరై నివాళులర్పించారు.
కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ, చాట్ల శ్రీశైలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ చాట్ల శ్రీశైలం కామారెడ్డి పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పించిన దాతృత్వ స్వభావం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారని అన్నారు. తమ వ్యాపార సంస్థల ద్వారా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమాజానికి సేవలందించిన వ్యక్తి అని కొనియాడారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీశైలం ఎల్లప్పుడూ ముందుండేవారని, అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ వెనుకాడని మంచి మనసున్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.
శ్రీశైలం మృతి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా కామారెడ్డి జిల్లాలో ఆయన సంస్థలతో అనుబంధం ఉన్న వేలాది కుటుంబాలకు తీరని లోటని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇలియాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ జెడ్పిటి నిమ్మ మోహన్ రెడ్డి, ఇప్ప శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని చాట్ల శ్రీశైలం కు నివాళులర్పించారు.



